Begin typing your search above and press return to search.

మారుతి.. 3 నెలల్లో రెండోసారి.. కొనేవారికి చుక్కలేనా?

By:  Tupaki Desk   |   17 April 2021 3:30 AM GMT
మారుతి.. 3 నెలల్లో రెండోసారి.. కొనేవారికి చుక్కలేనా?
X
దేశీయంగా తిరుగులేని కార్ల కంపెనీ మారుతి. కంపెనీలు ఎన్ని ఉన్నా.. మారుతి మీద భారతీయులకున్న నమ్మకం అంతా ఇంతా కాదు. కారు కొనే వారిలో చాలామంది ఫస్ట్ ఛాయిస్ మారుతి కార్లే. అలాంటి ఈ సంస్థ తాజాగా తన కార్ల ధరల్ని పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది. కారు కొనేద్దామని భావించే వారికి దిమ్మ తిరిగేలా షాకిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. తన కార్ల ధరల్ని పెంచేయటమే కాదు.. తక్షణమే అమల్లోకి వచ్చేస్తాయని పేర్కొంది.దీంతో.. కార్లు కొనాలనుకునే వారికి షాకిచ్చింది.

తాజాగా తన కార్లలోని వివిధ మోడళ్లకు దగ్గర దగ్గర రూ.25వేల వరకు పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన మోడళ్లకు ఈ ధర పెంపు వర్తిస్తుందని పేర్కొంది. ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోవటమే కార్ల ధరల పెంపునకు కారణంగా చెబుతోంది. అయితే.. ఈ పెంపు సెలెరియా.. స్విఫ్ట్ మోడళ్లకు మినహాయించి మిగిలిన అన్ని కార్లకు ఉంటుందని కంపెనీ చెబుతోంది.

తాజాగా పెంచిన పెంపు.. ఎక్స్ షోరూమ్ ధరలో 1.6 శాతం వరకు ఉంటుందని చెప్పింది. మూడు నెలల క్రితం కూడా మారుతి తన కార్ల ధరల్ని సవరించింది. అప్పట్లో గరిష్ఠంగా రూ.35వేల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మూడు నెలలు గడవకముందే మరోసారి పెంచటం ద్వారా.. కార్లు కొనాలనుకునే వారికి చేదు వార్తను చెప్పింది. దేశీయంగా ఆగ్రశ్రేణి కంపెనీ అయిన మారుతి కార్ల ధరల్ని పెంచేసిన తర్వాత.. మిగిలిన కంపెనీలు ‘పెంపు’ బాట పట్టటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.