Begin typing your search above and press return to search.

ప్లీజ్‌.. ప్ర‌జ‌ల కోసం పిసుకుడు ఆపేయండి

By:  Tupaki Desk   |   3 Oct 2017 3:30 PM GMT
ప్లీజ్‌.. ప్ర‌జ‌ల కోసం పిసుకుడు ఆపేయండి
X
బాబ్బాబు.. ప్లీజ్‌.. మీకు పుణ్యం ఉంటుంది? ద‌య‌చేసి మీ పిసుకుడు ఆపేయండంటూ హాహాకారాలు చేస్తున్నారు హైద‌రాబాద్ ప్ర‌జానీకం. ఎంత ముద్దు అయితే మాత్రం ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించాల్సిన పాత్రికేయం.. ఇప్పుడు అందుకు భిన్నంగా అధికార ప‌క్షాన్ని ఆకాశానికి ఎత్తేయ‌ట‌మే ప‌నిగా మార‌టం ఏమిటి? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మీడియా సంస్థ‌ల్లో నెగిటివ్ వార్త‌లు రావ‌టం మానేసి ఏళ్ల‌కు ఏళ్లు అయ్యింది.

అదే ప‌నిగా నెగిటివ్ వార్త‌లు రాయ‌మ‌ని ఎవ‌రూ అన‌రు. కానీ.. స‌మ‌స్య‌లు ఉన్న‌ప్పుడు ప్ర‌భుత్వానికి చురుకుపుట్టేలా.. వారికి మార్గ‌ద‌ర్శ‌నం చేసేలా వార్త‌లు రాయాల్సిన బాధ్య‌త ఉంది. కానీ.. అదేమీ ప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం ప్ర‌జ‌ల‌కు ద్రోహం చేసిన‌ట్లే. గ‌డిచిన వారం రోజులుగా ట్రాఫిక్ జాంతో హైద‌రాబాద్ న‌గ‌ర‌జీవులు ఎన్ని క‌ష్టాలు పడ్డారో తెలియంది కాదు.

ఎప్ప‌టి వ‌ర‌కో ఎందుకు నిన్న‌టి సంగ‌తే చూద్దాం. న‌గ‌రంలో రికార్డు స్థాయిలో భారీ వ‌ర్షం కేవ‌లం రెండు గంట‌ల వ్య‌వ‌ధిలో కురిసింది. అంతే.. ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌లు కుప్ప‌కూలిపోయిన‌ట్లుగా ప‌రిస్థితి మారింది. భారీ వ‌ర్షంతో డ్రెయినేజీలు పొంగి పొర్లాయి. ప‌ల్ల‌పు ప్రాంతానికి వ‌చ్చిన నీరు నిలిచిపోయింది. నాణ్య‌త నామ‌మాత్రంగా ఉండే రోడ్లు మొత్తం గుల్ల‌గుల్ల అయిపోయాయి. వ‌ర్షం కార‌ణంగా ట్రాఫిక్ జాం ఎదుర్కొన్న ప్ర‌జ‌లు.. ఊసురుమంటూ ఏ రాత్రి వేళ‌కో ఇంటికి చేరుకున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. గ‌తంలో ఎప్పుడు లేని రీతిలో కొత్త కొత్త ప్రాంతాల్లోకి వర్ష‌పు నీరు చొచ్చుకొచ్చి.. అపార్ట్ మెంట్ల‌ను ముంచెత్త‌టం ఇప్పుడు స‌మ‌స్య‌గా మారింది. పేరుకు పెద్ద పెద్ద భ‌వ‌నాలే కానీ.. నాలాల్ని ఆక్ర‌మించేసి పాప‌పు ప‌నులు చేసిన వారి పుణ్య‌మా అని ఏ త‌ప్పు చేయ‌ని ఎంద‌రో న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తున్నారు. ఇంత జ‌రుగుతున్నా.. వ‌ర్షం కురిసింది.. ట్రాపిక్ జాం అయ్యింద‌న్న వార్త‌లే కానీ.. ప్ర‌భుత్వ ఆల‌స‌త్వం.. వారి నిర్ణ‌యాల కార‌ణంగా చోటు చేసుకున్న త‌ప్పుల్ని ఎత్తి చూపించే నాథుడే లేకుండా పోయాడు.

అనుకోని రీతిలో.. త‌క్కువ గంట‌ల్లో భారీ వ‌ర్ష‌పాతం ప‌డ‌టం ఇటీవ‌ల కాలంలో మ‌హాన‌గ‌రాల్లో ప‌డుతోంది. ఈ మ‌ధ్య కాలంలో ముంబ‌యిలో రెండుసార్లు.. బెంగ‌ళూరు.. చెన్నైల్లోనూ ఇలాంటి ప‌రిస్థితే ఏర్ప‌డింది. మ‌రి.. ఈ మ‌హాన‌గ‌రాల్లో చోటు చేసుకున్న రీతిలోనే.. హైద‌రాబాద్ లో అలాంటి ప‌రిస్థితే ఏర్ప‌డితే ఏం చేయాలి? ప‌్ర‌జ‌ల‌కు క‌ష్టం రాకుండా ఏం చేస్తే బాగుంటుంద‌న్న అంశంపై ముంద‌స్తు క‌స‌రత్తు ఏదైనా ప్ర‌భుత్వం చేసిందా? అంటే లేద‌నే మాట వినిపిస్తోంది.ఒక‌వేళ చేశామ‌న్న‌దే స‌మాధానం అయితే.. మ‌రి న‌గ‌ర‌జీవి ఎందుకు ఇబ్బంది ప‌డుతున్నాడ‌న్న ప్ర‌శ్న ఉండ‌క‌నే ఉంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇలాంటి అంశాల మీద ప్ర‌భుత్వ యంత్రంగంలో ఉన్న అల‌స‌త్వాన్ని.. ముందుచూపు లేని త‌త్వ్తాన్ని.. వ్య‌వ‌స్థల ఫెయిల్యూర్‌ను అక్ష‌రంతో అడిగా పారేయాల్సింది పోయి.. పట్టించుకోన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ప్ర‌ధాన మీడియా సంస్థ‌ల వైఖ‌రిపై ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌జ‌ల ప‌క్షాన నిలిచి.. వారి వెత‌ల్ని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకొచ్చే విష‌యంలో ప‌క్ష‌పాతంతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న భావ‌న అంత‌కంత‌కూ పెరుగుతోంది. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించేలా వార్త‌లు ఎందుకు రావ‌టం లేద‌న్న మాట సామాన్యుడి నోట వ‌స్తోంది. ఇది అన్నింటి కంటే ప్ర‌మాదం. ఎందుకంటే.. ఇలాంటి సందేహాలు మీడియా మీద న‌మ్మ‌కాన్ని త‌గ్గిస్తాయ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.