Begin typing your search above and press return to search.

మీడియాకు కొత్త క‌ష్టంగా మారిన కేసీఆర్ థ‌ర్డ్ ఫ్రంట్‌

By:  Tupaki Desk   |   10 March 2018 6:30 AM GMT
మీడియాకు కొత్త క‌ష్టంగా మారిన కేసీఆర్ థ‌ర్డ్ ఫ్రంట్‌
X
ముఖ్య‌మంత్రిస్థానంలో ఉన్న కేసీఆర్ ది ఏం పోయింది.. తానేం అనుకుంటే అది చేయ‌గ‌లుగుతారు. కానీ.. జీతం రాళ్ల మీద బ‌తికే జ‌ర్న‌లిస్టుల‌కే స‌మ‌స్య‌. ఉద్య‌మ స‌మ‌యంలో భావోద్వేగాన్ని ర‌గ‌ల్చ‌టం ద్వారా.. త‌న వాద‌న‌కు అస్త్రాలుగా మీడియాను.. అందులో ప‌ని చేసే జ‌ర్న‌లిస్టుల‌ను కేసీఆర్ ఎంత‌లా ఉప‌యోగించుకున్నారో కొద్దిమందికే తెలుసు.

ఆయ‌న మాట‌ల ప్ర‌భావంతో త‌మ క‌లాన్ని ఎలా తిప్పేశారో ఇప్పుడు త‌లుచుకొనే జ‌ర్న‌లిస్టులు చాలామందే క‌నిపిస్తారు. చివ‌ర‌కు ప‌రిస్థితి ఎలా త‌యారైందంటే.. కేసీఆర్ ను త‌ప్పు ప‌డితే తెలంగాణ‌ను త‌ప్పు ప‌ట్టిన‌ట్లుగా మారింద‌న్న భావ‌న వ‌చ్చేసింది.దీంతో.. జ‌ర్న‌లిస్టుల ప‌రిస్థితి ఇప్పుడు మ‌రింత ఇబ్బందిక‌రంగా మారింద‌ని చెబుతున్నారు.

త‌న‌దైన శైలిలో మీడియా సంస్థ‌ల్ని ప్ర‌భావితం చేస్తున్న కేసీఆర్ కార‌ణంగా జ‌ర్న‌లిస్టులు కొత్త తిప్ప‌లు ఎదుర్కొంటున్నార‌ని చెబుతున్నారు. ముఖ్యంగా టీఆర్ ఎస్ పార్టీ బీట్ తో పాటు.. సీఎంపేషీ చూసే వాళ్ల‌కైతే ఇప్పుడు చుక్క‌లు క‌నిపిస్తున్నాయ‌ట‌. కేసీఆర్ థ‌ర్డ్ ఫ్రంట్ గురించి ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త త‌ర‌హా వార్త‌లు ఇవ్వాల్సిందిగా మీడియా సంస్థ‌ల నుంచి విప‌రీత‌మైన ఒత్తిడి ఉంద‌ని చెబుతున్నారు.

థ‌ర్డ్ ప్రంట్ అప్డేష‌న్ విష‌యంలో కొన్ని ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తుండ‌టంతో.. వారికి త‌గ్గ‌ట్లుగా వార్త‌ల్ని త‌యారు చేయ‌టం.. అది కాస్తా రోజువారీ కార్య‌క్ర‌మం కావ‌టం జ‌ర్న‌లిస్టులకు ఇబ్బందిగా మారింద‌ని తెలుస్తోంది. చేయి తిరిగిన జ‌ర్న‌లిస్టులు సైతం నిత్యం కేసీఆర్ ను పైకి లేపే కార్య‌క్ర‌మాన్ని చేయ‌లేక‌పోతున్నార‌ని.. ఆ మాట చెబితే మీడియా సంస్థ‌లు క‌స్సుమంటునట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ థ‌ర్డ్ ఫ్రంటేమో కానీ.. మీడియా సంస్థ‌ల‌కు మాత్రం కొత్త క‌ష్టాలు మొద‌లయ్యాయ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.