Begin typing your search above and press return to search.

పక్కా క్లారిటీ : ఆశలేదంటున్న బాలయ్య అల్లుడు...?

By:  Tupaki Desk   |   20 July 2022 3:30 PM GMT
పక్కా క్లారిటీ : ఆశలేదంటున్న బాలయ్య అల్లుడు...?
X
ఆయనకు అన్ని వైపులా అండదండలు ఉన్నాయి. టీడీపీలో యువ నేతగా ఉన్న వెనకాల ఘనమైన రాజకీయ వారసత్వం ఉంది. ఆయన విశాఖ మాజీ ఎంపీ, దివంగత ఎంవీవీస్ మూర్తి మనవడు. ఇక ఆయన మరో తాత కావూరి సాంబశివరావు కేంద్ర మాజీ మంత్రి. ఇలా రెండు వైపులా ఆయనకు రాజకీయం ఇంట్లోనే ఉంది. వీటికి తోడు ఆయన ప్రముఖ సినీ నటుడు బాలయ్యకు రెండవ అల్లుడు. ఆయనే మతుకుమల్లి శ్రీ భరత్. విశాఖలోని గీతం విద్యా సంస్థల చైర్మన్ ఆయన.

ఇక రాజకీయంగా చూస్తే శ్రీభరత్ 2019 ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటు నుంచి టీడీపీ తరఫున పోటీ చేశారు. త్రిముఖ పోటీగా సాగినా కూడా కేవలం మూడు వేల ఓట్ల తేడాతో మాత్రమే శ్రీ భరత్ ఓడారు. నాటి నుంచి ఆయన విశాఖ ఎంపీ సీటు మీదనే కన్నేసి ఉంచారు. ఆయన ఓడిన తరువాత నుంచి విశాఖ పార్లమెంట్ పరిధిలోనే పర్యటనలు చేస్తున్నారు. తన బలాన్ని పెంచుకుంటున్నారు. చాప కింద నీరులా ఆయన తన పలుకుబడిని రెట్టింపు చేసుకుంటున్నారు.

అయితే ఈ మధ్య ఒక ప్రచారం టీడీపీలో సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో శ్రీభరత్ ని భీమిలీ నుంచి పోటీ చేయిస్తారని. ఆయన విద్యా సంస్థలు కూడా భీమిలీలోనే ఉన్నాయి కాబట్టి రాజకీయంగా అది కలసి వస్తుందని ఆలోచిస్తున్నారు. అయితే తాజాగా భీమిలీలో జరిగిన పార్టీ సమావేశంలో శ్రీభరత్ దీనికి కచ్చితమైన క్లారిటీ పార్టీ వారికి ఇచ్చేశారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ భీమిలీ నుంచి పోటీ చేసే ప్రసక్తే లేదని శ్రీ భరత్ పేర్కొన్నారు.

దీని మీద ఎవరూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని, బాగా పనిచేసుకుంటే టీడీపీ అధినాయకత్వం సమర్ధునికి టికెట్ ఇస్తుందని కూడా శ్రీభరత్ చెప్పడం జరిగింది. నిజానికి భీమిలీ సీటుని కోరాడ రాజబాబు ఆశిస్తున్నారు. ఆయన 2009 నుంచి కూడా ఎమ్మెల్యే కావాలని ఆరాటపడుతున్నారు. అయితే ఎపుడూ ఆయనకు హై కమాండ్ మొండి చేయి చూపిస్తోంది. ఆయన టీడీపీ వదిలివెళ్ళినా వైసీపీలో కూడా టికెట్ దక్కలేదు. దాంతో ఇపుడు టీడీపీలో ఆయన ఉంటూ ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు.

ఈ నేపధ్యంలో కోరాడ అనుచరులు శ్రీ భరత్ కి టికెట్ ఇస్తారేమో అని అనుమానిస్తున్నారు. దాంతో వారి అనుమానాలను శ్రీ భరత్ పటాపంచలు చేయడమే కాకుండా తాను తిరిగి విశాఖ ఎంపీగానే పోటీ చేస్తాను అని పేర్కొనడం విశేషం. మరి శ్రీ భరత్ మొదటి నుంచి పార్లమెంట్ లోనే తన వాణిని వినిపించాలని ఆశపడుతున్నారు. 2019 ఎన్నికల్లో కూడా ఆయనకు అసెంబ్లీ టికెట్ ఇస్తామన్నా కూడా ఎంపీ కోసం పట్టుబట్టి సాధించుకున్నారు అని చెబుతారు.

మరి 2024లో విశాఖ ఎంపీ సీటుని బీసీకి ఇవ్వడం ద్వారా గెలుపు గుర్రం ఎక్కాలని టీడీపీ ఆలోచన చేస్తోంది అని అంటున్నారు. దాని కోసం విశాఖ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావుని ఎంపిక చేశారు అని చెబుతున్నారు. మరి అధినాయకత్వం ఆలోచనలు అలా ఉంటే శ్రీ భరత్ మాత్రం విశాఖ ఎంపీ సీటు నుంచే పోటీ చేస్తాను అని అనడం అంటే రాజకీయంగానే చర్చగా ఉంది అంటున్నారు. ఇంకో వైపు ఆలోచిస్తే చేస్తే టీడీపీ ఎంపీగా చేయడం లేకపోతే పోటీ చేయకుండా గమ్మున ఉండడం అనే విధానాన్ని శ్రీ భరత్ అనుసరిస్తారు అని అంటున్నారు. చూడాలి మరి చంద్రబాబు తనకు కుమారుడు వరస అయ్యే శ్రీ భరత్ విషయంలో ఏమి ఆలోచిస్తారో.