Begin typing your search above and press return to search.

కుమార‌స్వామికే సందులేదంటే మాయావ‌తి

By:  Tupaki Desk   |   6 Jun 2018 11:12 AM GMT
కుమార‌స్వామికే సందులేదంటే మాయావ‌తి
X
తాను దూర సందు లేదు .. మెడ‌కో డోలు అని సామెత‌. క‌ర్ణాట‌క‌లో కుమార‌స్వామి ప్ర‌భుత్వాన్ని చూస్తుంటే ఇప్పుడు అచ్చం అలానే అనిపిస్తుంది. బీజేపీ మీద కోపంతో 79 స్థానాలు గెలిచినా కాంగ్రెస్ పార్టీ 2019లో కేంద్రంలో అధికారం ద‌క్కించుకోవాల‌న్న ఆలోచ‌న‌తో 36 స్థానాలు గెలిచిన జేడీఎస్ కు మ‌ద్ద‌తు తెలిపి కుమార‌స్వామిని ముఖ్య‌మంత్రిని చేశారు. బీజేపీ మాన‌సిక స్థ‌యిర్యం దెబ్బ‌తీసే విష‌యంలో కాంగ్రెస్ - జేడీఎస్ లు స‌ఫ‌ల‌మ‌యినా ఇప్పుడు మంత్రి ప‌ద‌వుల పంప‌కాల‌లో పొత్తు తెగ‌క ఇబ్బందులు ప‌డుతుంటే ఇందులో మాయావ‌తి వేలు పెట్టి ఆశ్చ‌ర్య ప‌రుస్తుంది.

అతి క‌ష్టం మీద ఎమ్మెల్యేల‌ను కాపాడుకున్న కాంగ్రెస్ - జేడీఎస్ లు 20 మంత్రి ప‌ద‌వులు కాంగ్రెస్ కు, 12 మంత్రి ప‌ద‌వులు జేడీఎస్ కు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కుమార‌స్వామి ముఖ్య‌మంత్రి అయ్యాక కాంగ్రెస్ నుండి ఒక‌రిని ఉప ముఖ్య‌మంత్రిని చేశారు. మంత్రి ప‌ద‌వులు ఎవ‌రికి ఇవ్వాల‌న్న విష‌యం తేల‌క సాగ‌దీస్తూ వ‌స్తున్నారు. అయితే పార్టీ మారితే ప‌ద‌వులు వ‌స్తాయ‌ని అనుకున్న వారిని ఉంటే ప‌ద‌వి ఇస్తాం అని బుజ్జ‌గించి నిలుపుకున్నారు. ఇప్పుడు అంద‌రికీ ప‌ద‌వులు ఇవ్వ‌డం పెద్ద‌గండంలా మారింది.

ఈ ప‌రిస్థితుల‌లో క‌ర్ణాట‌క‌లో బీఎస్పీ త‌ర‌పున శాసన‌స‌భ‌కు పోటీ చేసి మ‌హేష్ గెలిచాడు. జేడీఎస్ - కాంగ్రెస్ కూట‌మికి మ‌ద్ద‌తు ప‌లికిన అత‌నికి మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని మాయావ‌తి కోరిన‌ట్లు స‌మాచారం. భ‌విష్య‌త్ కూట‌ముల అవ‌స‌రాల రీత్యా దీనికి ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి ఒప్పుకున్న‌ట్లు తెలుస్తుంది. అయితే ఈ ప‌దవి కూడా జేడీఎస్ కోటాలో ఉన్న 12 ప‌ద‌వుల నుండే అని స‌మాచారం.

36 మంది ఎమ్మెల్యేల‌లో 12 మందికే ప‌దవులు ఇచ్చే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో మిగ‌తావారిని ఎలా కాపాడుకోవాలా ? అన్న ఆందోళ‌న‌లో ఉన్న కుమార‌స్వామికి ఇది ఇబ్బందిక‌రంగా ఉంది. ఒక‌వైపు గ‌ట్టి ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్షంగా బీజేపీ క‌నిపిస్తుంది. మ‌రో వైపు కాంగ్రెస్ ను స‌మ‌న్వ‌యం చేసుకోకుంటే ఎప్పుడు ప‌ద‌వి ఊడుతుందో తెలియ‌ని ప‌రిస్థితి. ఈ గండాల‌న్నీ దాటుకుంటూ ఐదేళ్ల సంసారం ఎలా చేస్తాడ‌న్న‌ది అనుమాన‌మే.