Begin typing your search above and press return to search.

మసూద్ తల తెస్తేనే ధర్మశాలలో పాక్ తో మ్యాచ్

By:  Tupaki Desk   |   4 March 2016 10:55 AM GMT
మసూద్ తల తెస్తేనే ధర్మశాలలో పాక్ తో మ్యాచ్
X
భారత మాజీ సైనికులు పాక్ క్రికెటర్లకు ఊహించని షాక్ ఇచ్చారు. ఇండియాలో ధర్మశాలకు వచ్చి క్రికెట్ మ్యాచ్ ఆడాలంటే ఉగ్రవాది మౌలాన్ మసూద్ అజర్ తలను తేవాలని అంటున్నారు. మసూద్ అజర్ తలను తీసుకొస్తేనే క్రికెట్ ఆడనిస్తామని లేదంటే తరిమికొడతామని హెచ్చరించారు. ఈమేరకు ఇండియన్ ఎక్స్ సర్వీస్ మెన్ లీగ్ హిమాచల్ ప్రదేశ్ అధ్యక్షుడు మేజర్ విజయ్ సింగ్ పేర్కొన్నారు. మార్చి 19న ధర్మశాలలో ఇండియా - పాక్ క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే.... ఆయన తన వ్యాఖ్యలకు కారణాలు కూడా వెల్లడించారు.

నిజానికి 19న ధర్మశాలలో మ్యాచ్ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఆ మ్యాచ్ నిర్వహించలేమంటూ తప్పుకొన్న సంగతి తెలిసిందే. అందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం భద్రతా కారణాలను సాకుగా చూపుతోంది. కాగా విజయ్ సింగ్ కూడా అదే కారణం చెబుతున్నారు. ధర్మశాల మ్యాచ్ కోసం 7 వేల మంది పాకిస్థానీలు కాశ్మీర్ మీదుగా హిమాచల్ లోకి ప్రవేశించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని ఇంటిలిజెన్సు వర్గాలు చెబుతున్నాయని.... వాళ్లు ఒక వేళ పాక్ జెండాలను మైదానంలో ప్రదర్శిస్తే పరిస్థితి అదుపు తప్పుతుందని.. అందుకే ధర్మశాలలో మ్యాచ్ వద్దంటున్నామని ఆయన అంటున్నారు. అయితే... మ్యాచ్ వద్దంటున్నప్పుడు మసూద్ అజర్ తల తేవాలంటూ రెచ్చగొట్టడం ఎందుకన్న ప్రశ్న వినిపిస్తోంది. హిమాచల్ లోని కాంగ్రెస్ సర్కారుకు మద్దతుగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని... ఉద్రిక్తతలను రెచ్చగొడితే మ్యాచ్ నిర్వహణ విషయంలో వెనక్కు తగ్గుతారన్న ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న వాదన వినిపిస్తోంది.