Begin typing your search above and press return to search.

కెనడాలో మనమ్మాయి చరిత్ర సృష్టించింది

By:  Tupaki Desk   |   22 Nov 2019 4:37 AM GMT
కెనడాలో మనమ్మాయి చరిత్ర సృష్టించింది
X
కెనడాలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఆ దేశ ప్రధానిగా జస్టిన్ ట్రూడో మరోసారి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో తన మంత్రివర్గంలో నలుగురు భారతీయ సంతతికి చెందిన వారిని చేర్చుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కెనడా దేశ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఒక హిందూ మహిళను మంత్రిగా ఎంపిక చేస్తూ ట్రూడో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

దీంతో భారతమూలాలున్న టొరంటో వర్సిటీ ప్రొఫెసర్ అనితా ఆనంద్ చరిత్రను సృష్టించారు. ప్రజాసేవలు.. సేకరణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె కొత్త రికార్డుకు కారణమయ్యారు. ఇటీవల పార్లమెంటుకు ఎన్నికైన ఆమె ఇంతకాలం న్యాయశాస్త్ర అధ్యాపకురాలిగా వ్యవహరించారు.

యాభై ఏళ్ల అనిత తల్లిదండ్రులు భారత్ కు చెందిన వారు. పార్లమెంటు (హౌస్ ఆఫ్ కామన్స్ సభ)కు తొలిసారి ఎన్నికైన ఆమె.. మొదటిసారే మంత్రివర్గంలో చోటు దక్కించుకోవటం ఒక ఎత్తు అయితే.. ఒక హిందూ మహిళ మంత్రిగా బాధ్యతలు చేపట్టటం ద్వారా సరికొత్త రికార్డు ఆమె పేరు మీద లిఖించే పరిస్థితి.

ఇదంతా ఒక ఎత్తు అయితే ఆమెతో పాటు.. మరో ముగ్గురు భారత సంతతికి చెందిన సిక్కులు మంత్రులుగా పదవీ బాధ్యతలు చేపట్టారు. వారిలో 49 ఏళ్ల హర్జిత్ సజ్జన్ ఒకరైతే.. మరొకరు 42 ఏళ్ల నవదీప్ భైన్స్. అందరిలోకి చిన్నవాడిగా బర్దీష్ ఛగ్గర్ ను పేర్కొనాలి. ఎందుకంటే.. కేవలం 39 ఏళ్ల వయసులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వేళ జస్టిన్ ట్రూడో తన మంత్రివర్గంలో 37 మందికి అవకాశం కల్పిస్తే.. అందులో నలుగురు భారత మూలాలున్న వారు కావటం గమనార్హం. నలుగురిలో ఒకరు హిందువు అయితే.. మిగిలిన ముగ్గురు సిక్కులు.