Begin typing your search above and press return to search.

అసెంబ్లీ లాబీలో గీత దాటేసిన టీవీ ఛాన‌ళ్లు

By:  Tupaki Desk   |   7 Nov 2017 5:28 AM GMT
అసెంబ్లీ లాబీలో గీత దాటేసిన టీవీ ఛాన‌ళ్లు
X
దేనికైనా హ‌ద్దు ఉంటుంది. కానీ.. త‌మ‌కే హ‌ద్దుల్లేవ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ఇటీవ‌ల కాలంలో తీవ్ర విమ‌ర్శ‌ల‌కు గురి అవుతోంది టీవీ న్యూస్ ఛాన‌ళ్ల ఇండ‌స్ట్రీ. వెనుకా ముందు చూసుకోకుండా ఏం దొరిక‌తే దాన్ని బ్రేకింగ్‌ల కింద మార్చేస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు.. టీవీఛాన‌ళ్ల తీరును తీవ్ర‌స్థాయిలో త‌ప్పు ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ప‌లు ప‌రిమితులు ఎదుర్కొంటున్న తెలుగు మీడియా.. రానున్న రోజుల్లో అసెంబ్లీ లాబీల్లోకి అడుగుపెట్టే అవ‌కాశాన్ని టీవీ పాత్రికేయులు కోల్పోయే ప్ర‌మాదం పొంచి ఉందా? అంటే.. అవున‌నే మాట వినిపిస్తోంది.

తాజాగా చోటు చేసుకున్న ఒక ఉదంతం మీడియా వ‌ర్గాల్లో భారీ చ‌ర్చ‌కు తెర తీసింది. తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా సోమ‌వారం స‌భ జ‌రిగింది. అసెంబ్లీ జ‌రుగుతున్న వేళ‌లో.. సీనియ‌ర్ అధికారులు.. ప్ర‌జాప్ర‌తినిధులు.. ముఖ్యులు ప‌లువురు అసెంబ్లీకి వ‌చ్చిపోవ‌టం మామూలే.

ఈ సంద‌ర్భంగా మీడియాకు సుప‌రిచిత‌మైన వారితో మాట‌లు క‌లుపుతుంటారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడే మాట‌ల‌న్నీ ఆఫ్ ద రికార్డు కింద‌కు వ‌స్తుంటాయి. ఒక‌వేళ తాము మాట్లాడిన మాట‌లు ప్ర‌చుర‌ణ‌కు.. వార్త‌ల రూపంలో వాడుకోవ‌టానికైతే ఆ విష‌యాన్ని వారు చెబుతుంటారు.

కేవ‌లం తెలిసిన వారు కావ‌టంతో త‌మ అభిప్రాయాల్ని స్వేచ్ఛ‌గా చెబుతుంటారు. నిజానికి ఈ సంభాష‌ణ మీడియా ప్ర‌తినిధుల‌కు చాలా కీల‌క‌మైంది. ఏం జ‌రుగుతుంద‌న్న విష‌యాల్ని తెలుసుకోవ‌టానికి.. ప‌రిస్థితుల్ని ఆక‌ళింపు చేసుకోవ‌టానికి సాయం చేస్తుంది. అయితే.. అత్యుత్సాహంతో కొంద‌రు పాత్రికేయులు (ముఖ్యంగా టీవీ చాన‌ళ్ల రిపోర్ట‌ర్లు) చేస్తున్న ప‌ని ప‌లువురికి ఇబ్బందిగా మారుతోంది. సీనియ‌ర్ పోలీస్ అధికారిణి తేజ్ దీప్ కౌర్ అసెంబ్లీకి వ‌చ్చారు. లాబీల్లో త‌న‌కు ప‌రిచ‌యం ఉన్న మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా కొత్త‌గా రానున్న తెలంగాణ డీజీపీ ఎవ‌ర‌న్న విష‌యం మీద చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా కొన్ని వ్యాఖ్య‌లు చేసిన ఆమె.. స‌ర‌దాగా తానూ పోటీలోనే ఉన్నాన‌ని చెప్పారు. నిజానికి ఇది పాత్రికేయుల మీద న‌మ్మ‌కంతో ఆమె చెప్పిన మాట‌. కానీ.. దీన్ని కూడా వార్త‌ల‌కు ముడి స‌రుకుగా చేసుకున్న కొంద‌రు టీవీ ఛాన‌ళ్ల రిపోర్ట‌ర్లు బ్రేకింగ్ న్యూస్ కింద స్క్రోల్ వేసేశారు. దీంతో.. ఆమె అవాక్కు అయ్యారు.

మీడియా ఇంత‌లా మారిందేమంటూ ఆమె తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిడుతున్న‌ట్లు చెబుతున్నారు. మ‌రి.. ఊరికే వివాదాల్లోకి లాగితే ఎవ‌రు మాత్రం ఊరుకుంటారు చెప్పండి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మీడియా ఆఫీసుల్లో కూర్చొని టీవీల్లో వార్త‌లు.. స్క్రోలింగ్‌ ల‌తో వార్త‌ల్ని డిసైడ్ చేస్తూ.. అది రాలేదు.. ఇది రాలేద‌నే డెస్క్ ముఖ్యులు తేజ్ దీప్ ఉదంతాన్ని వార్త రూపంలో ఇవ్వాల‌న్న ఆదేశాలు జారీ అయ్యాయి.

పాత్రికేయ ప్ర‌మాణాల దృష్ట్యా తేజ్‌ దీప్ వార్త‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప్ర‌చురించ‌కూడ‌దు. అదే మాట చెబితే.. టీవీల్లో అంత హ‌డావుడి అయ్యింది కాబ‌ట్టి వార్త రాయాల‌ని బ‌ల‌వంతం పెట్టిన ప‌రిస్థితి. చివ‌ర‌కు జ‌రిగిందంతా వివ‌రంగా చెప్పి.. క్యాజువ‌ల్ గా అన్న మాట‌ల్ని పెద్ద పెద్ద హెడ్డింగ్ ల‌తో వార్త‌లు ఇవ్వ‌టం ఏ మాత్రం స‌రికాద‌ని.. రేపొద్దున ఆమె రిజాయిండ‌ర్లు పంపితే ప‌రిస్థితి ఏమిట‌న్న మాట‌తో ప‌లు ప్రింట్ మీడియా సంస్థ‌లు తేజ్ దీప్ వార్త‌ను అచ్చేయ‌లేదు. ఈ ఉదంతాన్ని చూస్తే రానున్న రోజుల్లో అసెంబ్లీ లాబీల్లోకి మీడియా ప్ర‌తినిధుల్ని రానివ్వ‌రేమో అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ఏది వార్త‌? ఏది వార్త కాద‌న్న విచ‌క్ష‌ణ కూడా మిస్ కావ‌టం దుర‌దృష్ట‌క‌ర‌మైన అంశంగా చెప్ప‌క త‌ప్ప‌దు.