Begin typing your search above and press return to search.

మ‌క్కా మ‌సీద్ బాంబుపేలుళ్ల కేసు కొట్టివేత‌!

By:  Tupaki Desk   |   16 April 2018 8:17 AM GMT
మ‌క్కా మ‌సీద్ బాంబుపేలుళ్ల కేసు కొట్టివేత‌!
X
దాదాపు ప‌ద‌కొండేళ్ల క్రితం హైద‌రాబాద్ తో పాటు.. దేశ వ్యాప్తంగా పెను సంచ‌ల‌నం సృష్టించిన మ‌క్కా మ‌సీదు బాంబు పేలుళ్ల కేసును కొట్టివేస్తూ నాంప‌ల్లి కోర్టు సోమ‌వారం తీర్పును వెలువ‌రించింది. ఎందుకిలా అంటే.. నిందుల‌పై నేరారోప‌ణ‌ల్ని నిరూపించ‌టంతో ప్రాసిక్యూష‌న్ ఫెయిల్ అయ్యింద‌ని ఎన్ ఐఏ ప్ర‌త్యేక కోర్టు ప్ర‌క‌టించింది. దీంతో.. ప‌ద‌కొండేళ్ల సుదీర్ఘ ద‌ర్యాప్తు చేప‌ట్టిన ఎన్ ఐఏ తేల్చింది ఇదేనా? అన్న నిట్టూర్పులు వినిపిస్తున్నాయి.

మొత్తం 226 మంది సాక్ష్యుల్ని విచారించి ఛార్జిషీట్ లో 10 మంది పేర్లు చేర్చ‌గా.. అందులో ఐదుగురిని నిర్దోషులుగా ప్ర‌క‌టించారు. కేవ‌లం రెండు నిమిషాల్లో కోర్టు తుది తీర్పును వెల్ల‌డించింది. మ‌క్కా మ‌సీదు బాంబు పేలుళ్ల కేసు తుది తీర్పు నేప‌థ్యంలో నాంప‌ల్లి వ‌ద్ద భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు స్వామి అసిమానంద‌.. భ‌ర‌త్‌.. దేవెంద‌ర్ గుప్తా.. రాజేంద‌ర్‌.. లోకేశ్ శ‌ర్మ‌ల‌లో ఒక‌రిపైనా ఆరోప‌ణ‌ల్ని ప్రాసిక్యూష‌న్ నిరూపించ‌లేక‌పోయింది. దీంతో.. వీరంతా నిర్దోషులుగా కోర్టు ప్ర‌క‌టించింది. 2007 మే 18న మ‌ధ్యాహ్నం మ‌క్కా మ‌సీదులో ప్రార్థ‌న స‌మ‌యంలో టిఫిన్ బాంబు ద్వారా పేలుడు సంభ‌వించింది. పేలుడు ధాటికి తొమ్మిది మంది మ‌ర‌ణించారు. అనంత‌రం చెల‌రేగిన అల్ల‌ర్ల‌ను అదుపు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తూ పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. 58 మంది తీవ్ర గాయాల‌య్యాయి.

హిందూ దేవాల‌యాల్లో పేలుళ్ల‌కు పాల్పుడ‌తున్నందుకు ప్ర‌తిగా మ‌క్కా మ‌సీదులో బాంబుపేలుళ్ల‌కు పాల్ప‌డిన‌ట్లుగా ద‌ర్య‌ప్తు సంస్థ‌లు ఛార్జిషీట్ లో పేర్కొన్నాయి. బాంబు పేలుళ్లను తొలుత హుస్సేనీ ఆలం పోలీస్ స్టేష‌న్లో కేసులు న‌మోదయ్యాయి.  ఈ కేసు సీరియ‌స్ నెస్ కార‌ణంగా కేసు ద‌ర్యాప్తును సీబీఐ చేప‌ట్టింది. ఆపై ఇది ఉగ్ర‌వాద దుశ్చ‌ర్య కావ‌టంతో భార‌త హోంమంత్రిత్వ శాఖ కేసు ద‌ర్యాప్తు బాధ్య‌త‌ను 2011 ఏప్రిల్ 4న చేప‌ట్టింది. అప్ప‌ట్లో సీబీఐ ఒక‌టి.. ఎన్ ఐఏ రెండు అభియోగ‌ప‌త్రాల్ని న్యాయ‌స్థానంలో న‌మోదు చేశాయి. 2014 ఫిబ్ర‌వ‌రి 13న నిందితుల‌పై అభియోగాలు న‌మోద‌య్యాయి.

ఈ కేసులో మొద‌ట ఇద్ద‌రు నిందితుల్ని అరెస్ట్ చేశారు. రాజ‌స్థాన్ కు చెందిన దేవేంద‌ర్ గుప్తా అలియాస్ బాబీ.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ కు చెందిన లోకేశ్ శ‌ర్మ అలియాస్ అజ‌య్ తివారిని అదుపులోకి తీసుకున్నారు. ఇది జ‌రిగిన కొంత‌కాలానికి 2010 న‌వంబ‌రు 19న కీల‌క నిందితుడు నాబ‌కుమార్ స‌ర్కార్ అలియాస్ అసీమానంద పోలీసుల‌కు దొరికారు. దీంతో.. కుట్ర కోణం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే.. ఇవేమీ నిందితులు చేసిన కుట్ర‌ను నిరూపించ‌లేక‌పోయారు. దీంతో సుదీర్ఘ‌కాలం పాటు సాగిన ద‌ర్యాప్తు.. విచార‌ణ‌ను తేల్చేస్తూ.. నిందితుల్ని నిర్దోషులుగా ప్ర‌క‌టిస్తూ కోర్టు తుది తీర్పును ఇచ్చింది.

ఎన్ ఐఏ పేర్కొన్న దాని ప్ర‌కారం నిందితులు వీరే..

A-1. దేవేందర్ గుప్తా
A-2.లోకేష్ శర్మ,
A-6.స్వామి ఆసిమానందా
A-7.భరత్ భాయ్
A-8.రాజేందర్ చౌదరి

పరారీలో ఉన్నోళ్లు

A-3.సందీప్ డాంగే
A-4.రామచంద్ర కళా సంగ్రా
A-10.అమిత్ చౌహన్.

ఈ కేసులో చనిపోయిన వ్యక్తి.

A-5.సునీల్ జోషి.

ఈ కేసులో బెయిల్ పై ఉన్న వాళ్లు

A-6 .స్వామి ఆసిమానందా
A-7.భరత్ భాయ్.
A-9.తేజ్ పరమార్