Begin typing your search above and press return to search.

జేఎన్‌ యూ దాడి..కొత్త నిజాలు వెలుగులోకి

By:  Tupaki Desk   |   15 Jan 2020 4:32 PM GMT
జేఎన్‌ యూ దాడి..కొత్త నిజాలు వెలుగులోకి
X
దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ప్ర‌తిష్టాత్మక జవహార్‌ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరిగిన దాడి ఘ‌ట‌న‌లో కొత్త ట్విస్టులు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. జనవరి 5న జేఎన్‌ యూలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌ తో పాటు మరో 37 మందిని అనుమానితులుగా భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీసీటీవీ పుటేజీలు - వాట్సప్‌ లో వైరల్‌ అవుతున్న వీడియోల ఆధారంగా మరికొంతమందిని పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా.. ముసుగులు ధరించి హాస్టల్‌ లో దాడికి పాల్పడిన ఓ యువతిని.. ఢిల్లీ యునివర్సిటీకి చెందిన విద్యార్థిని కోమల్‌ శర్మగా పోలీసులు ధృవీకరించారు. ఇందుకు సంబంధించిన వార్తలు - సదరు విద్యార్థిని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అయితే, దీనిపై పోలీసులు కూడా స్పందించారు.

ఢిల్లీ పోలీసులు ఐపీసీ సెక్షన్ 160 కింద కోమల్ శర్మతో పాటు అక్షత్ అవస్తి - రోహిత్ షా అనే ఇద్దరికి నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. ఈ ప‌రిణామంతో అంద‌రి దృష్టి ఏబీవీపీపై ప‌డింది. దీంతో ఏబీవీపీ ఢిల్లీ స్టేట్ సెక్రటరీ సిద్దార్థ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ కోమల్ ఏబీవీసీ సభ్యురాలేనని - అయితే సోషల్ మీడియాలో ఆమె వీడియో వైరల్ అయినప్పటి నుంచి ఎవరికీ అందుబాటులో లేదని అన్నారు. మ‌రోవైపు - జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనతో తనకు సంబంధం లేదని ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని కోమల్‌ శర్మ పేర్కొన్నారు. దాడికి సంబంధించిన వీడియోలో కనిపించింది తాను కాదంటూ జాతీయ మహిళా కమిషన్‌ ను ఆశ్రయించారు.

మ‌హిళా క‌మిష‌న్‌ ను క‌లిసిన అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ శ‌ర్మ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ‘ ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. నన్ను కావాలనే అందులో ఇరికించారు. దురుద్దేశంతో.. నన్ను చెడుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. నా పరిస్థితి అధ్వానంగా తయారైంది. బంధువులు, స్నేహితుల నుంచి అధిక సంఖ్యలో ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. ఆ వీడియోలో మాస్క్‌ ధరించి ఉన్నది నేనే అని.. నా గురించి చెడుగా అనుకుంటున్నారు’ అని వాపోయారు.