Begin typing your search above and press return to search.

మణిపుర్ ఎన్నికలకు మీడియా కవరేజ్ అంతంత మాత్రమే..!

By:  Tupaki Desk   |   7 Feb 2022 12:30 AM GMT
మణిపుర్ ఎన్నికలకు మీడియా కవరేజ్ అంతంత మాత్రమే..!
X
దేశంలోని 5 రాష్ట్రాలకు మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. అవి ఉత్తర్ ప్రదేశ్​, పంజాబ్, గోవా, మణిపుర్, ఉత్తరాఖండ్. ఈ ఐదు రాష్ట్రాల్లో రాజకీయం ఇప్పటికే బాగా వేడెక్కింది. కొన్ని చోట్ల అయితే నామినేషన్ పత్రాలు సమర్పణలు కూడా అయిపోయాయి. దీంతో రాజకీయ పార్టీలు వ్యూహ, ప్రతి వ్యూహాలకు పదును పెట్టాయి. కొన్ని చోట్ల అభివృద్ధి నినాదంతో నాయకులు ముందుకు పోతుంటే, మరికొన్ని చోట్ల మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కేవలం కొన్ని రాయకీయ పార్టీలు అభివృద్ధి నినాదాలను పక్కన పెట్టి ఏకంగా కులం, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అలా చేసే రాష్ట్రాలకు, పార్టీలకు స్థానిక, జాతీయ మీడియా సంస్థలు పెద్దపీట వేసి మరీ చూపిస్తున్నాయి. గంపంత హెడ్డింగులు పెట్టి, స్క్రోలింగుల మీద స్క్రోలింగు వేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఎన్నికలు జరుగుతున్న ఓ రాష్ట్రం గురించి మీడియాలో కథనాలు లేవు. కనీసం వాటిని మంచిగా కవర్ చేసే రిపోర్టర్లు కూడా లేరు. అదే ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్.

ప్రస్తుతం మీడియా దృష్టి అంతా ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల మీద ఉంది. ఒక రాష్ట్రంలో భాజపా అధికార పార్టీ కావడం, అందులోనూ అతి పెద్ద రాష్ట్రంగా ఉండడం, ఉత్తర్ ప్రదేశ్ లో బీజీపీకి పట్టు జరితే ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికల మీద పడుతుంది అనే కథనాలు విరివిగా రావడం లాంటి వాటితో ఉత్తర్ ప్రదేశ్ మీద జాతీయ మీడియా ఫోకస్ ఎక్కువ అయ్యింది. దీనికి తోడు జాతీయ మీడియాలో సింహ భాగం ఛానెళ్లు అన్నీ భాజపాకు అనుకూలంగా వ్యవహరించాయి. అందుకే మరింత ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. అలానే వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతు ఉద్యమాన్ని ముందుండి నడిపిన వారు ఎక్కువ భాగం పంజాబ్ నుంచి ఉండడంతో అక్కడ భాజపా ఏ మాత్రం సత్తా చాటుతుంది? ఎన్ని సీట్లు వస్తాయి? లేక ఆప్ పాగా వేసే అవకాశాలు ఉన్నాయా? చన్నీ, సిద్దూల మధ్య వివాదం ఈ ఎన్నికలతో ముదురుతుందా? ఇలా చాలా కారణాలతో మీడియా పంజాబ్ పై కూడా ప్రత్యేక దృష్టిసారించింది .

ఇక మిగతా రాష్ట్రాలు సంగతి సరేసరి. వీటిలో కొద్దోగొప్పో చెప్పుకోవాలి అంటే గోవా బెటర్. పార్టీ ఫిరాయింపులతో రాజకీయంగా హీటు పుట్టించే నాయకులకు ఇక్కడ కొదవ లేదు. అందుకే ఈ రాష్ట్రంలో కూడా ఎన్నికల హడావిడి కనిపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే మీడియా దృష్టి కూడా పడుతుంది. కాబట్టి దీనికి కూడా మీడియా ప్రచారం ఓ మోస్తరుగా ఉందని చెప్పాలి. అయితే మరో ఇంక మిగిలిన రాష్ట్రాలు రెండు. అవి ఒకటి ఉత్తరాఖండ్ అయితే మరోకటి మణిపుర్. కేవలం విపత్తులు సంభవించినప్పుడు మాత్రమే జాతీయ మీడియాకు ఉత్తరాఖండ్ గుర్తుకు వస్తుంది. అదే స్థాయిలో ఎన్నికల ప్రచారానికి సంబంధించి మీడియా ఫోకస్ ఉండడం లేదు. కారణం పక్కన ఉన్న యూపీ ఎన్నికలపై దృష్టి ఎక్కువ ఉండడమే.

ఇక చివరిగా మిగిలింది మణిపుర్. ఈశాన్య రాష్ట్రానికి మీడియా కవరేజ్ చాలా తక్కువగా లభిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలి అంటే ఆ రాష్ట్రముఖ్యమంత్రి పేరు కూడా రోజు పేపర్, టీవీ వార్తలు చదివే వాళ్లకు, వినే వాళ్లకు కూడా తెలియదు అనే చెప్పాలి. దీనికి ప్రధాన కారణం ఈ ఎన్నికలపై కేంద్రానికి ప్రత్యేక దృష్టి లేకపోవడం ఒకటి అయితే దీనిని పట్టించుకునే వారు, చూసే వారు దేశంలో చాలా తక్కువ మంది ఉండడం. కేంద్రం పెద్దగా దృష్టి సారించకపోవడానికి కూడా ఓ కారణం ఉంది. ఇక్కడ ఉండే అసెంబ్లీ సీట్లు కేవలం అరవై. అంటే ఇక్కడ నుంచి వచ్చే లోక్ సభ స్థానాలు కూడా చాలా తక్కువ. దీంతో ఈ రాష్ట్రంపై కేంద్ర అధినాయకత్వం పట్టించుకోలేదు. అన్నింటికి మధ్యన ఉన్న యూపీ పైనే దృష్టి ఎక్కువగా ఉంది.

అంతేగాకుండా మణిపుర్ లో రాజకీయ ప్రచారం చాలా భిన్నంగా ఉండడం కూడా కారణం అని రాజకీయ నిపుణలు చెప్తున్నారు. మిగతా రాష్ట్రాల్లోలాగా కాకుండా ఇక్కడ మొదటి నుంచి రాజకీయ అక్షరాస్యత అంతంత మాత్రంగా ఉండడం కూడా ఓ కారణం అని అభిప్రాయపడుతున్నారు. మరో కారణం కూడా ఇక్కడ ఉంది. మీడియా కవరేజ్ ఇవ్వాలంటే ముందుగా దిల్లీ మీడియా... మణిపుర్ గల్లీల్లోకి చేరుకోవడం చాలా సవాళ్లతో కూడుకున్నదని చాలా మంది జర్నలిస్టుల అభిప్రాయం. ఇలా అన్నీ రాష్ట్రాలతో పోల్చితే మీడియా ప్రాచూర్యం మణిపుర్ ఎన్నికలకు దక్కలేదని చెప్పాలి.