Begin typing your search above and press return to search.

లోక్ సభ లో రసాభాస ..మహిళా ఎంపీల పై మార్షల్ దాడి !

By:  Tupaki Desk   |   26 Nov 2019 7:32 AM GMT
లోక్ సభ లో రసాభాస ..మహిళా ఎంపీల పై మార్షల్ దాడి !
X
మహారాష్ట్ర లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల పై కాంగ్రెస్ సోమవారం ఉదయం లోక్‌సభలో ఆందోళన బాట పట్టింది. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఎదుట కాంగ్రెస్ సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభ్యులను తమ తమ స్థానాల్లోకి వెళ్లాలని చేసిన సూచనను బేఖాతరు చేయడంతో మార్షల్ రంగంలో దిగారు. బ్యానర్లు, ప్లకార్డులతో ధర్నా చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలు టీఎన్ ప్రతాపన్, హిబి ఇడెన్‌‌లను స్పీకర్ హెచ్చరించారు. రూల్ 373 కింద వారిని వెల్ నుంచి ఖాళీ చేయాలని ఆదేశించారు. అయినా బ్యానర్లతోనే సభ్యులు ఆందోళనకు దిగారు. దాంతో వారిని సభను బయటకు తీసుకెళ్లాలని మార్షల్‌ కు స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు.

ఆ క్రమంలోనే ఎంపీలు, మార్షల్ మధ్య తోపులాట చోటుచేసుకొన్నది. ఆ క్రమంలోనే ఇద్దరు మహిళా ఎంపీలతో మార్షల్ దురుసుగా ప్రవర్తించారని కాంగ్రెస్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. పార్లమెంటులో ఇలాంటి ఘటన ఇంతకుముందెప్పుడూ జరగలేదు అని, గౌరవనీయులైన సభ్యులపై దాడికి పాల్పడ్డ సెక్యూరిటీ సిబ్బందిపై స్పీకర్, ప్రభుత్వం ఏంచర్యలు తీసుకుంటుందో వేచి చూస్తామని తెలిపారు. కానీ , బీజేపీ మాత్రం కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కొట్టిపారేసింది. కాంగ్రెస్ ఎంపీలు తమ ప్రవర్తనతో లోక్ సభకి తలవంపులు తెచ్చారని, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అభ్యంతరకర రీతిలో ఆందోళన చేస్తుంటే సీనియర్ ఎంపీలు చోద్యం చూస్తున్నారని లా మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్మండిపడ్డారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు కూడా కాంగ్రెస్ ఆరోపణలని తప్పుపట్టారు.