Begin typing your search above and press return to search.

అదేంది మేరీ కోమ్..మరీ ఇంత చిల్లరగా బిహేవ్ చేయటమా?

By:  Tupaki Desk   |   29 Dec 2019 4:39 AM GMT
అదేంది మేరీ కోమ్..మరీ ఇంత చిల్లరగా బిహేవ్ చేయటమా?
X
ఆమె బయోగ్రఫీ మీద ఏకంగా సినిమానే తీశారు. అసేతు హిమాచలం ఆ సినిమా ఎందరినో ఆకర్షించింది. ఈశాన్య రాష్ట్రాల నుంచి కష్టపడి పైకెదిగిన బాక్సర్ మేరీ కోమ్ అన్నంతనే అందరికి అభిమానం. సీనియర్ గా అందరికి గౌరవం కూడా. జీవితంలో ప్రతి అడుగు పోరాడి గెలిచిన ఆమె.. తాజాగా జరిగిన పోటీలో క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించి విస్మయానికి గురి చేసింది. తన తీరుతో తెలంగాణ అమ్మాయిని అవమానించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ సదరు తెలంగాణ క్రీడాకారిణి చేసిన తప్పల్లా.. నిబంధనల్ని గుర్తు చేసి.. అందుకు తగ్గట్లు వ్యవహరించాలని కోరటమే. అంత మాత్రానికే దారుణంగా వ్యవహరించటం ద్వారా మరో వివాదానికి తెర తీశారు మేరీ కోమ్.

ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ఆరుసార్లు స్వర్ణాలు సాధించటం .. ఒలింపిక్స్ లో కాంస్యాన్ని సొంతం చేసుకోవటం.. ఎన్నో తిరుగులేని విజయాలతో దిగ్గజ క్రీడాకారిణిగా పేరు సాధించిన మేరీ కోమ్.. తాజాగా తెలంగాణకు చెందిన జూనియర్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ పట్ల వ్యవహరించిన తీరును అందరూ తప్పు పడుతున్నారు. తన స్థాయికి ఏ మాత్రం తీసిపోని రీతిలో వ్యవహరించటమా? అని మండిపడుతున్నారు. ఇంతకూ అసలేం జరిగింది? మేరీ కోమ్ ఎందుకు బ్యాలెన్స్ మిస్ అయ్యింది? తెలంగాణ అమ్మాయి చేసింది తప్పేనా? అన్న విషయాల్లోకి వెళితే..

అసలీ విషయం మీద అవగాహన రావాలంటే కొద్ది రోజులు వెనక్కి వెళ్లాలి. మేరీ కోమ్ 48 కేజీల విభాగంలో బాక్సర్ గా బరిలోకి దిగుతారు. టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనే భారత్ బాక్సర్ గా మేరీ కోమ్ బరిలోకి దిగే వారు. కానీ.. ఆ విభాగాన్ని ఎత్తేయటంతో ఆమె 51 కేజీల విభాగంతో బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యారు. మేరీ కోమ్ తాను తలపడే విభాగాన్ని మార్చుకున్నప్పటికీ ఆమెను ఒలింపిక్స్ కు పంపేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. దీనిపై తెలంగాణకు చెందిన నిఖత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె ఏమీ చిన్న క్రీడాకారిణి కాదు. 23 ఏళ్ల నిఖత్ ప్రపంచ జూనియర్ ఛాంపియన్ గా గెలిచిన ట్రాక్ రికార్డు ఆమె సొంతం. మేరీ కోమ్ ను ఎంపిక చేయటాన్ని నిఖత్ ఎందుకు ప్రశ్నించారంటే.. ఆ విభాగంలో ఆమె బరిలోకి దిగాల్సి ఉంటుంది.

తన అవకాశాలు గండి కొట్టిన మేరీ కోమ్ ను నేరుగా విమర్శించని నిఖత్.. ఒలింపిక్స్ కు ఎవరు ఎంపికైనా ఫర్లేదు. కానీ.. ట్రయల్ మ్యాచ్ లో గెలిచిన వారికి అవకాశం ఇవ్వాలంటూ ఆమె బాక్సింగ్ ఫెడరేషన్ కు లేఖ రాశారు. దీంతో.. తమ తప్పును గుర్తించి.. ట్రయల్ మ్యాచ్ ను ఏర్పాటు చేశారు. తన విషయంలో నిఖత్ వ్యవహరించిన తీరు మేరీకోమ్ కు నచ్చలేదు. తనను అవమానించినట్లుగా ఫీలైంది. వాస్తవంగా చూస్తే.. తన స్థానంలో మేరీకోమ్ రావటాన్ని నిఖత్ జీర్ణించుకోలేదు. అయినా.. బ్యాలెన్స్ మిస్ కాలేదు. న్యాయంగా వ్యవహరించాలని మాత్రమే కోరింది.

కానీ.. మేరీ కోమ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. తాజాగా ఢిల్లీలో జరిగిన ట్రయల్ మ్యాచ్ లో నిఖత్ మీద మేరీ కోమ్ గెలిచింది. అయితే.. ఈ మ్యాచ్ కు ముందు నిఖత్ ఒక డిమాండ్ చేసింది. సదరు మ్యాచ్ లైవ్ ఉండాలని కోరింది. బౌట్ జరిగిన తీరు.. అనుకున్న దాని కంటే హోరాహోరీగా సాగిన వైనం.. బాక్సర్లు ఎవరూ స్పష్టమైన పంచ్ లు విసరకపోవటం.. జడ్జిలు ఏకగ్రీవంగా మేరీని విజేతగా ప్రకటించకపోవటం ఒక ఎత్తు అయితే.. నిఖత్ ఓటమి తర్వాత తెలంగాణ బాక్సింగ్ సంఘం ప్రతినిధి ఏపీ రెడ్డి తమ క్రీడాకారిణికి అన్యాయం జరిగిందని అభ్యంతరం వ్యక్తం చేశారు.

అయితే.. భారత బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడు అజయ్ సింగ్ ఆయన్ను వారించి బయటకు పంపేయటం గమనార్హం. అయితే.. దీనిపై నిఖత్ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. బౌట్ పూర్తి అయిన తర్వాత.. రింగ్ లో తలపడిన ఇరువురు క్రీడాకారులు మర్యాదపూర్వకంగా చేతలు కలపటం.. ఆత్మీయంగా హగ్ చేసుకోవటం మామూలే. దీనికి భిన్నంగా మేరీ కోమ్ వ్యవహరించారు. మ్యాచ్ అయ్యాక షేక్ హ్యాండ్ ఇస్తుంటే.. చేయి విసిరికొట్టి వెళ్లిపోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

బౌట్ అయ్యాక విజేతను ప్రకటించిన వేళలో మేరీ కసిగా సంబరాలు చేసుకున్న తీరే ఆశ్చర్యమైతే.. ఆనవాయితీ ప్రకారం కౌగిలించుకోబోతుంటే తిరస్కరించటాన్ని పలువురు వేలెత్తి చూపిస్తున్నారు. వెనుకబడ్డ ప్రాంతం నంచి వచ్చి.. అనేక అడ్డంకులు అధిగమించి ప్రపంచ వేదికల్లో ఎన్నో ఘనతలు సాధించిన మేరీ.. ఇలా చిల్లరగా వ్యవహరించటం ఏమిటని మండిపడుతున్నారు. మేరీ కోమ్ ప్రవర్తన తనకు నచ్చలేదని.. ఫలితం వెల్లడైన తర్వాత కౌగిలించుకోవటానికి ప్రయత్నిస్తే అందుకు ఆమె ఇష్టపడకపోవటం సరికాదన్నారు. సీనియర్ బాక్సర్ గా ఆమె తనను అభినందిస్తుందని భావించానని.. కానీ బౌట్ మధ్యలో తనను ఉద్దేశించి చెడు పదాల్ని వాడినట్లుగా విమర్శించారు తనకు మరో ఛాన్స్ చిక్కినప్పుడు తనను తాను నిరూపించుకోవటానికి ప్రయత్నిస్తానని చెప్పింది నిఖత్ జరీన్.

ఇదిలా ఉంటే.. తాను చేసిన పనిని మేరీ కోమ్ సమర్థించుకోవటం గమనార్హం. తాను కౌగిలించుకోవటానికి.. చేతులు కలపటానికి ఇష్టపడలేదని.. అయితే ఏమిటని ప్రశ్నించిన మేరీకోమ్.. తన ఘనతల్ని ప్రశ్నిస్తే కోపం రాకుండా ఉంటుందా? అని మండిపడ్డారు. నేనూ మనిషినే కదా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆమె.. ట్రయల్స్ లో పాల్గొనని తానేమీ చెప్పకున్నా.. తన మీదా వివాదాన్ని క్రియేట్ చేయటం తప్పా? అని ప్రశ్నించింది. మొత్తంగా చూస్తే.. మేరీ కోమ్ యాటిట్యూడ్ చూపించటమే కాదు.. తన స్థాయికి తగ్గట్లుగా వ్యవహరించలేదని మాత్రం చెప్పక తప్పదు.