Begin typing your search above and press return to search.

దేశంలో భారీగా తగ్గిన మరణాలు .. 24 గంటల్లో 38,164 కొత్త కేసులు !

By:  Tupaki Desk   |   19 July 2021 6:30 AM GMT
దేశంలో భారీగా తగ్గిన మరణాలు .. 24 గంటల్లో 38,164 కొత్త కేసులు !
X
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ దేశంలో ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదు. ఇంకా దేశంలో సెకండ్ వేవ్ కొనసాగుతుందని, థర్డ్ వేవ్ ముప్పు ఆగస్టులోనే పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదేపదే హెచ్చరికలు జారీ చేస్తోంది. అయినప్పటికీ ప్రజలలో కరోనా మహమ్మారి పట్ల ఆందోళన సన్నగిల్లినట్టు కరోనా నిబంధనలు పాటించకుండా బయటకి వస్తున్నారు. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన వివరాల ప్రకారం భారతదేశం గత 24 గంటల్లో 38,164 కొత్త కరోనా కేసులను నమోదు చేసింది.

దీనితో భారతదేశంలో ఇప్పటి వరకూ మొత్తం కరోనా కేసులు 3,11,44,229 కు చేరుకుంది. గత 24 గంటల్లో 38,660 తాజా రికవరీలు చోటు చేసుకోగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,03,08,456 గా ఉంది. కోవిడ్ -19 రికవరీ రేటు ఇప్పుడు 97.31 శాతంగా ఉంది. ఇక గత 24 గంటల్లో 499 మరణాలతో, మొత్తం మరణాల సంఖ్య 4 14,108 కు చేరుకుంది. క్రియాశీల కేసులు ఆదివారం గణాంకాల నుండి 995 తగ్గాయి, ఇప్పుడు 4, 21,665 వద్ద క్రియాశీల కేసులున్నాయి. ఇది మొత్తం కరోనా కేసులలో 1.36 శాతం గా ఉంది. నిన్న ఆదివారం 41,157 కొత్త కేసులు నమోదు కాగా, నేడు నిన్నటి గణాంకాల కంటే 2,993 తక్కువ ఉన్నందున సోమవారం రోజువారీ కరోనా కేసులలో తగ్గుదల కనిపించింది. 24 గంటల వ్యవధిలో కరోనావైరస్ వ్యాధికి 14,63,593 నమూనాలను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది.

కరోనావైరస్ మహమ్మారి యొక్క మూడవ వేవ్ వస్తుందని పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్న వేళ ఆరు రాష్ట్రాలు ఇటీవల కేసులలో భారీగా పెరుగుదల చూపిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. కేరళ మరియు మహారాష్ట్రలలో సంఖ్యలు పెరగడం తీవ్ర ఆందోళనకు కారణంగా మారుతుందని పిఎం మోడీ సమావేశంలో అన్నారు.రెండవ వేవ్ రాకముందే జనవరి నుండి ఫిబ్రవరి వరకు దేశంలో ఇలాంటి పోకడలు గుర్తించామని ప్రధాని మోదీ హైలైట్ చేశారు. కరోనా వ్యాప్తిని ఎదుర్కోవటానికి చురుకైన చర్యలు తీసుకోవాలని మరియు 'టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేట్' విధానాన్ని అనుసరించాలని ఆయన ఆరు రాష్ట్రాలను కోరారు.

కరోనా కోసం ప్రపంచవ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన ఇస్తున్న వ్యాక్సిన్లు కరోనా సోకినప్పటికీ రోగుల మరణాలను, ఆసుపత్రులలో చేరికలను గణనీయంగా అరికట్టగలవని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నివేదా గుప్తా నేతృత్వంలోని పరిశోధకుల కొత్త అధ్యయనం ప్రకారం, టీకాలు వేసిన తరువాత సోకిన వారిలో 0.4% మంది మరణించినట్టు తేల్చింది. 677 కోవిడ్ రోగుల జీనోమ్ సీక్వెన్సింగ్ డేటాను విశ్లేషించిన ఈ అధ్యయనంలో, పూర్తిగా టీకాలు వేసిన కేసులలో 86% డెల్టా వేరియంట్ కారణంగా ఉన్నాయని కనుగొన్నారు. కోవిడ్ బాధితులలో కరోనా తీవ్రతను తగ్గించడానికి, మరణాలను నివారించడానికి వ్యాక్సిన్లు కీలక పాత్రను పోషిస్తాయని ఈ పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి .

ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కరోనా వ్యాక్సిన్ దేశంపై ప్రధానంగా దృష్టి సారించాలని, పేద ధనిక దేశాల తారతమ్యం లేకుండా అందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఒకే విధంగా సాగాలని పదేపదే విజ్ఞప్తి చేస్తుంది. బ్లూమ్‌బెర్గ్ యొక్క వ్యాక్సిన్ ట్రాకర్ ప్రకారం, దేశం ఇప్పటివరకు 1.3 బిలియన్ జనాభాలో 5.7% మాత్రమే టీకాలు వేసింది. ఇదిలా ఉంటే ఆగస్టులో కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని టీకా కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని, అప్పుడే తీవ్ర నష్టం నుంచి బయటపడగలుగుతాము అని అంచనా వేస్తున్నారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరం నిబంధనలను పాటించడం, సమీప వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవడం చేస్తే కరోనా థర్డ్ వేవ్ ముప్పు నుంచి కాపాడుకున్నట్టే అని అధ్యయనం చెబుతోంది.