Begin typing your search above and press return to search.

సండ్ర కోరికలు.. కేసీఆర్ ఒప్పుకుంటాడా?

By:  Tupaki Desk   |   23 Dec 2018 6:35 AM GMT
సండ్ర కోరికలు.. కేసీఆర్ ఒప్పుకుంటాడా?
X
తెలంగాణలో టీడీపీ ఉనికే లేకుండా చేయాలని కేసీఆర్ సంకల్పించారు. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో గెలిచిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు గాలం వేశారు. వారు గాలానికి చిక్కినట్టే చిక్కి గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారట. మరి తెలంగాణలో అఖండ మెజార్టీ సాధించి సర్వస్వతంత్రుడిగా ఎదిగిన కేసీఆర్.. ఈ పచ్చ పిచ్చుకల కోర్కెలు తీరుస్తారా.? వారిని పార్టీలో చేర్చుకుంటారా అన్నది హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణ అంతటా గులాబీ గుభాళించిన ఖమ్మంలో మాత్రం వెలవెలబోయింది. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్య.. ఆశ్వరావుపేటలో నాగేశ్వరరావులు గెలిచారు. వీరిద్దరిని టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారట టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు. ఈ ఆఫర్ తో అధికార పార్టీతో ఉంటే అభివృద్ధి, కాసిన్ని నిధులు వస్తాయన్న ఆశతో సత్తుపల్లి ఎమ్మెల్యే తాజాగా తన కార్యకర్తలు, నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావుతోనూ సంప్రదింపులు జరిపారు.

ఆ తర్వాత తనకు మంత్రి పదవి.. మెచ్చా నాగేశ్వరరావుకు కార్పొరేషన్ పదవి ఇస్తే టీఆర్ఎస్ లో టీడీపీని విలీనం చేస్తామనే ప్రతిపాదనను సండ్ర వెంకటవీరయ్య పెట్టారట.. డిమాండ్ నెరవేరకపోతే టీడీపీని వీడేది లేదని తేల్చిచెప్పారట.. పైకి మాత్రం వీరిద్దరూ టీఆర్ఎస్ లో చేరేది లేదని ప్రకటనలు ఇస్తున్నారు.

ప్రస్తుతం టీడీపీని నమ్ముకుంటే తెలంగాణలో బతికి బట్టకట్టలేం. ఆ విషయం సండ్రకు తెలుసు. పైగా అతడిపై ఓటుకు నోటు కేసు ఉంది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ఇచ్చిన బంపర్ ఆఫర్ ను అందుకొని కలిసిపోకుండా సండ్ర గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారు. 90 మంది ఎమ్మెల్యేలు చేతిలో ఉన్న కేసీఆర్ ఈ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల అవసరం తీసుకుంటారా.? సండ్ర కోర్కెలకు తలొగ్గుతాడా ? అసలు ఆ అగత్యం కేసీఆర్ కు వస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.