Begin typing your search above and press return to search.

సమ్మక్క జాతరలో మందు అమ్మకాలు రికార్డు

By:  Tupaki Desk   |   5 Feb 2018 8:17 PM GMT
సమ్మక్క జాతరలో మందు అమ్మకాలు రికార్డు
X
తెలంగాణ కుంభమేళగా పేరొంది...ఆదివాసీల ఆరాధ్య‌దైవంగా ఉన్న స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ జాత‌ర ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా అనేక రాష్ర్టాల నుంచి భ‌క్తుల‌ను ఆక‌ర్షిస్తూ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్న సంగ‌తి తెలిసిందే. ఇంత‌టి ప్ర‌త్యేక జాత‌ర రెండు రోజుల క్రితం ముగిసింది. వనదేవతల దర్శనంతో కోటిన్నర మంది పులకించారు. అయితే, అదేస్థాయిలో మందుబాబులు కూడా రికార్డ్ క్రియేట్ చేశారు. జస్ట్ నాలుగు రోజుల్లోనే అక్షరాల రూ.50 కోట్ల మందు తాగేశారు.

తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఈ జాత‌ర సంద‌ర్భంగా జ‌రిగిన మ‌ద్యం అమ్మ‌కాల వివ‌రాల‌ను అన‌ధికారికంగా వెల్ల‌డించ‌గా...అవాక్క‌య్యే అంశాలు అందులో ఉన్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు నాలుగు రోజుల్లో మేడారం జాతరలో ఏర్పాటు చేసిన మందు షాపులు, బార్ల ద్వారా రూ.50 కోట్ల ఆదాయం అబ్కారీ శాఖ‌ ఆర్జించింది. ఈ జాత‌ర సంద‌ర్భంగా 22 తాత్కాలిక బార్లకు అనుమతి ఇచ్చారు. ఒక్కో బార్ నుంచి రోజుకు రూ.9వేల లైసెన్స్ ఫీజు వసూలు చేశారు. ఈ ఫీజ్ ద్వారానే 14లక్షలు వస్తే.. 22 షాపుల ద్వారా 4 కోట్ల మందు అమ్మకాలు సాగాయి. జాతర చుట్టుపక్కల, మేడారం సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన లిక్కర్ షాపుల ద్వారా రూ.46 కోట్ల మద్యం అమ్మకాలు సాగాయి. ఈ షాపుల్లో 50శాతం అధిక ధరతో విక్రయాలు సాగాయి.

ఈ జాత‌ర స‌మ‌యంలో వరంగల్ అర్బన్ - వరంగల్ రూరల్ - భూపాలపల్లి - మహబూబా బాద్ - జనగాం - ఖమ్మం - కొత్తగూడెం - ఆదిలాబాద్ - మంచిర్యాల - పెద్దపల్లి జిల్లాల్లోనూ మద్యం అమ్మకాలు పెరిగాయి. మేడారం జాతరకి మూడు కిలోమీటర్ల పరిధిలో 3వేల బెల్ట్ షాపులు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా సేల్స్ మరింత పెరిగింది. మేడారం జాతరలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బార్లు - షాపులకు సర‌ఫ‌రా చేసిన మద్యానికి.. బేవరేజీస్ కార్పొరేషన్ కూడా 30శాతం అదనపు ధర నిర్ణయించింది. ఇప్పటి వరకు రూ.50 కోట్ల ఆదాయం వచ్చినట్లు చెబుతున్న ఎక్సైజ్ శాఖ.. అధికారంగా మాత్రం రెండు రోజుల్లో ప్రకటించనుంది. మొత్తంగా స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌ల జాత‌ర ఈ రూపంలో కూడా ప‌లువురి దృష్టిని చేర‌డం గ‌మ‌నార్హం.