Begin typing your search above and press return to search.

పాక్‌ లో బిజినెస్‌ తో వంద‌ల కోట్లు వెన‌కేశాడు

By:  Tupaki Desk   |   4 Jun 2017 6:26 AM GMT
పాక్‌ లో బిజినెస్‌ తో వంద‌ల కోట్లు వెన‌కేశాడు
X
పాకిస్తాన్ గురించి, అక్క‌డి ప‌రిస్థితుల గురించి, ఉగ్ర‌వాదం గురించి కొత్త‌గా ప‌రిచ‌య‌డం చేయాల్సిన అవ‌స‌రం ఏముంది చెప్పండి! ఉగ్రవాద ప్రభావం అత్యధికంగా ఉన్న దేశాల్లో పాకిస్థాన్‌ ఒకటి. కొన్ని ముష్కర ముఠాలను ఆ దేశమే స్వయంగా పెంచిపోషిస్తూ.. పొరుగు దేశాలపైకి ఎగదోస్తోందన్న ఆరోపణలూ ఉన్నాయి. తాలిబాన్‌.. జైష్‌ ఏ మహ్మద్‌ వంటి ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు ఆ దేశంలోనే ఎక్కువ. రాజకీయంగా.. ఆర్థికంగానూ పాక్‌ పరిస్థితి అంతంత మాత్రమే. క‌ల‌లో కూడా సంద‌ర్శించ‌కూడ‌ని దేశం ఏదైనా ఉందా అంటే అది పాకిస్తాన్ అని చాలామంది చెప్తుంటారు. అలాంటి దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీయులు ఎవరైనా ఇష్టపడతారా? కానీ.. ఓ యువ వ్యాపారవేత్త ఆ సాహసం చేశాడు. పెట్టుబ‌డులు పెట్టి వంద‌ల కోట్లు సంపాదించి తోపు అని నిరూపించుకున్నాడు.

అంత‌ర్జాతీయంగా క‌ల్లోలం సృష్టిస్తున్న అల్‌ ఖైదా అగ్రనేత బిన్‌ లాడెన్‌ ను 2011 మే నెలలో పాకిస్థాన్‌ లో అమెరికా దళాలు మట్టుబెట్టాయి. దాంతో ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విదేశీయులు ఎవ‌రూ ఆ దేశం వైపు క‌న్నెత్తి చూడ‌టం లేదు. ఇక మదుపరుల సంగ‌తి స‌రేస‌రి. కానీ..యూర‌ప్‌ లో ప్ర‌ముఖ దేశ‌మైన స్వీడన్‌ కు చెందిన యువ‌కుడు ధైర్యం చేశాడు. ఆ దేశ రాజధాని స్టాక్‌ హోం వాసి అయిన మార్టిన్‌ సన్ 2011 అక్టోబర్‌ లో పాకిస్థాన్‌ లోనే తొలి విదేశీ ఈక్విటీ ఫండ్‌ సంస్థను ప్రారంభించాడు. ఇక్క‌డే ట్విస్ట్! మార్టిన్‌ స‌న్ ధైర్యంగా సంస్థను అయితే ప్రారంభించాడు కానీ.. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఎవరూ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాలేదు. దాంతో అతనే 7లక్షల 80వేల డాలర్లు పెట్టుబడి పెట్టాడు. పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారడంతో కొన్నాళ్లకు చూస్తే మార్కెట్‌ లో పెట్టిన సొమ్ములో 10శాతం కరిగిపోయింది.

అయితే మార్టిన్ స‌న్ ఆశా జీవి. భ‌విష్య‌త్‌ పై న‌మ్మ‌కంతో, ఆశతో త‌న సంస్థ‌ను కొన‌సాగిస్తూ ముందుకు సాగాడు. అనుకున్నట్లుగానే ఓ ఏడాది గడిచాక అనుకూల సూచనలు కనిపించాయి. ఆ తర్వాత పెట్టుబడులు బాగానే రాబట్టగలిగారు. అలా.. అలా ప్రస్తుతం ఆ సంస్థ ఫండ్‌ విలువ 100 మిలియన్‌ డాల‌ర్ల‌కు చేరింది. పాక్‌ లో కేవలం ఆరేళ్లలోనే రూ. వందల కోట్లు విలువైన సంస్థలకు అధిపతి అయిన మార్టిన్ ఇప్పుడు ప‌లువురు బ‌డా వ్యాపార‌వేత్త‌ల‌కు మార్గ‌ద‌ర్శి అయ్యాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/