Begin typing your search above and press return to search.

బాబు పాలనను ఏకేసిన ‘మేధావి’

By:  Tupaki Desk   |   7 Oct 2016 5:41 AM GMT
బాబు పాలనను ఏకేసిన ‘మేధావి’
X
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ పని తీరు ఎలా ఉంది? ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి? లాంటి ప్రశ్నలు వేస్తే.. వచ్చే సమాధానాలు వేర్వేరుగా ఉంటాయి. పార్టీల పరంగా వచ్చే మాటలకు.. మేధావి నోట్లో నుంచి వచ్చే మాటలకు పోలిక ఉండదు. ఉద్యమ నేత‌గా.. ప్రముఖ సామాజిక వేత్తగా.. మేధావిగా పేరున్న మేథాపాట్కర్ లాంటోళ్లకు చంద్రబాబు పాలన ఎలా ఉందన్న విషయాన్ని వారి మాటల్లో వింటే కొత్త కోణం కనిపించే వీలు ఉండొచ్చు. విషయం ఏదైనా.. అధ్యయనం చేసిన తర్వాత చెప్పే మేథా లాంటోళ్ల మాటల్ని వినాల్సిన అవసరం ఉంది. మద్యాపానానికి వ్యతిరేకంగా గాంధీ జయంతి రోజున కన్యాకుమారి నుంచి మద్య విముక్త భారత్ కోసం మేథాపాట్కర్ ఆందోళన యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా ఏపీకి వచ్చిన ఆమె.. ఏపీ సర్కారు నిర్మిస్తున్న ఏపీ రాజధాని అమరావతిని.. అక్కడి రైతుల్నికలిసి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా బాబు పాలనపై నిప్పులు చెరిగారు. ఇంతకీ ఆమె ఏమన్నారన్నది ఆమె మాటల్లోనే చూస్తే..

= చంద్రబాబు నాయుడు 1997లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో మద్య నిషేధాన్ని ఎత్తేశారు. బాబు హయాంలో ఏపీలో మద్యం వినియోగం గణనీయంగా పెరిగింది. తమిళనాడులో మద్యం ఆదాయం రూ.26వేల కోట్లు ఉంటే.. ఏపీలో రూ.50వేల కోట్లుగా ఉంది. మద్యం ఆదాయాన్ని భారీగా పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

= పర్యావరణానికి విఘాతం కలిగించేలా కృష్ణా నదీ తీరంలో వెంకటపాలెం రీచ్ లో ఇసుక దోపిడీ జరుగుతోంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి పక్కనే ఉన్న కృష్ణా నదిలో ఇసుక దోపిడీ జరుగుతోంది. అధునాతనమైన యంత్రాలు ఉపయోగించి నదుల్లో ఇసుకను దోపిడీ చేయటం వెనుక చంద్రబాబు హస్తం ఉంది. నదుల్లో ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వేస్తే పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుంది.

= శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం రాజధాని నిర్మించి ఉంటే పంట భూములు మునిగిపోయి ఉండేవి కాదు. ప్రస్తుతం వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం భవనాలు కొండవీడు వాగు పొంగితే మునిగిపోతాయి. ఇలాంటి ప్రాంతం.. ముఖ్యంగా మాగాణి ప్రాంతంలో సచివాలయం ఏమిటి..? రాజధాని భూములపై గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు జరుగుతున్న నేపథ్యంలో.. సరైన తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం.

= తాత్కాలిక సచివాలయం కోసం రూ.800 కోట్లు దుబారా చేశారు. మరి.. శాశ్వత నిర్మాణాలు ఎప్పుడు చేపడతారు? రాజధాని పేరుతో ప్రకృతి సంపదను అడ్డగోలుగా దోచుకొని చంద్రబాబు ప్రజలను దారుణంగా మోసగించారు. ఇక్కడి భూములను చంద్రబాబు వ్యూహాత్మకంగా సింగపూర్ కంపెనీలకు అప్పగించేలా వ్యవహరిస్తున్నారు. స్విస్ ఛాలెంజ్ పేరిట భారీ దోపిడీకి తెర తీశారు. సింగపూర్ లోని రెండు కంపెనీలతో ముందుగానే మాట్లాడుకొని ఆర్థిక లావాదేవీలు కుదుర్చుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/