Begin typing your search above and press return to search.

పవన్ ‘పవర్’ తగ్గిందా? తగ్గించేస్తున్నారా?

By:  Tupaki Desk   |   16 Oct 2016 5:42 AM GMT
పవన్ ‘పవర్’ తగ్గిందా? తగ్గించేస్తున్నారా?
X
పవన్ కల్యాణ్ పేరులోనే ఏదో మేజిక్ ఉన్నట్లుగా ఊగిపోతారు. తెలుగు సినీ పరిశ్రమలో మరే హీరోకి లేనంత ఇమేజ్ పవన్ సొంతం. అతడి తీరును ‘ఇజంగా’ చెప్పుకుంటూ పవనిజం అంటూ అతడ్ని అభిమానించే తీరు మరే హీరోకీ కనిపించదు. దీనికి తగ్గట్లే.. ఆయన తీరు ఉంటుంది. నిజాయితీగా మాట్లాడే అలవాటున్న పవన్ ను అభిమానించే వారితో పాటు.. విమర్శించే వారూ ఉంటారు. అయితే.. తాను చేసే ఏ పనినైనా కమిట్ మెంట్ తో చేసినట్లు కనిపించినా.. కంటిన్యూటీ మిస్ కావటం ఆయనలో కనిపించే ప్రధాన లోపంగా చెబుతుంటారు.

అయితే.. దీనికి తరచూ పవనే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు. తన దగ్గర ఎక్కువ డబ్బుల్లేవని.. బతకాలంటే డబ్బు అవసరమైన వేళ.. తనకు ఆదాయమార్గంగా ఉన్న సినిమా మాథ్యమమే తనకున్న ఉపాధి వనరుగా చెబుతారు. తన ఆర్థిక పరిస్థితి గురించి ఇంత ఓపెన్ గా మాట్లాడే వారు సినీ పరిశ్రమలోనే కాదు.. రాజకీయ నేతల్లోనూ కనిపించరు. ఆ మాటకు వస్తే.. ప్రముఖులెవరూ తమ బ్యాంకు బ్యాలెన్స్.. తమకున్న ఆస్తుల గురించి ‘విప్పి’ చెప్పేందుకు అస్సలు ఇష్టపడరు.

అయితే.. పవన్ కల్యాణ్ అందుకు పూర్తి భిన్నం. ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవటానికి మొహమాటం ఎందుకు? అన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. మాటలే కాదు.. చేతలూ అలానే ఉండటం ఆయనపై మరింత గౌరవాన్ని పెంచేలా చేస్తుంటాయి. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడంటూ రాజకీయంగా విమర్శించేందుకు ప్రయత్నిస్తే.. పవన్ మాట ఎంత సూటిగా ఉంటుందంటే.. ‘‘నా పెళ్లి నా ఇష్టం. నేనేం.. చాలామంది సోకాల్డ్ రాజకీయ నేతల మాదిరి లోధావాలా రిసార్ట్స్ లో ఎంజాయ్ చేయలేను. మనసుకు నచ్చిందే చేస్తాను’ అంటూ కుండబద్ధలు కొడతాడు. నిజమే.. ఆదర్శనాలు వల్లించే కొందరు నేతల రహస్య వ్యక్తిగత జీవితాలతో పోల్చినప్పుడు మూడుసార్లు పెళ్లిళ్లు అధికారికంగా చేసుకున్న పవనే బెటరనిపించక మానదు.

ఇలాంటి పవన్ సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయాల్లో అడుగుపెట్టారు. జనసేన అంటూ పార్టీ పెట్టి.. తానొక్కడే పార్టీ మొత్తమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ పెట్టి రెండున్నరేళ్లు అవుతున్నా.. పవన్ తప్పించి.. ఆ పార్టీకి చెందిన నేత మరొకరు కనిపించరు. రాజకీయ పార్టీ పెట్టేసి.. తాను ఫుల్ టైం రాజకీయాలు చేయలేనని ధైర్యంగా చెప్పేసే మొనగాడు పవన్ కల్యాణ్. అదే సమయంలో ఎవరైనా తన దగ్గరకు వచ్చి అన్యాయం గురించి కానీ దోపిడీ గురించి కానీ చెబితే.. సమయానుకూలంగా మాట్లాడుతుంటారు. ప్రత్యేక హోదా అంశంపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. తిరుపతి.. కాకినాడ రెండుసభల్లో తన వాదనను వినిపించి.. ఆ విషయం మీద తనకున్న అసంతృప్తిని వ్యక్తం చేశారు.

అయితే.. హోదా అంశంపై పవన్ రోడ్డు మీద పడి.. అదే పనిగా ఉద్యమాలు చేయాలని.. ఆయన చేసే పోరాటాలతో చలి కాచుకోవాలని ప్రయత్నించే చాలామంది నేతలకు చిక్కకుండా.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న పవన్ కు సంబంధించి.. ఆయనేం మాట్లాడినా మీడియాలో ప్రముఖంగా కనిపించే పరిస్థితి. ఆయన ఏమైనా మాట్లాడితే.. పత్రికల్లో పతాక శీర్షికల్లో కనిపించే పరిస్థితి.

అలాంటిది తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా.. మెగా అక్వా ఫుడ్ పార్క్ కు వ్యతిరేకంగా అక్కడి రైతులు.. గ్రామస్తులు చేస్తున్న పోరాటానికి సంబంధించిన వివరాల్ని పవన్ ను కలిసి.. ఆయనకు విన్నవించారు. ఏడాదిన్నరగా తాము చేస్తున్న పోరాటాల్ని పవన్ కు వివరించిన వారు.. ఆడ.. మగ అన్న తేడా లేకుండా పోలీసులు తమపై దారుణమైన కేసులు పెడుతున్నారని.. కొద్ది వారాలుగా తమ మగాళ్లు ఊళ్లల్లోకికూడా రాకుండా ఉండిపోయరంటూ బోరుమన్నారు. దీనిపై స్పందించిన పవన్.. ప్రెస్ మీట్ పెట్టి.. ఈ అంశంపై తీవ్రంగా రియాక్ట్ కావటమే కాదు.. తుందుర్రును మరో నందిగ్రామ్ ను చేయొద్దంటూ తీవ్రమైన వ్యాఖ్య చేశారు. అవకాశాన్ని బట్టి.. ఆ పరిశ్రమను అయితే మూసివేయటం కానీ.. లేదంటే సముద్రతీర ప్రాంతానికి కానీ తరలించాలంటూ ప్రభుత్వానికి సూచించారు.

ఏపీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఒక భారీ ఫుడ్ పార్క్ కు సంబంధించిన ఉదంతంపై పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తి గళం విప్పినప్పుడు దానికి ఉండే ప్రాధాన్యత ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. ఈ ఉదంతానికి సంబంధించి ఈ రోజు ప్రధాన దిన పత్రికలు అనుసరించిన తీరు చూస్తే షాకింగ్ గా అనిపించక మానదు. తెలుగు దినపత్రికల్లో ప్రధానమైన మూడు పత్రికలకు సంబంధించిన ఏపీ ఏడిషన్లు చూసినప్పుడు ఆసక్తికరంగా కనిపిస్తాయి. రెండు పత్రికల్లో అయితే.. మొదటి పేజీలో పవన్ ఊసే లేదు. మరో పత్రికలో మాత్రం సింగిల్ కాలమ్ ఇండికేషన్ రూపంలో ఇచ్చేశారు. ప్రకటనలు.. బ్రిక్స్ లాంటి ముచ్చట కారణంగా మొదటిపేజీలో ప్రముఖంగా ఇవ్వలేదని ఫీలై.. పేజీలు తిప్పితే లోపల కూడా అంతే.

ఒక ప్రధాన పత్రిక అయితే.. పవన్ వార్తను రెండు కాలమ్స్ లో ఇచ్చి.. పవన్ మీద.. ఆయన వ్యక్తిత్వాన్ని సునిశితంగా విమర్శించే పేరుతో అర పేజీని కేటాయించటం గమనార్హం. మిగిలిన ప్రధాన దినపత్రికలు ఈ అంశానికి ఇచ్చిన ప్రాధాన్యత అంతంతమాత్రమే. మరో ప్రధాన దినపత్రిక అయితే.. మూడో పేజీలో ఈ వార్తను ఇచ్చింది. ఆ పత్రిక అలవాటు ప్రకారం చూస్తే.. మూడో పేజీలో ఇచ్చే వార్తలు.. చాలా సందర్భాల్లో ఏపీ మొత్తం కూడా ఇవ్వరు. అంటే.. కృష్ణా.. గోదావరి.. ఉత్తరాంధ్రలో వార్తను ఇచ్చి రాయలసీమలో ఇవ్వకుండా ఉండే అవకాశం ఉంటుందన్న మాట. ఇక్కడ చెప్పేదేమంటే.. పవన్ మాట్లాడే మాటల్ని మొదటి పేజీలో భారీగా ఇచ్చే స్థానం నుంచి పెద్దగా ప్రాధాన్యత లేని పేజీల్లోకి.. అది కూడా చాలా తక్కువ స్థలంలో వార్తల్ని ఇవ్వటం చూస్తే.. ఏదో జరుగుతుందన్న భావన కలగటం ఖాయం. పవన్ ను అభిమానించే వారి కోణంలో చెప్పాలంటే.. పవన్ ‘పవర్’ను వీలైనంత కుదించేలా.. ఆయన ప్రాధాన్యతను..ప్రాముఖ్యతను తగ్గించే కోణంలో భాగంగా.. తక్కువ స్థలంలో వార్తను కవర్ చేసినట్లుగా ఆరోపిస్తున్నారు. మరి.. ఇందులో నిజానిజాలు ఏమిటి? వారి వాదనల్లో వాస్తవం ఎంతన్నది ప్రజలే డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/