Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో పోలీస్‌ జాబ్ కు ఎంబీఏ..ఎంసీఏలు!

By:  Tupaki Desk   |   7 May 2017 9:14 AM GMT
తెలంగాణ‌లో పోలీస్‌ జాబ్ కు ఎంబీఏ..ఎంసీఏలు!
X
ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు ఒక‌ప్పుడు విప‌రీత‌మైన క్రేజ్ ఉండేది. ఎప్పుడైతే ఐటీ ఎంట్రీ ఇచ్చిందో.. ప్ర‌భుత్వ ఉద్యోగాల్ని చూసే వారే లేకుండా పోయిన ప‌రిస్థితి. అయితే.. ఐటీలో త‌ర‌చూ ఎదుర‌య్యే అప్ అండ్ డౌన్స్ తో గ‌త కొన్నేళ్లుగా ప్ర‌భుత్వ ఉద్యోగాల మీద దృష్టి పెడుతున్న వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతున్నారు. ఇదిలా ఉండ‌గా.. తెలంగాణ‌రాష్ట్ర ఏర్పాటు నేప‌థ్యంలో.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకుంటున్ నిర్ణ‌యాల‌తో ప్ర‌భుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగిన సంగ‌తి తెలిసిందే.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముందు ఉమ్మ‌డి ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగుల‌కు వ‌చ్చే జీతాలు చాలా త‌క్కువ‌గా ఉండేవి. అయితే.. వారి జీతాల్ని భారీగా పెంచేస్తూ.. కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యంతో.. ఇప్పుడా ఉద్యోగాల‌కు విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చేసింది. ఒక‌ప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగాలంటే పెద్ద‌గా ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌ని ఉన్న‌త విద్యాధికులు సైతం ఇప్పుడు కానిస్టేబుల్ జాబ్ కోసం క్యూ క‌ట్టే ప‌రిస్థితి.

తెలంగాణ‌లో పోలీస్ కానిస్టేబుల్ జాబ్ కున్న క్రేజ్ గురించి తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మ‌న్ క‌మ్ అడిష‌న‌ల్ డీఐజీ జె. పూర్ణ‌చంద్ర‌రావు ఆస‌క్తిక‌ర అంశాలు చెప్పుకొచ్చారు. ఇటీవ‌ల నిర్వ‌హించిన కానిస్టేబుళ్ల రిక్రూట్ మెంట్ కోసం ఏకంగా 5.63ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేశార‌న్నారు. ఎంపికైన కానిస్టేబుళ్ల‌లో 243 మంది ఎంబీఏ వారు కాగా.. 161 మంది ఎంటెక్‌.. 103 ఎంసీఏ.. 1462 మంది బీటెక్‌.. 100 బీఈడీ.. 895 మంది పీజీలు చేసిన వారు ఉన్న‌ట్లుగా చెప్పారు.

మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు ఎంపికైన వారిలో 47 మంది బీఫార్మా విద్యార్థులు.. ఐదుగురు ఎల్ ఎల్‌ బీ డిగ్రీ అభ్య‌ర్థులు ఉన్నార‌ని చెప్పారు. ఇంట‌ర్ విద్యార్హ‌త క‌లిగిన కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఎంత భారీగా విద్యాధికులు పోటీ ప‌డ్డారు ఈ గ‌ణాంకాలు చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఇక‌.. డిగ్రీ చ‌దివిన 2845 మంది అభ్య‌ర్థులు కూడా కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన వారు ఉండ‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/