Begin typing your search above and press return to search.

తిరుమ‌ల‌లో తిట్ల పురాణం.. మీడియానే దోషి!

By:  Tupaki Desk   |   12 May 2018 5:27 AM GMT
తిరుమ‌ల‌లో తిట్ల పురాణం.. మీడియానే దోషి!
X
దేశంలో చాలానే పుణ్య‌క్షేత్రాలు ఉన్నాయి. కానీ.. ఎక్క‌డ ఉన్నా లేకున్నా.. తిరుమ‌ల కొండ మీద దేశంలోని ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల‌కు చెందిన విలేక‌రులు.. లేదంటే వారి ప్ర‌తినిధులు కొలువు తీరి ఉంటారు? దేశంలోనే సంప‌న్న దేవాల‌యంగా శ్రీ‌వారి ఆల‌యం రికార్డుల్లో ఉన్నా.. తిరుమ‌ల‌లో ఇంత భారీగా మీడియా సంస్థ‌ల ప్ర‌తినిధులు ఎందుకు ఉన్న‌ట్లు? అన్న క్వ‌శ్చ‌న్ వేసి.. స‌మాధానం కోసం ఆరా తీస్తే దిమ్మ తిరిగిపోయే విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

వాస్త‌వానికి కొండ మీద ఇంత భారీ స్థాయిలో మీడియా ప్ర‌తినిధుల అవ‌స‌రం ఉండ‌దు. కానీ.. ఎందుకు ఉంటార‌న్న ప్ర‌శ్న‌కు సూటిగా స‌మాధానం చెప్పాల్సి వ‌స్తే.. కొండ మీద ద‌ర్శ‌నం మొద‌లు మ‌రికొన్ని ప‌నులు ఈజీగా కావ‌టంతోనే. దేశంలో ఆ రాష్ట్రం.. ఈ రాష్ట్రం అన్న తేడా లేకుండా అన్ని రాష్ట్రాల్లోని ప్ర‌జ‌ల‌కు క్రేజ్ ఉన్న దేవుడు శ్రీ‌వారు. దీనికి తోడు మిగిలిన పుణ్య‌క్షేత్రాల‌కు తిరుమ‌ల‌కు మ‌ధ్య ఓ పెద్ద వ్య‌త్యాసం క‌నిపిస్తుంది. తిరుమ‌ల‌లో రెండు రోజులు హాయిగా గ‌డిపే వీలు ఉంటుంది. అక్క‌డి సౌక‌ర్యాలు.. వ‌స‌తులు.. వాతావ‌ర‌ణం అన్ని రిలాక్స్ అయ్యేలా ఉంటాయి. ఈ కార‌ణంతోనే కొంద‌రు ప్ర‌ముఖులు అదే ప‌నిగా తిరుమ‌ల‌కు వ‌స్తుంటారు.

మీడియా సంస్థ‌లు ఇంత భారీగా తిరుమ‌ల‌లో ఉండ‌టానికి కార‌ణం ఆయా మీడియా సంస్థ‌ల అబ్లిగేష‌న్ల‌ను తీర్చ‌టానికేన‌ని చెప్పాలి. కొండ మీద త‌మ ప్ర‌తినిధి లేని ప‌క్షంలో.. త‌మ వాళ్లు అక్క‌డికి వెళ్లిన‌ప్పుడు అక్క‌డి ఏర్పాట్లు చూడ‌టానికి వేరే వారి మీద ఆధార‌ప‌డాల్సి ఉంటుంది. అదే.. చంటిగాడు ది లోక‌ల్ అన్న‌ట్లుగా ఉంటే.. కొండ మీద ప‌నులు ఈజీగా చేసేసుకోవ‌చ్చు. లోక‌ల్ మీడియా ప్ర‌తినిధుల‌కు గౌర‌వ‌ప్ర‌ద‌మైన జీతాలు ఇచ్చే రోజులు మొద‌ట్నించి లేదు.

ఈ నేప‌థ్యంలో.. కొండ మీద పెట్టే త‌మ ప్ర‌తినిధికి సంబంధించిన భారం స‌ద‌రు మీడియా సంస్థ మీద ప‌డ‌దు.

అందుకే.. వీలైన‌న్ని ఎక్కువ మీడియా సంస్థ‌లు త‌మ ప్ర‌తినిధుల్ని తిరుమ‌ల కొండ మీద ఉండే అవ‌కాశాన్ని ఇస్తూ ఉంటుంది. ఇదే ఇప్పుడు పెద్ద త‌ల‌నొప్పిగా మారింద‌ని చెబుతున్నారు.

మిగిలిన ప‌నులు ఎలా ఉన్నా.. కొండ‌కు వ‌చ్చే ప్ర‌ముఖుల్ని ఏదో ప్ర‌శ్న వేసి వారి నుంచి సంచ‌ల‌న వ్యాఖ్య‌ల్ని లాగే ప్ర‌య‌త్నం చేస్తుంటారు మీడియా ప్ర‌తినిధులు. వాస్త‌వానికి కొండ మీద రాజ‌కీయాలు మాట్లాడ‌కూడ‌ద‌న్న మాట ప‌లువురు చెబుతుంటారు. మొద‌ట్లో ఇదే తీరును అక్క‌డి మీడియా ప్ర‌తినిధులు పాటించేవారు. ఎప్పుడైతే ఛాన‌ళ్లు.. వివిధ మీడియా సంస్థ‌ల ప్ర‌తినిధులు రావ‌టం మొద‌లుపెట్టారో.. తాము ప‌ని చేస్తున్నామ‌న్న భావ‌న క‌లిగేలా.. యాజ‌మాన్యం దృష్టి త‌మ మీద ప‌డేలా "ప‌ని" చేయ‌టం మొద‌లైంద‌న్న విమ‌ర్శ ఉంది.

దీనికి తోడు ఎక్క‌డెక్క‌డి నుంచో వ‌చ్చే ప్ర‌ముఖుల నోటి నుంచి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను తెప్పిస్తే.. అదో తృప్తి. అందుకే.. స్వామి వారి కొండ మీద రాజ‌కీయాల గురించి ఇత‌ర అంశాల మీద ప్ర‌శ్నించే అవ‌కాశం లేకున్నా.. త‌ర‌చూ మీడియా ప్ర‌తినిధులు సంబంధం లేని అంశాల్ని తీసుకొచ్చి ప్ర‌ముఖుల నోటి నుంచి ఏదో ఒక‌టి చెప్పించే ప్ర‌య‌త్నం అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది.

తిరుమ‌ల కొండ మొత్తం శ్రీ‌వారి సొంత‌మ‌ని.. అక్క‌డ స్వామి ప్ర‌స్తావ‌న త‌ప్పించి.. మ‌రింకే విష‌యాల్ని ప్ర‌స్తావించ‌టం స‌రికాద‌న్న న‌మ్మ‌కం ఉంది. కానీ.. దూకుడు రాజ‌కీయాలు.. అంత‌కు మించిన మీడియా అత్యుత్సాహం క‌ల‌గ‌లిపి చిత్ర విచిత్ర‌మైన ప‌రిణామాల‌కు కార‌ణం అవుతున్నాయి. వేద మంత్రాలు ఘోషించాల్సిన చోట నేత‌ల తిట్ట పురాణాలు అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్నాయి. గుడి ఎదుట మీడియా బృందం కాపుకాచుకొని ఉండ‌టం.. వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నం త‌ర్వాత ఆల‌యం నుంచి వ‌చ్చే ప్ర‌ముఖుల నుంచి బైట్లు తీసుకునే ధోర‌ణి రోజురోజుకీ ఎక్కువ అవుతోంది.

తిరుమ‌ల ప‌విత్రత దృష్ట్యా రాజ‌కీయాలతో స‌హా.. అన్ని అంశాల‌పై ప్ర‌ముఖులు మాట్లాడ‌కుండా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవస‌రం ఉంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ప్ర‌త్యేక‌హోదా నేప‌థ్యంలో ఈ మ‌ధ్య‌న తిరుమ‌ల‌కు వ‌చ్చే ప్ర‌ముఖుల చేత హోదా మీద ఏదో ఒక వ్యాఖ్య చేసేలా స్థానిక మీడియా చేస్తుంద‌న్న‌విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తోంది. దీన్ని ఇప్ప‌టికైనా చెక్ పెట్టి.. తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడాల్సిన బాధ్య‌త ఉంద‌న్న మాట ప‌లువురి నోటి నుంచి వినిపిస్తోంది. ఏదో ర‌కంగా ప‌బ్బం గ‌డుపుకోవాల‌నుకునే వారికి పుణ్య‌క్షేత్రం ప‌విత్ర‌త లాంటివి గుర్తుంటాయా?