Begin typing your search above and press return to search.

పైసలు కోసం ప్రాణాలు తీసుడు.. నాటకాలు ఆడుడు.. అడ్డంగా బుక్కయ్యాడు

By:  Tupaki Desk   |   18 Jan 2023 2:30 PM GMT
పైసలు కోసం ప్రాణాలు తీసుడు.. నాటకాలు ఆడుడు.. అడ్డంగా బుక్కయ్యాడు
X
రోజులు గడుస్తున్నకొద్దీ.. నాగరిక సమాజంగా మారుతున్న కొద్దీ మనిషిలోని మానవత్వం మరింత పెరగాల్సిన పరిస్థితి. అందుకు భిన్నంగా పాడు పైసలు కోసం ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడని దుర్మార్గపు వ్యవహారాల్ని చూస్తే.. తల పట్టుకోవాల్సిందే. మరీ.. ఇంతగా పైసలు కోసం దిగజారిపోవాలా? అన్నప్రశ్న తలెత్తక మానదు. తాజాగా వెలుగు చూసిన ఉదంతం చూస్తే.. క్రైం థ్రిల్లర్ ను తలపించే ఈ రియల్ క్రైం స్టోరీ.. మనసును మొద్దుబారేలా చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ.. పైసల కోసం ప్రాణాలు తీసేందుకు ఏ మాత్రం వెనుకాడని మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు కనిపించక మానదు.

మెదక్ జిల్లాకు చెందిన పాత్ లోత్ ధర్మ సచివాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. చక్కగా సాగే కుటుంబాన్ని బాగా డబ్బులు సంపాదించాలన్న యావతో అతను ఆన్ లైన్ బెట్టింగ్ బాట పట్టాడు. అంతే.. అప్పుల పాలయ్యాడు. పూర్తిగా అప్పుల ఊబిలోకి కూరుకుపోయాడు. తాను చేసిన అప్పుల బాధ అంతకంతకూ పెరిగిపోవటంతో.. వాటినుంచి బయటకు వచ్చేందుకు మహా నాటకానికి తెర తీశాడు. కారులో తాను సజీవ దహనమైనట్లుగా సీన్ క్రియేట్ చేస్తే.. తన పేరుతో ఉన్న రూ.7 కోట్ల బీమా డబ్బులు వస్తాయని ప్లాన్ వేశాడు.

అందులో భాగంగా ఒక వ్యక్తిని తన స్థానంలో కారులో ఉంచేసి.. కారును తగలబెట్టేశాడు. జనవరి 9న వెంకటాపూర్ గ్రామ శివారులో పూర్తిగా దగ్థమైన కారును పోలీసులుగుర్తించారు. ఈ కారులో ఉన్న వ్యక్తిని ధర్మగా ఆయన సతీమణి గుర్తించారు. దుస్తులు.. చేతికి ఉన్న ఆభరణాలతో అతను తన భర్తేనని ఆమె పేర్కొన్నారు. ఇతగాడికి సచివాలయంలో జాబ్ కావటంతో కుకట్ పల్లిలో ఉంటున్నాడు. పూర్తిగా దగ్థమైన కారులో దుస్తులు.. ధర్మ సచివాలయంలో పని చేస్తుండటం.. అతని భార్య సైతం కాలిపోయిన డెడ్ బాడీని తన భర్తగా గుర్తించటంతో ఆమె మాటల్ని పోలీసులు నమ్మారు.

అయితే.. కారు పక్కనే పెట్రోల్ డబ్బా కనిపించటంతో పోలీసులకు సందేహం వచ్చింది. దీంతో.. ధర్మ భార్య సెల్ ఫోన్ తో పాటు.. అతడి బంధువుల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటి కాల్ డేటాను పరిశీలించారు. అదే సమయంలో ధర్మ మేనల్లుడి కదలికల మీదా పోలీసులు ఒక కన్నేసి ఉంచారు. ఇదిలా ఉండగా.. ధర్మ సతీమణి నీల సెల్ ఫోన్ కు ఒక మెసేజ్ వచ్చింది. అందులో బీమా డబ్బులు రూ.7కోట్లు వస్తాయని.. వాటితో అప్పులు తీర్చేయాలని మెసేజ్ పెట్టాడు.

అయితే.. పోలీసుల వద్ద ఫోన్ ఉంటుందని అంచనా వేయలేని ధర్మ నాటకం అతడి అతి తెలివితో బయటకు వచ్చింది. తన భార్యకు బీమా డబ్బుల గురించి పంపిన మెసేజ్ తో ధర్మ బతికే ఉన్నాడన్న విషయం అర్థమైంది.

అతడి నుంచి వచ్చిన మెసేజ్ ఫోన్ నెంబరు ఆధారంగా అతడు మహారాష్ట్రలో ఉన్నట్లుగా గుర్తించారు. ప్రత్యేక టీం ఫూణెకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించగా.. బీమా సొమ్ము కోసం డ్రైవర్ ను చంపి.. తాను చనిపోయినట్లుగా నాటకం ఆడినట్లుగా గుర్తించారు. అయితే.. ధర్మ చెప్పిన డ్రైవర్ ఎవరు? అన్నది తేల్లేదు. అతడు ఎవరు? అతని వివరాలు ఏమిటన్న విషయాల్ని వెలికి తీసేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.