Begin typing your search above and press return to search.
మీడియాకు సుప్రీం బూస్టిచ్చేసినట్టేనా?
By: Tupaki Desk | 9 Jan 2018 11:21 AM GMTదేశంలోని పత్రికలు - న్యూస్ ఛానెళ్లు - వెబ్ సైట్లు నడుతుపున్న మీడియా సంస్థలకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చేలా సంచలన తీర్పు చెప్పింది. ఉద్దేశపూర్వకంగా చేయని తప్పులతో మీడియా సంస్థలు పలు కేసుల్లో చిక్కుకుంటున్నాయన్న కోణంలో ఆలోచించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా కాసేపటి క్రితం సంచలన తీర్పు చెప్పారు. మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్న వార్తల వల్ల తమ పరువుకు భంగం కలిగిందని, సదరు మీడియా సంస్థలపై పరువు నష్టం కేసులు దాఖలు చేయాలని కోరుతూ కోర్టుకు ఎక్కుతున్న వ్యక్తులను ఉద్దేశించి జస్టిస్ దీపక్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు.... నిజంగానే మీడియా సంస్థలకు శ్రీరామరక్ష అనే చెప్పాలి.
అయినా జస్టిస్ మిశ్రా చెప్పిన తీర్పు ఏమిటంటే... మీడియా సంస్థలు రాసిన - ప్రసారం చేసిన వార్తల్లో ఏవైనా తప్పులు దొర్లినా... అవి పరువు నష్టం కిందకు రావట. ఎందుకంటే... ఆయా మీడియా సంస్థలు ప్రసారం చేసిన వార్తల వల్ల అవతలి వ్యక్తి పరువు భంగం కలిగినా కూడా... ఆ వార్తలను పరువు నష్టం కేసుల కిందకు రావట. అసలు మీడియా సంస్థల్లో తప్పులెలా జరుగుతాయన్న విషయాన్ని కూడా జస్టిస్ మిశ్రా చాలా సునిశిత దృష్టితో పరిశీలించి ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా చెప్పుకోవాలి.
ఈ సందర్భంగా జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం చాలా క్లియర్ గా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ‘‘వార్తను త్వరగతిన ఇవ్వాలన్న ఆత్రుత వల్లనో లేక మరే ఇతర కారణంతోనో చిన్న చిన్న తప్పులు చేస్తూ మీడియా సంస్థలు వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. తమ పరువుకు భంగం వాటిల్లినప్పుడు బాధితులు కోర్టులను ఆశ్రయించవచ్చు. అది రాజ్యాంగబద్ధంగా వారికి లభించిన హక్కు. అయితే మీడియా సంస్థలు చేసే పొరపాట్లు అవి అవతలివారికి నష్టం కలిగించేవే అయినా.. అవి పరువు నష్టం కిందకు రాబోవు’’ అని ధర్మాసనం పేర్కొంది.
ఓ హిందీ టీవీ ఛానెల్ తనపై అసత్య వార్తలు ప్రచురించాయని బీహార్ కు చెందిన ఓ మహిళ ఏడేళ్ల క్రితం పాట్నా హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. భూకబ్జా వ్యవహారంలో తన పేరు, తన కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావిస్తూ తప్పుడు కథనాలతో తన పరువుకు భంగం కలిగించారని ఆమె పిటిషన్ లో పేర‍్కొన్నారు. అయితే వెంటనే ఆ మీడియా సంస్థ క్షమాపణలు తెలియజేస్తూ ప్రకటన ఇవ్వగా.. ఆమె ఆ మాత్రం వెనక్కి తగ్గలేదు. గతేడాది సెప్టెంబర్ లో హైకోర్టు బెంచ్ ఆ పిటిషన్ ను కొట్టేసింది. దీంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించటంతో నిన్న ఆ పిటిషన్ విచారణకు రాగా.. జస్టిస్ మిశ్రా పై విధంగా స్పందించారు.