Begin typing your search above and press return to search.

స‌ర్వే వార్తతో ఇబ్బందుల్లో ప‌డ్డ మీడియా సంస్థ‌

By:  Tupaki Desk   |   1 April 2019 7:44 AM GMT
స‌ర్వే వార్తతో ఇబ్బందుల్లో ప‌డ్డ మీడియా సంస్థ‌
X
మిగిలిన రోజుల సంగ‌తి ఎలా ఉన్నా.. ఎన్నిక‌ల వేళ మీడియా సంస్థ‌లు అత్యంత అప్ర‌మ‌త్త‌తతో ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏది నిజం? ఏది అబ‌ద్ధం అన్న విష‌యాన్ని గుర్తించ‌టం కొన్ని సంద‌ర్భాల్లో క‌ష్టంగా ఉంటుంది. ఇలాంటి వేళ ఆచితూచి అడుగులు వేయాలే కానీ.. తొంద‌ర‌ప‌డితే ఎదురుదెబ్బ ఖాయం.

తాజాగా ఒక మీడియా సంస్థ‌ ఇలాంటి ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదుర్కొంది. తాజాగా ఎబీపీ చానల్ కోసం లోక్ నీతి స‌ర్వే సంస్థ ఏపీలో ఎన్నిక‌ల స‌ర్వేను నిర్వ‌హించిన‌ట్లుగా పేర్కొన్న స‌ద‌రు మీడియా సంస్థ‌.. ఒక భారీ క‌థ‌నాన్ని అచ్చేసింది.

ఈ క‌థ‌నంలో టీడీపీకి భారీగా సీట్లు వ‌స్తాయ‌న్న అంచ‌నాను వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. వైఎస్సార్ కాంగ్రెస్ కు 50కు మించిన సీట్లు రావ‌న్న‌ట్లుగా క‌థ‌నం అచ్చేసింది. ఈ రోజు ప‌త్రిక‌లో ప్ర‌చురిత‌మైన ఈ క‌థ‌నాన్ని తాజాగా సీఎస్ ఈఎస్ లోక్ నీతి స‌ర్వే సంస్థ త‌ప్పు ప‌ట్టింది. ట్విట్ట‌ర్ ఖాతాలో తాము ఎలాంటి స‌ర్వేను నిర్వ‌హించ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. వారి వెబ్ సైట్ లోనూ తాము చేసిన‌ట్లుగా చెప్పే స‌ర్వే వాస్త‌వం కాద‌ని.. అది అబ‌ద్ధ‌మ‌ని పేర్కొంది.

తమ‌కు సంబంధం లేని స‌ర్వేను.. త‌మ సంస్థ పేరుతో అచ్చేసిన వార్త‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. చ‌ట్ట‌బ‌ద్ధంగా చ‌ర్య‌లు తీసుకోనున్నట్లు పేర్కొంది. తాజా ప‌రిణామం ఒక విధంగా అన్ని మీడియా సంస్థ‌ల‌కు ఒక హెచ్చ‌రిక లాంటిది.

ఇప్పుడున్న స‌మాచార విప్ల‌వంలో ఏది నిజం? మ‌రేది అబ‌ద్ధ‌మ‌న్న విష‌యాన్ని క్రాస్ చెక్ చేసుకున్న త‌ర్వాతే స‌మాచారాన్ని ప్ర‌జ‌ల‌కు అందించే ప్ర‌య‌త్నం చేయాలి. లేదంటే.. ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదురుకాక త‌ప్ప‌దు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ఫేక్ న్యూస్ ను గుర్తించే విష‌యంలో దొర్లిన త‌ప్పుతోనే ఈ వార్త ప్ర‌చురిత‌మైన‌ట్లుగా తెలుస్తోంది. దీనిపై స‌ద‌రు మీడియా సంస్థ‌లో అంత‌ర్గ‌త విచార‌ణ పెద్ద ఎత్తున జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. అస‌లేం జ‌రిగింది? ఎక్క‌డ త‌ప్పు దొర్లింది? దీనికి కార‌ణం ఏవ‌రు? అన్న విష‌యాల మీద ఫోక‌స్ పెట్టిన‌ట్లుగా స‌మాచారం.