Begin typing your search above and press return to search.

టీ ఎన్నికలు.. మీడియాకు 100 కోట్లు..

By:  Tupaki Desk   |   8 Dec 2018 11:19 AM GMT
టీ ఎన్నికలు.. మీడియాకు 100 కోట్లు..
X
తెలంగాణలో పోలింగ్ ముగిసింది. గెలవడం కోసం అభ్యర్థుల చేతి చమరు వదిలింది. తెలంగాణ ఎన్నికల్లో డబ్బు - మద్యం ఏరులై పారింది. తాజాగా మీడియా పంట కూడా పండింది. అనుకూలంగా వ్యవహరించిన మీడియాలకు వందల కోట్ల లబ్ధి చేకూరిందని మీడియా మిత్రులు గుసగుసలాడుకుంటున్నారు.

జర్నలిస్టు మిత్రుల నుంచి లీక్ అవుతున్న సమాచారం ప్రకారం ఒక ప్రముఖ పార్టీకి కొమ్ము కాసి.. దాన్ని గెలిపించడం కోసం తపనపడిన ఒక ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ భారీగా లాభపడిందట.. వారు సదురు పార్టీని గెలిపించేందుకు కోట్లాది రూపాయలను ప్యాకేజీగా తీసుకున్నట్టు చెబుతున్నారు. ప్రకటనలు - అనుకూల కథనాలను వండివార్చేందుకు - ఇంటర్వ్యూలను ఈసీ కళ్లపడకుండా ప్రసారం చేసినందుకు సదురు చానెల్ భారీ మొత్తం కళ్లజూసిందట.... ఇదే కాదు తెలంగాణ ఎన్నికల వేళ న్యూస్ చానెల్స్ అన్ని భారీగా లబ్ధి పొందాయని.. దాదాపు వంద కోట్ల వరకు సంపాదించాయని నొక్కిచెబుతున్నారు.

తెలుగులోని కొన్ని చానెల్స్ ఎన్నికల వేళ నిష్పక్షపాతంగా చర్చలు నిర్వహించాయి. కొన్ని మాత్రం పార్టీలకు అమ్ముడుపోయి వారికి అనుకూలమైన చర్చలే నిర్వహించాయని జర్నలిస్టు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. పెయిడ్ న్యూస్ ను సాధారణ వార్తల్లాగా అన్వయించి ఈసీకి దొరక్కుండా సదురు పార్టీలకు లబ్ధి చేకూర్చేలా ప్రసారం చేశారని.. ఇది ఎన్నికల కమిషన్ నిబంధనలు విరుద్ధమైనా కొనసాగించారని విమర్శిస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడానికి ఇటీవల కొందరు జర్నలిస్టులు ప్రయత్నించినా ఎన్నికల కమిషనర్ కలవడానికి అనుమతించలేదట.. దీంతో వారు తెలుగు న్యూస్ చానెల్స్ ఇలా పార్టీలకు అనుకూలంగా ప్రసారాలు చేశాయని సుప్రీంకోర్టుకు - ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్లో నివేదికను పంపినట్టు సమాచారం.

ఇదే సమయంలో పత్రికలు కూడా ఎన్నికలను ఆదాయం కోసం ఉపయోగించుకున్నాయి. జిల్లా ఎడిషన్లలో పత్రికలు ఎమ్మెల్యేకు 3 నుంచి 6 లక్షల దాకా ప్యాకేజీలు మాట్లాడుకొని వారి ప్రచారాలు - ఇంటర్వ్యూలు - అనుకూల వార్తలను నెలరోజులుగా ప్రచురించాయి. డబ్బులు - ప్యాకేజీలు ఇవ్వని ఎమ్మెల్యే అభ్యర్థుల వార్తలే పత్రికల్లో కనిపించలేదంటే ఈ వ్యాపారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇలా సమాజంలో నీతి నిజాయితీగా నిక్కచ్చిగా ఉండాల్సిన ఫోర్త్ ఎస్టేట్ కూడా డబ్బులకు అమ్ముడు పోవడం విషాధకర పరిణామంగా సీనియర్ జర్నలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు.