Begin typing your search above and press return to search.

జగన్ అన్న మాటేమిటి?

By:  Tupaki Desk   |   27 Jan 2017 7:14 AM GMT
జగన్ అన్న మాటేమిటి?
X
హోదా మీద విశాఖలో చేపట్టిన శాంతియుత నిరసన ఎపిసోడ్ లో ఏపీ విపక్ష నేతకు సంబంధించిన ఒక వ్యాఖ్యను కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాను పిలుపునిచ్చిన కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనేందుకు విశాఖకు వచ్చిన జగన్ ఆయన పరివారాన్ని ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అడ్డుకోవటం తెలిసిందే.

రన్ వే నుంచి విమానాశ్రయం లాంజ్ లోకి వెళ్లేందుకు సైతం అనుమతించని అధికారుల తీరుతో జగన్ తోపాటు.. ఆయన పార్టీ నేతలు ఆగ్రహానికి గురయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఎయిర్ పోర్ట్ లోపల సివిల్ పోలీసులు ఉండటం.. కొంతమంది గుర్తింపు కార్డులు లేకుండా విధులు నిర్వహిస్తున్న వైనంపై జగన్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి.

ఈ సందర్భంగా జగన్ అన్నట్లుగా ఒక మాటను ఒక ఛానల్ ప్రసారం చేయటం.. దాన్ని పట్టుకొని మిగిలిన చానళ్లు ఫాలో అయినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. తనను తాను ముఖ్యమంత్రిగా జగన్ అభివర్ణించుకున్నారన్నది సదరు ఛానల్ ఆరోపణ. నిజంగానే జగన్ ఆ మాట అన్నారా? అంటే.. వారు ప్లే చేస్తున్న విజువల్స్ లో జగన్ నోటి నుంచి ఆ మాట వచ్చినట్లుగా స్పష్టంగా కనిపించదు. కానీ.. ఆయన నోటి నుంచి ఆ మాట వచ్చినట్లుగా పదే పదే ప్రసారం చేయటం జరిగింది.

అయితే.. మీడియాలో జరిగిన ప్రచారానికి వాస్తవానికి మధ్య పోలిక లేదని చెబుతున్నారు. తనను అడ్డుకున్న పోలీసులను ఉద్దేశించి జగన్ అన్న మాటలు వేరుగా ఉన్నాయని చెబుతున్నారు. ‘‘నేను ప్రతిపక్షనాయకుడిని. నన్ను అడ్డగిస్తున్నారు. అదే ముఖ్యమంత్రిని ఇలా పట్టుకుంటావా ’ అన్న వ్యాఖ్యను వక్రీకరించి.. తప్పుడుప్రచారం చేస్తున్నారన్న మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది. జగన్ ను ఇరుకున పెట్టేలా వార్తల్ని వండి వార్చటం కంటే.. ఏపీకి ఎంతో ప్రయోజనం చేకూర్చే ప్రత్యేక హోదా అంశంపై మరింత ఉత్సాహంతో కథనాలు ప్రసారం చేయరే? అన్న ప్రశ్న వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/