Begin typing your search above and press return to search.

మాస్కు నిబంధనలు తప్పని సరేం కాదంట.. కానీ ఈ జాగ్రత్తలు పాటించాలట!

By:  Tupaki Desk   |   8 April 2022 11:30 AM GMT
మాస్కు నిబంధనలు తప్పని సరేం కాదంట.. కానీ ఈ జాగ్రత్తలు పాటించాలట!
X
కరోనా కేసులు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో మాస్కులు పెట్టుకోవడం తప్పనిసరా కాదా అనే అనుమానాలు చాలా మందికి వస్తున్నాయి. రెండేళ్లుగా కరోనా ఆంక్షలతో విసిగిపోయిన ప్రజలంతా ఇక మాస్కు ధరించడం మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. అయితే వీరికి కొంత ఊరటనిస్తూ.. నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఇతర దేశాల్లో లాగా భారత్ లోనూ మాస్కుల నిబంధనను ఎత్తివేయొచ్చని చెబుతున్నారు.

కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు పెట్టుకోవడం మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మాస్కులు ధరించకపోతే జరిమానా విధించడం వంటివి అవసరం లేదని హరియాణాలోని అశోకా విశ్వ విద్యాలయ ఆచార్యుడు గౌతమ్ మీనన్ తెలిపారు. మాస్కుల వల్ల ఉపయోగాన్ని మాత్రం అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య తగ్గడంతో ఇప్పటికే దిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్, హరియాణా తదితర రాష్ట్రాల్లో మాస్కులు తప్పనిసరి నిబంధనను ఎత్తివేశారు.

భవిష్యత్తులో మళ్లీ ఏదైనా కొత్త వేరియంట్ పుట్టుకొస్తే.. అప్పుడు మళ్లీ మాస్కుల నిబంధనను అమలు చేయవచ్చని... ప్రస్తుతానికి మాత్రం మాస్కు కచ్చితంగా ధరించాల్సిన అవసరం లేదని అంటు వ్యాధుల నిపుణుడు లక్ష్మీ నారాయణ్ సూచించారు. అవసరమైతే మాత్రం మళ్లీ మాస్కులు పెట్టుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఇప్పుడు మాస్కుల కన్నా కొవిడ్ బూస్టర్ టీకాలు కీలకమని మీనన్ గుర్తు చేశారు.

కొత్త కేసులు తగ్గినందున సాధారణ జీవనాన్ని పునరుద్ధరించడానికి ఇదే సరైన సమయం అని చెప్పారు. అయితే కరోనా మహమ్మారి అంతం అయిందనే ధీమా తో నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదని దిల్లీలోని జాతీయ ఇమ్యునాలజీ సంస్థకు చెందిన శాస్త్రవేత్త సత్యజిత్ రథ్ సూచించారు.

కొవిడ్ బెడద ముగిసిందనే తప్పుడు ప్రచారం, మాస్కులు, భౌతిక దూరం పాటింపు నియమాలను పూర్తిగా ఎత్తివేడయం.. ఒమిక్రాన్ బీఏ2 వేరియంట్ వ్యాపించడం వల్ల కొవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

చైనాలోనూ మళ్లీ కొవిడ్ విజృంభించడం పెరిగింది. అయితే భారత్ లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని నిపుణులు పేర్కొంటుకున్నారు. దేశంలో ఇంత వరకు 185.20 కోట్ల కరోనా టీకాలు వేయడం.. జనాభాలో చాలా మందికి గతంలో కరోనా సోకి రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల నిరుడు డెల్టా వేరియంట్ సృష్టించిన నష్టం భవిష్యత్తులో ఉండక పోవచ్చని మీనన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కీటాల వల్ల వైరస్ తీవ్రత తగ్గినా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.