Begin typing your search above and press return to search.

అలర్ట్.. అలర్ట్.. చిన్నారులపై విజృంభిస్తున్న 'మీజిల్స్'..!

By:  Tupaki Desk   |   24 Nov 2022 12:32 PM GMT
అలర్ట్..  అలర్ట్.. చిన్నారులపై విజృంభిస్తున్న మీజిల్స్..!
X
భారత్ లో కరోనా కేసులు ఇటీవలి కాలంలో పెద్దగా నమోదు కావడం లేదు. గతంతో పోలిస్తే కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గడంతో భారత్ లో మునుపటిలాగే ప్రజలంతా తమ తమ పనులు చేసుకుంటున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో తగ్గడం లేదని తెలుస్తోంది. కరోనా కాలంలో చిన్నారులకు ఇచ్చే వాక్సినేషన్ ప్రక్రియ సజావుగా జరగకపోవడంతో కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి.

ముంబై మహానగరంలో గత నెలరోజులుగా మీజిల్స్ వ్యాధి విజృంభిస్తుండటం ఆందోళనను రేకెత్తిస్తోంది. మీజిల్స్ వ్యాధి సోకి వందలాది మంది చిన్నారులు ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 223 మీజిల్స్ కేసులు నమోదు కాగా గత రెండు నెలల కాలంలోనే 200 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. నిన్న ఒక్కరోజే 30 మంది చిన్నారులు మిజిల్స్ వ్యాధితో ఆస్పత్రిలో చేరగా 22 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఈ ఒక్క నెలలోనే 30 మంది చిన్నారులు మీజిల్స్ వ్యాధితో మృతి చెందినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ఈ వ్యాధి క్రమంగా ముంబైతో పాటు థానే.. మాలేగావ్... భీవండి.. నాసిక్.. అకోలా.. కళ్యాణ్ తదితర ప్రాంతాలకు విస్తరిస్తుందని ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైందని అధికారులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ముంబై ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. అనుమానితులను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ మీజిల్స్ వ్యాధి విజృంభించడానికి కోవిడ్ వ్యాక్సిన్ సరిగా నిర్వహించకపోవడమే కారణమని తెలుస్తోంది. కోవిడ్ కాలంలో 9 నుంచి 15 ఏళ్ల లోపు చిన్నారులకు వ్యాక్సినేషన్ సరిగా జరగలేదని అధికారులు సైతం ఒప్పుకుంటున్నారు.

ముంబైలో ప్రస్తుతం వ్యాక్సినేషన్ కు అర్హత కలిగిన వారిలో 41 శాతం మాత్రమే తీసుకున్నారు. సుమారు 20 వేల మంది చిన్నారులు ఇంకా వ్యాక్సినేషన్ చేయించుకోలేదని అధికారులు చెబుతున్నారు. ప్రతి చిన్నారికి రెండు డోసుల వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబై సర్కార్ అప్రమత్తమైంది.

వీలైనంత త్వరగా చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మీజిల్స్ వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలు సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముంబై సర్కార్ అలర్ట్ చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.