Begin typing your search above and press return to search.

ఎద్దు ఈనింది?...దూడ‌ను గాడిన క‌ట్టేశాం!

By:  Tupaki Desk   |   23 Feb 2018 6:37 AM GMT
ఎద్దు ఈనింది?...దూడ‌ను గాడిన క‌ట్టేశాం!
X
తెలుగు నేల‌లో ప్ర‌త్యేకించి న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ లో ఓ ర‌క‌మైన ప్ర‌చారం ప‌రాకాష్ట‌కు చేరుకుంది. ఈ ప్ర‌చారానికి కార‌ణ‌మైన విష‌యాల్లో ఏ మేర వాస్త‌వ‌ముంది? స‌ద‌రు విష‌యాల‌తో రాష్ట్రానికి - లేదంటే దేశానికి - మొత్తంగా జ‌నానికి ఏ మేర న‌ష్టం వాటిల్లుతుంది? అస‌లు స‌ద‌రు విష‌యాల‌పై తాము చేస్తున్న ప్ర‌చారం భావ్య‌మేనా? జ‌నం న‌మ్ముతారా?... అన్న విష‌యాల‌ను స‌ద‌రు ప్ర‌చారం చేస్తున్న వ్య‌క్తులు - సంస్థ‌లు - మీడియా సంస్థ‌లు ప‌ట్టించుకుంటున్నాయా? అన్న విష‌యాలు ఇప్పుడు నిజంగానే ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా ఇప్పుడు జ‌రుగుతున్న‌దంతా? ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... ఓ వ‌ర్గానికి కొమ్ము కాసేందుకు రంగంలోకి దిగేసిన కొన్ని మీడియా సంస్థ‌లు... ఆయా అంశాల్లో వాస్త‌వాలెంత‌? అన్న విష‌యాన్ని మ‌రిచేసి త‌న‌కు అనుకూలంగా ఉన్న వ్య‌క్తులు - వ్య‌వ‌స్థ‌ల‌కు మేలు క‌లిగించేలా పుంఖానుపుంఖాలుగా క‌థ‌నాలు రాసేస్తున్నాయి. అదే స‌మ‌యంలో అవే క‌థ‌నాల‌తో త‌మ‌కు వ్య‌తిరేకులుగా భావించిన వారి ప్ర‌తిష్ఠ‌ను మంట‌గ‌లిపేందుకు ఏమాత్రం వెనుకాడ‌టం లేద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. అందుకే తెలుగు నేల‌లోని చాలా మీడియా సంస్థ‌ల‌కు ఎల్లో మీడియాగా చాలా ఏళ్ల క్రిత‌మే పేరొచ్చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

మొత్తంగా ఈ ఎల్లో మీడియా గురించి ఇప్పుడెందుక‌న్న విష‌యానికి వ‌స్తే... వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై న‌మోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ప్ర‌స్తుతం నాంప‌ల్లి సీబీఐ ప్ర‌త్యేక కోర్టులో విచార‌ణ‌లో ఉంది. ఈ కేసులో ప‌లువురు ఐఏఎస్ అధికారుల‌తో పాటుగా ప‌లు పారిశ్రామిక సంస్థ‌లు కూడా నిందితులుగా ఉన్నాయి. ఈ కేసులో కీల‌క నిందితురాలిగా ఉన్న ఇందూ ప్రాజెక్ట్స్‌ కు చేప‌ట్టిన‌ ఇందూ టెక్ జోన్ వ్య‌వ‌హారానికి సంబందించి నిన్న ఎల్లో మీడియాకు చెందిన ప‌త్రిక‌ల్లో వండివార్చిన క‌థ‌నం అస‌లు ఉద్దేశం ఏమిట‌న్న విష‌యం చాలా విస్ప‌ష్టంగానే అర్థం కాక మాన‌దు. ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి నిన్న ప్ర‌థాని న‌రేంద్ర మోదీ - ప‌లు కేంద్ర మంత్రిత్వ శాఖ‌ల‌కు అంత‌ర్జాతీయ న్యాయస్థానం నుంచి జారీ అయిన లీగ‌ల్ నోటీసుల‌ను ఆధారం చేసుకుని ఎల్లో మీడియా మ‌రోమారు స్వైర విహారం చేసింద‌నే చెప్పాలి. అస‌లు విష‌యాన్ని పక్క‌న‌పెట్టేసి... ఆ వ్య‌వ‌హారానికి అభూత క‌ల్ప‌న‌లు చేసేసి... భార‌త చ‌రిత్ర‌లో ఇలా ఎప్పుడూ జ‌ర‌గ‌లేద‌ని - జ‌గ‌న్ కార‌ణంగా భార‌త ప‌రువు ప్ర‌తిష్ఠ‌లు గంగ‌లో క‌లిసిపోయాయ‌ని ఎల్లో మీడియా నెత్తీ నోరూ బాదుకుంది. ఎల్లో మీడియా క‌థ‌నాల్లోని నిజానిజాలు ఎంత‌న్న విష‌యంపై ఓ సారి లుక్కేస్తే... ఇందూ టెక్ జోన్ లో మారిష‌స్ కు చెందిన కారిస్సా సంస్థ వంద కోట్ల మేర పెట్టుబ‌డి పెట్టింది.

అయితే జ‌గ‌న్‌ పై న‌మోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇందూ ప్రాజెక్ట్స్ సంస్థ య‌జ‌మాని శ్యాంప్ర‌సాద్ రెడ్డి కూడా నిందితుడిగా ఉండ‌టం - జ‌గ‌న్ కేసులో ఇందూ టెక్ జోన్ వ్య‌వ‌హారం కూడా కీల‌క పాత్ర పోషించింద‌ని సీబీఐ చార్జిషీట్ దాఖ‌లు చేయ‌డంతో ఇందూ టెక్ జెన్ంచ్‌ జోన్ అట‌కెక్కింద‌నే చెప్పాలి. అయితే స‌ద‌రు వెంచ‌ర్‌ లో వంద కోట్ల మేర పెట్టుబ‌డులు పెట్టిన కారిస్సా... త‌న పెట్టుబ‌డిని రాబ‌ట్టుకునేందుకు రంగంలోకి దిగింది. కారిస్సానే కాదు... ఏ కంపెనీ అయినా మూత‌ప‌డిపోయిన ప్రాజెక్టు నుంచి త‌న నిధుల‌ను రాబ‌ట్టుకునేందుకే సిద్ధ‌ప‌డుతుంది. ఇదే రీతిన వ్య‌వ‌హ‌రించిన కారిస్సా.. తాను పెట్టుబ‌డులు పెట్టిన దేశం భార‌త్ కాబ‌ట్టి... భార‌త దేశానికి ప‌రిపాల‌న అధినేత‌గా ఉన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి - ఆయ‌న కేబినెట్ లోని ప‌లు మంత్రిత్వ శాఖ‌లకు అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం నుంచి లీగ‌ల్ నోటీసులు పంపింది. ఆ లీగ‌ల్ నోటీసుల్లో ఏముంద‌న్న విష‌యానికి వ‌స్తే... ఇందూ టెక్ జోన్ లో తాను పెట్టిన పెట్టుబ‌డిని ఇప్పించాల‌ని మాత్ర‌మే.

అయినా ఈ వ్య‌వ‌హారంలో ఇటు భార‌త ప్ర‌భుత్వం గానీ - అటు కారిస్సా సొంత దేశం మారిష‌స్ గానీ ఇప్పుడే క‌దిలింది కూడా ఏమీ లేదు. చాలా కాలం నుంచే ఈ వ్య‌వ‌హారంలో చాలా క‌స‌ర‌త్తే జ‌రిగింది కూడా. కారిస్సా పెట్టుబడుల‌ను వెన‌క్కి ఇప్పించే విష‌యంలో కారిస్సా కోరుతున్న‌ట్లుగా బ‌య‌టి వ్య‌క్తుల మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌ద్ద‌ని - తామే మ‌ధ్య‌వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని కూడా భార‌త ప్ర‌భుత్వం ఇప్ప‌టికే చెప్పేసింది. మొత్తంగా ఈ విష‌యంపై విచార‌ణ జ‌రుపుతున్న అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం భార‌త ప్ర‌భుత్వ ప్ర‌తిపాద‌న‌కు కూడా ఆమోదం తెలిపింది. అయితే ఇవేవీ ప‌ట్ట‌ని ఓ ప‌త్రిక‌... జ‌గ‌న్ కేసుల కార‌ణంగా ప్ర‌ధాని మోదీకి మ‌కిలి అంటింద‌ని - భార‌త దేశ ప‌రువు ప్ర‌తిష్ఠ మంట గ‌లిసింద‌ని త‌న‌కు ఇష్ట‌మైన రీతిలో క‌థ‌నం వండి వార్చేసింది. ఈ క‌థ‌నంలో నేల విడిచి సాము చేసిన‌ట్లుగా ఆ ప‌త్రిక అస‌లు విష‌యాన్ని ఏమాత్రం ప్ర‌స్తావించ‌కుండా... కేవ‌లం ప్ర‌ధానికి నోటీసులు వ‌చ్చిన విష‌యాన్ని మాత్ర‌మే ఆధారం చేసుకుని త‌న‌దైన శైలి క‌థ‌నం రాసేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.