Begin typing your search above and press return to search.

మీడియాలో రావాల్సినవి వాళ్ల నోటి నుంచా?

By:  Tupaki Desk   |   10 Dec 2016 5:02 AM GMT
మీడియాలో రావాల్సినవి వాళ్ల నోటి నుంచా?
X
గుట్టుగా.. నాలుగు గోడల మధ్య.. నలుగురైదుగురుమధ్య జరిగిన సంభాషణలు..ప్లాన్లను రట్టు చేసి.. సంచలనాలు సృష్టించటం మీడియాకు మామూలే. గడిచిన కొంత కాలంగా.. దేశంలో మీడియా పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది. ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనల్ని చూస్తే.. వీటిల్లో ఏదీ కూడా మీడియాకు ఉప్పంది.. వాటిని లీక్ చేసినట్లుగా అస్సలు కనిపించదు. ఎంతసేపటికి అధికారిక సమాచారం అందుకున్న తర్వాత చెలరేగిపోవటం.. ఆ వినిపించే కథనాలకు రెండు మూడు మసాలా అంశాల్ని యాక్ చేసేసి.. వడ్డించేయటం చేస్తుండటం కనిపిస్తుంది.

అందుకు భిన్నమైన పరిస్థితి ఇప్పుడుంది. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం ఎపిసోడ్ నే చూడండి. ఈ ఇష్యూలో అపోలో ఆసుపత్రివర్గాలు వెల్లడించిన అధికారిక సమాచారాన్ని తప్ప.. మిగిలిన సమాచారం ఏదీ బయటకు రాలేదు. తమిళనాడు మీడియాకుఅంటే.. ప్రత్యక్షంగా ఇబ్బంది ఉందని అనుకోవచ్చు. మరి.. తెలుగు మీడియా కానీ.. జాతీయ మీడియా కానీ గమ్మున ఎందుకు ఉన్నట్లు?

75 రోజులు ఒక ముఖ్యమంత్రి ఆసుపత్రిలో ఉంటే.. ఆమెకు సంబంధించిన ఫోటో ఒక్కటి కూడా ఎందుకు విడుదల కానట్లు? గవర్నర్ ను సైతం అమ్మను చూసేందుకు అనుమతించలేదన్న వార్తల్లో నిజం ఎంత? ఇలా.. ఒకటి కాదు.. రెండు కాదు చాలానే డౌట్లు వస్తాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అమ్మ మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఢిల్లీ న్యాయవాది చేస్తున్న ఆరోపణలతో పాటు.. నటి గౌతమికి వచ్చిన సందేహాలు ఇప్పుడు సరికొత్త చర్చతో పాటు.. సందేహాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి.

సాధారణంగా ఇలాంటి సందేహాలు మీడియాకు రావటం.. తమకొచ్చిన సందేహాలకు కారణాల్ని చూపించటం లాంటివి చేస్తుంటారు. కానీ.. అమ్మ ఎపిసోడ్ లో మాత్రం మీడియా ప్రేక్షక పాత్ర పోషించిందన్న వాదన ఉంది. లేనిపోని భయాలతోనే మీడియా ఆచితూచి వ్యవహరించిందన్న విమర్శ ఉంది. నిజంగానే.. మీడియా కొందరి విషయంలో అంతగా భయపడుతుందా? అన్నది ఒక ప్రశ్న అయితే.. మీడియాలో రావాల్సిన కథనాలు ప్రముఖుల నోటి వెంట రావటం వెనకున్న మర్మం ఏమిటన్నది మరో చర్చగా మారింది. దీనికి సంతృప్తికరమైన సమాధానం ఇచ్చే వారెవరు..?