Begin typing your search above and press return to search.

భారీ భూకంపం.. పేకమేడల్లా కూలిన భవనాలు

By:  Tupaki Desk   |   29 Dec 2020 5:32 PM GMT
భారీ భూకంపం.. పేకమేడల్లా కూలిన భవనాలు
X
ఒకటీ రెండు కాదు.. రిక్ట‌ర్ స్కేలుపై ఏకంగా 6.4 తీవ్రతతో నమోదైన భూకంపం భవనాలను పేక మేడల్లా కూల్చేసింది. జనజీవనాన్ని కకావికలం చేసింది. ఈ భారీ భూకంపం క్రొయేషియా దేశంలో సంభవించింది. ఈ భూకంప తీవ్ర‌త‌కు పెట్రింజా సెంట్ర‌ల్ ప‌ట్ట‌ణంలోని పలు భ‌వ‌నాలు కుప్ప కూలిన‌ట్లు స్థానిక మీడియా వెల్ల‌డించింది.

క్రొయేషియాలోని కాల‌మాన ప్ర‌కారం మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల ప్రాంతంలో ఈ భూకంపం సంభ‌వించింది. భూమి ఉప‌రిత‌లం నుంచి దాదాపు 10 కిలోమీట‌ర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు తెలిసింది. ఈ భూకంపం జ‌గ్రెబ్ ప్రాంతం‌లో కేంద్రీకృతమై ఉండగా.. దీని ప్రభావం చుట్టూ సుమారు 50 కిలోమీట‌ర్ల ప‌రిధిలో విస్తరించినట్లు అధికారులు వెల్ల‌డించారు. ఈ భారీ భూకంపం సంభ‌వించ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌తో ఇళ్ల నుంచి బయటకు ప‌రుగులు తీశారు.

కాగా.. ఈ భూకంప భారీ విధ్వంసం సృష్టించిన‌ట్లు అక్క‌డి అధికారులు వెల్ల‌డించారు. కొన్ని భ‌వ‌నాలు పూర్తిగా కుప్ప‌కూలిపోగా.. మ‌రి కొన్ని భ‌వ‌నాల పైక‌ప్పులు ధ్వంస‌మ‌య్యాయ‌ని తెలిపారు. కాగా.. ఇదే ప్రాంతంలో సోమ‌వారం కూడా భూకంపం సంభ‌వించిన‌ట్లు తెలిపారు. ఈ భూకంపం వ‌ల్ల ప్రధానంగా పెట్రింజా న‌గ‌రంలో విప‌రీత‌మైన విధ్వంసాలు జ‌రిగిన‌ట్లు చెప్పారు.