Begin typing your search above and press return to search.

ఈ విష‌యంలో మ‌మ‌త బాట‌లోనే మాయ కూడా!

By:  Tupaki Desk   |   14 Sep 2022 9:39 AM GMT
ఈ విష‌యంలో మ‌మ‌త బాట‌లోనే మాయ కూడా!
X
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి మాయావ‌తి ఆధ్వ‌ర్యంలోని బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ (బీఎస్పీ) కూడా మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ బాట‌లో ప‌య‌నిస్తోంది. ప్ర‌స్తుతం తృణ‌మూల్ కాంగ్రెస్ లో మ‌మ‌తా బెన‌ర్జీ త‌ర్వాత అన్నీ ఆమె మేన‌ల్లుడు అభిషేక్ బెన‌ర్జీ చూస్తున్న‌సంగ‌తి తెలిసిందే. తృణ‌మూల్ కాంగ్రెస్ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న అభిషేక్ బెన‌ర్జీ పార్టీలో మ‌మ‌త త‌ర్వాత నెంబ‌ర్ టూ స్థానంలో ఉన్నారు.

ఇక ఇప్పుడు అచ్చం ఇదే మాదిరిగా బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావ‌తి సైతం అడుగులేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. త‌న త‌ర్వాత పార్టీ వ్య‌వ‌హారాలు, అన్ని బాధ్య‌త‌లు, పెత్త‌న‌మంతా త‌న మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌కు అప్ప‌గించారు. ఇప్ప‌టికే ఆకాష్ ఆనంద్ బీఎస్పీ జాతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ఉన్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న గుజ‌రాత్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో పార్టీని న‌డిపించాల్సిన బాధ్య‌త‌ను మాయావ‌తి త‌న మేన‌ల్లుడు ఆకాష్ ఆనంద్ చేతిలో పెట్టారు.

అటు మ‌మ‌తా బెన‌ర్జీ, ఇటు మాయావ‌తి ఇద్ద‌రూ బ్ర‌హ్మ‌చారులే. ఇద్ద‌రికీ పెళ్లి కాలేదు. దీంతో దేశంలోనే అగ్ర నేత‌లుగా ఉన్న వీరిద్ద‌రి త‌ర్వాత బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డానికి వార‌సులు లేరు. దీంతో అటు మ‌మ‌త‌, ఇటు మాయావ‌తి ఇద్ద‌రూ త‌మ త‌ర్వాత త‌మ వార‌సులుగా త‌మ మేన‌ళ్లుళ్ల‌ను రాజ‌కీయ‌ తెర మీద‌కు తెచ్చారు. త‌ద్వారా త‌మ త‌ర్వాత పార్టీలో నంబ‌ర్ 2 త‌మ మేన‌ళ్లుళ్లేన‌ని స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చేశారు.

కాగా ఇప్ప‌టికే మ‌మతా బెన‌ర్జీ మేన‌ల్లుడు అభిషేక్ బెన‌ర్జీ క్రియాశీల రాజ‌కీయాల్లో కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. ఇక మాయావ‌తి మేన‌ల్లుడు ఆకాష్ ఆనంద్ త‌న సామ‌ర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ఒక‌ప్పుడు ఉచ్ఛ స్థితిలో ఉన్న బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ ఇప్పుడు ప‌త‌నావ‌స్థ‌లో ఉంది. పార్టీకి రానురాను ఆద‌ర‌ణ కూడా త‌గ్గిపోతోంది. 2019 పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఉన్న 80 ఎంపీ సీట్ల‌లో బీఎస్పీ కేవ‌లం 10 సీట్ల‌కే ప‌రిమిత‌మైంది. ఇక ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మొత్తం 403 సీట్లలో పోటీ చేసిన బీఎస్పీ కేవ‌లం ఒక్క సీటుకే కునారిల్లింది. ఈ నేప‌థ్యంలో పార్టీని పున‌రుజ్జీవింప చేయాల్సిన భాధ్య‌త ఆకాష్ ఆనంద్‌పై ఉంది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగాల్సి ఉండగా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు 2023లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తాయి. ఈ మూడు రాష్ట్రాల్లో పార్టీ పని అప్పగించడం ద్వారా త‌న మేన‌ల్లుడు ఆకాష్ ఆనంద్‌ను నేరుగా ప్రజలకు చేరువ చేయాలని మాయావతి ఆకాంక్షిస్తున్నట్టు చెబుతున్నారు. ఆకాష్ ఆనంద్ అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసుకుని 2017లో ఇండియా వచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్‌పీ ఎన్నికల ప్రచార వ్యూహాలను చూసుకున్నారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో పార్టీ సోషల్ మీడియా కార్యక్రమాలను ప‌ర్య‌వేక్షించారు.

ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆకాష్ ఆనంద్ బీఎస్పీ త‌ర‌ఫున ప్రచారం నిర్వ‌హించారు. ప్రస్తుతం రాజస్థాన్‌లోని వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ కార్యకర్తలతో ఆయ‌న సమావేశమవుతున్నారు. కాగా 2018 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్‌పీ 4 సీట్లు గెలుచుకుంది. 2018 రాజస్థాన్ ఎన్నికల్లో 6 సీట్లు సాధించింది. ఈ నేప‌థ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో మ‌రోమారు మంచి ఫ‌లితాలు సాధించాల‌ని ఆకాష్ ఆనంద్ ఎదురుచూస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.