Begin typing your search above and press return to search.

మీటూ ప్రకంపనలు.. అన్ని కంపెనీలకు పాకింది..

By:  Tupaki Desk   |   14 Oct 2018 8:24 AM GMT
మీటూ ప్రకంపనలు.. అన్ని కంపెనీలకు పాకింది..
X
దేశవ్యాప్తంగా ‘మీటూ’ ప్రకంపనలు రేపుతోంది సినిమా - సాహిత్యం - మీడియా - క్రీడలు - రాజకీయాలు.. ప్రభుత్వం ఇలా అన్ని రంగాల్లోనూ లైంగిక వేధింపులకు గురైన మహిళలందరూ నిజాలు నిర్భయంగా చెబుతూ మంచి ముసుగు తొడుక్కున్న వారందరి జాతకాలు బయటకు తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆడవాళ్లు పనిచేసే మల్టీ నేషనల్ కంపెనీలు - బ్యాంకులు - ఇతర కార్పొరేట్ కంపెనీలు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. తాజాగా వేధింపులకు గురై మహిళలు ఫిర్యాదు చేస్తే దాన్ని విచారణకు స్వీకరిస్తామని.. ఈ కేసుల విచారణకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకా గాంధీ ప్రకటించారు. ఈ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఉన్న పలు బహుళజాతి కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి.

గతంలో మహిళలు ఫిర్యాదు చేసిన కేసులు, ప్రస్తుతం గళమెత్తుతున్న కేసులు తమ మెడకు చుట్టుకుంటాయోమోనన్న ఆందోళన కంపెనీలను వెంటాడుతోంది. దీంతో మహిళలకు ఎదురైన లైంగిక వేధింపులపై పాత కేసుల్ని కూడా విచారించి న్యాయం చేసేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి.

తాజాగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో ప్రముఖ కన్సల్టెంట్ సుహేల్ సేథ్ తో సహా చాలా మంది ఉన్నారు. వివిధ రంగాలకు చెందిన నలుగురు మహిళలు సుహేల్ సేథ్ పై ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి వాట్సాప్ స్క్రీన్ షాట్స్ ను వారు విడుదల చేసి దుమారం రేపారు.

కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ నిబంధనల ప్రకారం.. పని ప్రదేశాల్లో 10 మంది కంటే ఎక్కువ మహిళలుంటే అంతర్గత విచారణకు కమిటీని కంపెనీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కమిటీలో నలుగురు సభ్యులుండాలి. అందులో ఇద్దరు మహిళలుండాలని స్పష్టం చేసింది. ఫిర్యాదు చేయాలంటే మహిళలు జిల్లా అధికారుల ఆధ్వర్యంలో స్థానిక ఫిర్యాదుల కమిటీకి విన్నవించవచ్చని తెలిపింది. అంతర్గత కమిటీ తీర్పు అన్యాయమైతే ఆ సంస్థను వీడి కోర్టును, పోలీసులను ఆశ్రయించవచ్చని కేంద్రం వేసిన కమిటీ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.