Begin typing your search above and press return to search.

దేవెగౌడ‌.. కేసీఆర్ భేటీ మీద ఈ లెక్క‌లేందో..?

By:  Tupaki Desk   |   1 July 2018 3:30 PM GMT
దేవెగౌడ‌.. కేసీఆర్ భేటీ మీద ఈ లెక్క‌లేందో..?
X
తొంద‌ర‌ప‌డ‌టం ఈ మ‌ధ్య‌న మీడియాకు ఒక అల‌వాటుగా మారింది. ఏ ఇద్ద‌రు భేటీ అవుతున్నా స‌రే.. దాని మీద బోలెడ‌న్ని అంచ‌నాలు వ్య‌క్తం చేయ‌టం ఒక బ‌ల‌హీన‌గా మారింది. పెరిగిన పోటీతో.. విశ్వ‌స‌నీయ స‌మాచారం లేకున్నా.. మ‌న‌సుకు అనిపించే విశ్లేష‌ణ‌లు చేయ‌టం ఈ మ‌ధ్య‌న త‌ర‌చూ క‌నిపిస్తోంది. తాజాగా అలాంటిదే మ‌రో హ‌డావుడి ఒక‌టి తెర మీద‌కు వ‌చ్చింది.

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కంటే కూడా పారిశ్రామిక‌వేత్త‌గా.. సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖుడిగా సుప‌రిచితుడైన సుబ్బిరామిరెడ్డి కుటుంబంలో జ‌రుగుతున్న పెళ్లికి ప‌లువురు ప్ర‌ముఖుల‌తో పాటు..మాజీ ప్ర‌ధాని దేవెగౌడ కూడా హాజ‌ర‌య్యారు. కొత్త మిత్రుడు క‌మ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఆయ‌నీ సంద‌ర్భంగా క‌లిశారు.

ఆ మ‌ధ్య‌న ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌ వేళ‌.. త‌న‌తో భేటీ కావ‌ట‌మే కాదు.. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ గురించి గురించి చెప్పిన కేసీఆర్‌.. క‌ర్ణాట‌క‌లోని తెలుగువాళ్లంతా జేడీఎస్‌కు ఓటు వేయాల‌ని కోరారు.

భ‌విష్య‌త్తులో జాతీయ రాజ‌కీయాల్లో క‌లిసి ప‌ని చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెప్పే ఇరువురు నేత‌లు భేటీ కావ‌టంతో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ వాద‌న‌ను వినిపించటం మొద‌లైంది. వాస్త‌వానికి గ‌డిచిన కొద్ది నెల‌లుగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ మాట కేసీఆర్ నోటి నుంచే రాని ప‌రిస్థితి.

నిజంగా ఆయ‌న‌కు ఆ ఆలోచ‌న ఉండి ఉంటే.. మొన్న ఢిల్లీకి వెళ్లిన‌ప్పుడు ఆయ‌న మీడియాతో ఫెడ‌ర‌ల్ ప్రంట్ ప్ర‌స్తావ‌న తెచ్చేవారు. కేసీఆర్ గ‌తాన్ని చూస్తే.. ఆయ‌న ఏదైనా చేయాల‌నుకున్న‌ప్పుడు ప‌రిస్థితుల్ని త‌న‌కు అనువుగా మార్చుకోవ‌టం అల‌వాటు. జాతీయ మీడియా దృష్టిని త‌న ఫెడ‌ర‌ల్ మాట‌ల‌తో ఆక‌ర్షించే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న నోటి నుంచి రాని ప‌రిస్థితి. అలాంటప్పుడు తాజా భేటీలో దేవెగౌడ‌తో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ గురించి మాట్లాడి ఉంటార‌న్న విశ్లేష‌ణ‌లో ప‌స లేద‌ని చెప్పాలి.

కొత్త మిత్రుడి న‌గ‌రానికి వ‌చ్చిన దేవెగౌడ ను త‌న ఇంటికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆహ్వానించిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే వీరి భేటీ జ‌రిగిందే త‌ప్పించి.. మ‌రెలాంటి రాజ‌కీయ ప్రాధాన్య‌త ఈ భేటీకి లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. త‌న ఇంటికి వ‌చ్చిన మాజీ ప్ర‌ధానికి కాక‌తీయ క‌ళాతోర‌ణాన్ని.. జ్ఞాపికను అంద‌జేసిన కేసీఆర్‌.. త‌న అతిధ్యంతో దేవెగౌడ మ‌న‌సును దోచుకున్న‌ట్లుగా చెబుతున్నారు.