Begin typing your search above and press return to search.

ప్రియాంక ఎంట్రీ..తెలుగు మీడియా అట్ట‌ర్ ఫ్లాప్ గా?

By:  Tupaki Desk   |   24 Jan 2019 4:46 AM GMT
ప్రియాంక ఎంట్రీ..తెలుగు మీడియా అట్ట‌ర్ ఫ్లాప్ గా?
X
మేం నంది అంటే నంది.. పంది అంటే పంది అంటూ ప్ర‌చారం చేసుకోవ‌టంలో తెలుగు మీడియాకు సంబంధించి కొన్ని సంస్థ‌లు గొప్ప‌లు చెప్పుకుంటాయి. తాము అచ్చేసిన వార్త‌ల‌కు చిన్న చిన్న స్పంద‌న‌లు వ‌చ్చినా ఎఫెక్ట్ అంటూ గొప్ప‌గా చెప్పుకునే స‌ద‌రు మీడియా సంస్థ‌లు.. తాము మిస్ అయిన మేజ‌ర్ వార్త‌ల విష‌యంలో మాత్రం కిక్కురుమ‌న‌ని ప‌రిస్థితి. జాగ్ర‌త్త‌గా చెక్ చేస్తే.. తెలుగుకు చెందిన ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లు మేజ‌ర్ వార్త‌ను మిస్ కావ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

విషాద‌క‌ర‌మైన అంశం ఏమంటే.. తాము మిస్ అయిన ప్ర‌ధాన వార్త‌కు సంబంధించిన ఆత్మ‌శోధ‌న‌.. చ‌ర్చ సైతం ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల్లోని అంత‌ర్గ‌త స‌మావేశాల్లోనూ చ‌ర్చ‌కు రాక‌పోవ‌టం. ప్రియాంక గాంధీ లాంటి నేత క్రియాశీల‌క రాజ‌కీయాల్లోకి అడుగు పెట్ట‌టం చిన్న విష‌యం కాదు. మ‌రింత పెద్ద విష‌యాన్ని తెలుగు మీడియాకు చెందిన ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ లేవీ స్మెల్ చేయ‌లేక‌పోయాయి. కాంగ్రెస్ పార్టీ త‌న‌కు తాను ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. గొప్ప‌గా వార్త‌ల్ని అచ్చేసి.. త‌మ వైఫ‌ల్యాన్ని క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీలోకి ప్రియాంక ఎంట్రీ ఇస్తున్న వార్త‌ను తెలుగుకు సంబంధించి అట్టే పేరు లేని ఒక మీడియా సంస్థ కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్ర‌క‌ట‌న‌కు ఒక రోజు ముందే ప్ర‌ముఖంగానే అచ్చేసింది. అంతేనా.. ఒక ఉర్దు ప‌త్రిక సైతం ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టింది. విషాద‌క‌ర‌మైన విష‌యం ఏమంటే.. తెలుగు మీడియాకు చెందిన ప్ర‌ముఖ సంస్థ‌లేవీ ప్రియాంక ఎంట్రీకి సంబంధించిన స‌మాచారాన్ని ముందుగా ప‌సిగ‌ట్ట లేక‌పోయాయి.

త‌ప్పులు దొర్ల‌టం మామూలే. కానీ.. వాటిని స‌కాలంలో స‌రిదిద్దుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఇప్ప‌టికైనా.. ఇలా ఎందుకు జ‌రిగింది? ప్రియాంక ఎపిసోడ్ ను పాఠంగా మార్చుకుంటే రాబోయే రోజుల్లో అయినా ఇలాంటి భారీ త‌ప్పులు దొర్లే అవ‌కాశం ఉండ‌దేమో? మ‌రీ..అత్యాశ కాకుంటే అంత సున్నితంగా ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లు ఇప్పుడు ఉన్నాయా? అన్న‌దే పెద్ద ప్ర‌శ్న‌.