Begin typing your search above and press return to search.

మాయావతి కోరిక బయటపెట్టింది

By:  Tupaki Desk   |   7 May 2019 1:38 PM GMT
మాయావతి కోరిక బయటపెట్టింది
X
దేశమంతటా ప్రధాని అభ్యర్థుల్లో ఒకరు అని చెప్పుకుంటూ ఉంటే మాయావతి మాత్రం లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే... ఒక్కరోజులోనే దాని వెనుక వ్యూహమేంటో అందరికీ అర్థమైంది. తన అవసరాన్ని బట్టి ఒక సీటు ఖాళీ చేయించి పోటీ చేస్తారు అని అందరూ భావించినట్టే ఆమె ఆలోచనలు ఉన్నట్టు తాజాగా అర్థమైంది.

ప్రధాని పదవి మీద ఆమెకు ఎంతో మోజు ఉన్న విషయం స్పష్టమైంది. ఈరోజు పీఎం పోస్టుపై తన కోరికను బయటపెట్టేశారావిడ. యూపీలోని అంబేద్కర్ నగర్ లో ప్రచారం చేస్తూ.. 'అన్నీకలిసి వస్తే ఇక్కడ నుంచి ఉప ఎన్నికల్లో పోటీచేస్తా‘ అంటూ ప్రకటించారు మాయావతి. యూపీఏ కూటమి ద్వారా ప్రధాని అవకాశం వస్తే... ఎంపీ సీటులో గెలవాలి కాబట్టి అక్కడ పోటీ చేస్తాను అన్నది ఆమె అభిప్రాయం.

ఆమెది ప్రధాని స్థాయి కాదని చాలా మంది విభేదిస్తున్నా... ఒక దళిత మహిళ అయి ఉండి ఇతర కులాలు పెద్ద సంఖ్యలో ఉన్న యూపీలో బంపర్ మెజారిటీతో గెలవడంతో ఆమె ప్రభ ఎక్కడికో వెళ్లింది. పైగా అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేసి తన ఉనికిని చాటుకుంటూ వస్తోందావిడ. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ కు ప్రధాని అభ్యర్థి అయిన రాహుల్ కు భారీ మద్దతు లేని నేపథ్యంలో మంచి సంఖ్యలో సీట్లు వస్తే... తప్పకుండా తనకు అవకాశం ఉందని ఆమె భావిస్తోంది. మమతా బెనర్జీతో పోలిస్తే మాయావతి అంత రెబల్ గా పైకి కనిపించదు. దీంతో దళిత వ్యక్తి కావడం కూడా ఈ విషయంలో ఆమె ప్లస్సే.

కాకపోతే ఒక సారి అఖిలేష - ఇంకోసారి బీజేపీ యూపీ పీఠం తన్నుకుపోవడం వల్ల ఆమె భవిష్యత్తు కొంత గందరగోళంలో పడటంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎస్పీతో పొత్తు పెట్టుకుంది. దీంతో ఆమెకు అఖిలేష్ మద్దతు దొరికింది. ఇద్దరి పొత్తు కారణంగా ఈసారి ఇరువురు కలిసి ఒక 40కి పైగా సీట్లు సాధించే అవకాశం ఉంది. అఖిలేష్ కూడా ఆమెకు వ్యూహాత్మకంగా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆమె జాతీయ రాజకీయాల్లోకి పోతే లోకల్ గా ఆమె మద్దతుతో తనదే రాజ్యమని భావిస్తున్నారు అఖిలేష్.