Begin typing your search above and press return to search.

అమ్మ మీద ‘మీడియా’ హత్యాయత్నాలు?

By:  Tupaki Desk   |   6 Dec 2016 3:16 AM GMT
అమ్మ మీద ‘మీడియా’ హత్యాయత్నాలు?
X
ఉన్నది ఉన్నట్లుగా.. కుల్లాగా చెప్పాల్సి వస్తే.. ఇలానే చెప్పాల్సి వస్తుంది. ఈ మాట చెప్పినందుకు.. ఇలా రాసినందుకు మీడియా మిత్రులకు.. పాత్రికేయ సోదరులకు కోపం రావొచ్చు కానీ.. అమ్మ అనారోగ్యం ఎపిసోడ్ ను అదే పనిగా ఫాలో అయిన వాడిగా.. ఈ మాట అనక తప్పని పరిస్థితి. పోయేటప్పుడు వెంట తీసుకెళ్లేది ఏమీ లేదన్న విషయం అమ్మ ఇష్యూలో మరోసారి తేలిపోయింది. అంతేనా.. ఎంత అధికారం ఉన్నా.. మరెంత ఐశ్వర్యం ఉన్నా.. విపరీతంగా ఆరాధించే వారున్నా.. అవేమీ చావుకు తోడుగా రావని తేలిపోయింది.

కోట్లాది మందికి అమ్మగా నిలిచిన వ్యక్తి మరణానికి సంబంధించి మీడియా ప్రదర్శించిన అత్యుత్సాహం అంతాఇంతా కాదని చెప్పాలి. అందరి కంటే ముందు ఇవ్వాలన్న తపనతో పాటు.. పోటీ తత్వంతో అధికారిక ప్రకటనకు ముందే అమ్మ మరణవార్తను ప్రసారం చేసి.. ఆపై నాలుక కరుచుకొన్న వైనం అమ్మ అనారోగ్యం ఎపిసోడ్ లో చాలానే కనిపిస్తాయి. అందుకే.. అమ్మ మీద మీడియా హత్యయత్నాలు చాలానే చేసిందని చెప్పకతప్పని పరిస్థితి.

75 రోజుల క్రితం అస్వస్థతతో అమ్మ అపోలో ఆసుపత్రికి చేరిన వేళ నుంచి ఆతర్వాత వారానికే అమ్మ ఇక లేరన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. ఈ సందర్భంగా కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహాన్నిప్రదర్శించినా.. వెంటనే తప్పు తెలుసుకొని.. స్వీయ నియంత్రణ పాటించారు. అమ్మను ఆరాధించే కోట్లాది మంది ఆగ్రహానికి గురి అవుతామన్న భయం వారి అత్యుత్సాహానికి కళ్లాలుగా మారాయని చెప్పాలి.

అమ్మ అనారోగ్యం నుంచి కోలుకున్నారని.. ఒకట్రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే విషయాన్ని అమ్మే నిర్ణయం తీసుకోనున్నారన్న ప్రచారం సాగిన వేళ.. హటాత్తుగా కార్డిక్ అరెస్ట్ కు గురయ్యారన్న సమాచారంతో మీడియాలోని కొన్ని వర్గాలు సమయం కోసం ఎదురుచూశారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకూ వెయిట్ చేసి.. సాయంత్ర వేళ అత్యుత్సాహంతో అమ్మ మరణించినట్లుగా కొన్ని తమిళ ఛానళ్లు వార్తలు ఇచ్చేశాయి. అంతే.. అది నిజమా? అబద్ధమా అన్న విషయాన్ని చెక్ చేయటం కనీస పాత్రికేయ ధర్మమన్నది మర్చిపోయి.. ఎవరికి తోచినట్లుగా వారు చనిపోయినట్లుగా వార్తలు వేసేయటం కనిపిస్తుంది.

అయితే.. అమ్మ మరణించలేదన్న విషయాన్ని అపోలో ఆసుపత్రులు ఎప్పటికప్పుడు స్పష్టం చేయటంతో.. నాలుక కరుచుకున్న‘మీడియా’ వెనక్కి తగ్గిన వైనం కనిపిస్తుంది. ఇలా అమ్మ అనారోగ్యం ఎపిసోడ్ లో ఆమె చనిపోయారన్న వార్తలు ఒకట్రెండుసార్ల కంటే ఎక్కువగా రావటం మర్చిపోలేం. మీడియా.. తన అత్యుత్సాహంతో కోట్లాది మంది ఆరాధించే వ్యక్తిని సంచలన వార్త కోసం చంపేసిన వైనం చూసినప్పుడు.. అమ్మపై ‘మీడియా’ హత్యాయత్నం చేసిందన్నభావన కలగటం ఖాయం.

పోటీ మంచిదే కానీ.. అది ఆరోగ్యకరంగా ఉండాలే కానీ.. కోట్లాది మంది ఎంతో అభిమానించే వ్యక్తిని అదే పనిగా.. తమకు తోచిందే తడవుగా చనిపోయినట్లుగా వార్తలు వండేయనక్కర్లేదు. ఆ విషయాన్ని మీడియా సంస్థలు ఎవరికి వారుగా గుర్తిస్తే మరొకరి విషయంలో అయినా కాసింత బాధ్యతగా వ్యవహరించే వీలు ఉంటుంది. అంత ఓపిక.. సున్నితత్వం ఇప్పటి ‘మీడియా’కు ఉందా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/