Begin typing your search above and press return to search.

ఆ ప్రకటనల మీద ఆరా తీయకుంటే దెబ్బే

By:  Tupaki Desk   |   8 April 2015 5:30 PM GMT
ఆ ప్రకటనల మీద ఆరా తీయకుంటే దెబ్బే
X
దినపత్రికల్లో వచ్చే పెళ్లి ప్రకటనల విషయంలో ఆచితూచి అడుగులు వేయమంటున్నారు పోలీసులు. మారిన కాలానికి తగినట్లుగా మోసం చేసే వారి సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో.. తప్పుడు సమాచారంతో పెళ్లిళ్ల ప్రకటనలు ఇవ్వటం ఈ మధ్యన ఎక్కువ అవుతుందని చెబుతున్నారు. ఇలాంటి అంశాల విషయంలో ఒకటికి పదిసార్లు తనిఖీ చేయటం తప్పనిసరి.

పత్రికల్లో ఇచ్చే పెళ్లిళ్ల ప్రకటనల్లో పేర్కొన్నట్లుగా.. వారి వివరాల్ని లోతుగా పరిశీలించటం.. ఆరా తీసుకున్న తర్వాత మాత్రమే చొరవ ప్రదర్శించాలి. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం మొదటికే మోసం గ్యారెంటీ అని చెబుతున్నారు. దీనికి ఉదాహరణలుగా గత కొద్దికాలంలో తమకు ఎదురైన అనుభవాల్ని పంచుకుంటున్నారు సీఐడీ అధికారులు.

''ఒక హోటల్లో పనిమనిషిగా పని చేసే వ్యక్తి తాను మైక్రోసాఫ్ట్‌ సంస్థలో ఏడాదికి రూ.50లక్షలు వేతనం వచ్చే ఉద్యోగం చేస్తున్నానని నెట్‌లో సమాచారం పెట్టాడు. అందులో పేర్కొన్న వివరాలు చూసి స్పందించిన అమ్మాయిలతో మాత్రమే మాట్లాడేవాడు. వారి తల్లిదండ్రులు ఫోన్లు చేస్తే మాత్రం కట్‌ చేసేవాడు. అమ్మాయిలతో పరిచయం పెంచుకొని వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజేవాడు. కొద్దిరోజుల తర్వాత ఫోన్‌ నెంబరు మార్చేసేవాడు. చివరికి ఒక అమ్మాయి ధైర్యం చేసి పోలీసులకు సమాచారం అందించటంతో ఆ మాయగాడి అసలు రంగు బయటపడింది''

మరో ఘటనలో.. ''ఒక వికలాంగుడు తప్పుడు వివరాలతో ఒక యువతిని మోసం చేశాడు. అదే సమయంలో ఒక మహిళ తాను డాక్టర్‌ని అని.. విదేశాల్లో స్థిరపడ్డ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు ప్రకటన ఇచ్చారు. అలా పరిచయం అయిన వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజేది. చివరకు పోలీసుల చేతికి చిక్కింది''

ఇలా పెళ్లి ప్రకటనలతో మోసం చేసే సంస్కృతి పెరిగిన నేపథ్యంలో.. వివాహ ప్రకటనల్ని పత్రికల్లో ఇచ్చే వారి విషయంలో జాగరూకతో ఉండాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో చిన్న పొరపాటు దొర్లినా అందుకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంది సుమా.