Begin typing your search above and press return to search.

కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్న వివాహిత ..పిల్లల్ని కాల్వలో ముంచి...

By:  Tupaki Desk   |   5 Jun 2020 10:09 PM IST
కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్న వివాహిత ..పిల్లల్ని కాల్వలో ముంచి...
X
కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పిల్లలతో కలిసి కాల్వలోకి దూకిన ఓ వివాహిత చివరకు ప్రాణాలు కోల్పోగా, పిల్లలు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన పై పూర్తివివరాలు చూస్తే.. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామానికి చెందిన రాచమళ్ల స్వరూపరాణి, శ్రీనివాసరావులకు 14ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి అభిషేక్‌ (13), కీర్తన (12) అని ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అయితే ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరగ్గా, తీవ్ర మనస్తాపానికి గురైన స్వరూపరాణి పిల్లలిద్దరినీ వెంటబెట్టుకుని పది గంటలకు ఇంటి నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు విజయవాడ బస్టాండుకు చేరుకుంది. అక్కడి నుంచి దుర్గాఘాట్‌, ప్రకాశం బ్యారేజీ తదితర ప్రదేశాల్లో తిరిగి సాయంత్రానికి పిల్లలిద్దరితో కలిసి విజయవాడ నగరపాలక సంస్థ సమీపంలోని బందరుకాలువ వద్దకు చేరుకుంది. గురువారం తెల్లవారుజామున 3గంటల 30నిమిషాలకు పిల్లలిద్దరినీ బలవంతంగా కాలువలోకి లాక్కెళ్లి చేతులతో నీటిలోకి అదిమేసింది.

అయితే, కాల్వలో నీటిమట్టం 4 అడుగులకు మించకపోవడంతో పెద్దగా ప్రవాహ వేగం కూడా లేదు. దీంతో పిల్లలిద్దరూ తల్లి నుంచి తప్పించుకుని ఒడ్డుకు చేరుకున్నారు. స్వరూపరాణి మాత్రం నీటిలోనే మునిగిపోయి చనిపోయింది. కుమార్తె కీర్తన ఒడ్డుకు చేరుకుని సమీపంలోని వారికి చెప్పగా.. వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని వివాహిత మృతదేహాన్ని బయటకు తీశారు.

అయితే, ఎలాగోలా తల్లి చేతుల్లోనుండి తప్పించుకొని ఒడ్డుకు చేరుకున్న కీర్తనకు తన అన్నయ్య అభిషేక్‌ తప్పించుకున్నవిషయం తెలియలేదు. తల్లి నుంచి తప్పించుకున్న అభిషేక్‌, బస్‌ స్టేషన్ ‌కు చేరుకుని రాజమహేంద్రవరం బస్సు ఎక్కి , తన పక్కన ఉన్న ప్రయాణికుడితో తన తల్లి, చెల్లెలు నీటిలో మునిగిపోయారని చెప్పి, సెల్‌ ఫోన్‌ అడిగి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడు. అయితే నాగస్వరూపారాణి ఆత్మహత్యకు పాల్పడటం .. మృతురాలి తల్లిదండ్రులు, భర్త గ్రామం కూడా అదే కావడం ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.