Begin typing your search above and press return to search.

పొద్దుపొద్దున్నే కేసీఆర్ డ‌బుల్ ద‌ర్శ‌నం

By:  Tupaki Desk   |   1 Jan 2018 5:24 AM GMT
పొద్దుపొద్దున్నే కేసీఆర్ డ‌బుల్ ద‌ర్శ‌నం
X
అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసే అతి కొద్ది రోజుల్లో డిసెంబ‌రు 31 ఒక‌టి. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఎంజాయ్ చేస్తారు. అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత కూడా నిద్ర‌పోరు. ఆ మాట‌కు వ‌స్తే నిద్ర రాద‌నే చెప్పాలి. అందుకే డిసెంబ‌రు ఎంత ఆల‌స్యంగా ప‌డుకుంటారో.. జ‌న‌వ‌రి ఒక‌టో తేదీన అంత ఆల‌స్యంగా నిద్ర లేస్తుంటారు.

ప‌దిహేనేళ్ల క్రితం.. ఇప్పుడున్నంత‌గా డిసెంబ‌రు 31కు హ‌డావుడి ఉండేది కాదు. కుర్ర‌కారు సంద‌డి చేసుకున్నా.. ఇళ్ల‌ల్లో వారు మాత్రం.. ఆరు బ‌య‌ట ముగ్గులు వేసుకోవ‌టం.. ప‌న్నెండు కాగానే శుభాకాంక్ష‌లు చెప్పుకొని నిద్ర‌పోయేవారు. కానీ.. ఇప్పుడు సీన్ మారిపోయింది. అర్థ‌రాత్రి అవుతున్న ఆల‌స్యానికి త‌గ్గ‌ట్లే జ‌న‌వ‌రి 1 వేడుక‌లు కాస్త ఆల‌స్యంగానే షురూ అవుతున్నాయి.

కొత్త సంవ‌త్స‌రం.. కొత్త కొత్త‌గా స్టార్ట్ చేద్దామ‌ని లేచి.. క‌ళ్లు నులుముకుంటూ న్యూస్ పేప‌ర్ తీసిన వారికి నిండు ముఖంతో న‌వ్వుతూ ద‌ర్శ‌న‌మిచ్చారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. అన్ని తెలుగు పేప‌ర్ల‌కు దాదాపుగా జాకెట్ యాడ్స్ (ప‌త్రికా ప‌రిభాష‌లో ఇలా వ్య‌వ‌హ‌రిస్తుంటారు) ఇచ్చేసింది తెలంగాణ ప్ర‌భుత్వం. ప‌నిలో ప‌నిగా.. కొన్ని పేప‌ర్ల‌లో అయితే.. మూడో పేజీలో అర్థ‌భాగం కేసీఆర్ ను కీర్తించ‌టం.. వ్య‌వసాయానికి 24 గంట‌ల నిణ్య‌మైన‌.. ఉచిత విద్యుత్ ను ఇస్తున్న వైనం మీద ప్ర‌క‌ట‌న ఇచ్చేశారు.

ప్ర‌భుత్వం చేస్తున్న అద్భుత‌మైన ప‌ని గురించి.. చేప‌ట్టిన కార్య‌క్ర‌మం గురించి గొప్ప‌గా చెప్పుకోవ‌టం త‌ప్పేం కాదు. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్రం వస్తే.. రాష్ట్రం మొత్తం చిమ్మ చీక‌ట్లు క‌మ్ముకోవ‌టం ఖాయ‌మ‌ని మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పిన నేప‌థ్యంలో.. కేసీఆర్ స‌ర్కారు సాధించిన ఘ‌న‌త‌ను ఘ‌నంగా చాటి చెప్పుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. మొద‌టి పేజీ మొత్తం యాడ్ తో నిండిపోగా.. లోప‌ల‌కు వెళ్లిన వెంట‌నే.. బ్యాన‌ర్ వార్త‌గా కేసీఆర్ స‌ర్కారు తాజాగా చేప‌డుతున్న వ్య‌వ‌సాయానికి 24 గంట‌లు నిరంత‌రాయంగా నాణ్య‌మైన ఉచిత విద్యుత్ ప‌థ‌కం గురించి ఉద‌ర‌గొడుతూ వార్త‌లు ఇవ్వ‌టం క‌నిపించింది.

మొత్తంగా.. కొత్త సంవ‌త్స‌రం పేప‌రు తీసినంత‌నే.. కేసీఆర్ స‌ర్కారును ఆకాశానికి ఎత్తేసేలా రెండు సార్లు క‌నిపించి.. ఈ ఏడాది మొత్తం ఎలా ఉంటుందో చెప్ప‌క‌నే చెప్పేసింద‌ని చెప్పాలి. వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల ఏడాది కావ‌టంతో.. ఈ ఏడాది పాల‌నా ప‌రంగా కీల‌కంగా మార‌ట‌మే కాదు.. హ‌డావుడి ఎంతో అన్న విష‌యాన్ని శాంపిల్ గా చెప్పిన‌ట్లుగా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.