Begin typing your search above and press return to search.

మేయరా.. మజాకా..? ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ లో కలకలం.

By:  Tupaki Desk   |   18 Feb 2021 2:30 AM GMT
మేయరా.. మజాకా..? ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ లో కలకలం.
X
ఆయన మున్సిపల్ కార్పొరేషన్ కు మేయర్.. కానీ మంత్రి కంటే ఎక్కువ.. ఆయన డాక్టర్ కానీ.. సీఎంతో పరిచయాలు ఎక్కవ.. అందుకే తనకు నచ్చిందే చేస్తాడు.. చేసేది చెప్పడు.. ఎవరి మాట వినడు.. ఎవరికీ చెప్పి చేయడు.. ఇంత సంచలన వ్యక్తిగా మారిన ఆ నేత గురించి ఇప్పడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. త్వరలో ఆయన పదవీ కాలం ముగియనుంది. ఈ సమయంలోనైనా కాస్త మాట వినాలని కోరినా.. తన పని తానే చేసుకుంటూ పోతున్నాడు.. దీంతో మంత్రులకు సైతం తలనొప్పిగా మారాడా నేత.. ఇంతకీ ఎవరతను..? ఎందుకిలా చేస్తున్నాడు.

మరి కొద్ది రోజుల్లో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న మేయర్ పాపాలాల్ పదవి ముగియనుంది. అయితే పాపాలాల్ మేయర్ పీఠం ఎక్కినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి రెబల్ గా వ్యవహరిస్తున్నాడని గులాబీ నేతలు చర్చించుకుంటున్నారు. తనకు నచ్చిన పని చేసుకుంటూ ఎవరి మాటా వినడం లేదట. కనీసం జిల్లా మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ మాటను లెక్కచేయడం లేదట.

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చివరి సమయంలోనైనా కాస్త అభివృద్ధి చేయాలని మంత్రి సంకల్పించాడట. ఇందుకోసం డివిజన్ కు రూ.50 లక్షలు ఖర్చు పెట్టాలని మంత్రి సూచించారట. కానీ మేయర్ మంత్రి మాటను వినకుండా నిధులు విడుదల చేయడం లేదు. అంతేకాకుండా తన సొంత డివిజన్ కు రూ.కోటి 30 లక్షలతో అభివృద్ధి పనులు చేయించుకుంటున్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష చేసిన సమయంలో ఆయనను ఖమ్మం తీసుకువచ్చినప్పుడు ఇక్కడి ఆసుపత్రి సూపరింటెండెంట్ గా డాక్టర్ పాపాలాల్ ఉన్నారు. దీంతో ఆయన కేసీఆర్ దృష్టిలో పడ్డారు. ఆ చనువుతో ఆయన మేయర్ పీఠాన్ని అధిష్టించారు. అయితే ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే టీఆర్ఎస్ జిల్లా నేతలతో కలిసి ఉండడం లేదట. ఏ కార్యక్రమానికైనా హాజరు కాకపోవడం, పార్టీ మీటింగ్ లకు దూరంగా ఉండడం చేసేవాడట.

దీంతో ఆయనపై ఎన్నో ఫిర్యాదులు వెళ్లాయి. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎలాగోలా ఆయన పదవీకాలం పూర్తయ్యే సమయం వచ్చేసరికి జిల్లా నేతలుసైతం సంయమనం పాటిస్తున్నారట. అయితే చివరి సమయంలో ఇలా మంత్రితోనే గిల్లి కజ్జాలు పెట్టుకుంటే పార్టీ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని టీఆర్ఎస్ జిల్లా నేతలు భావిస్తున్నారట. మరి దీనిపై అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.