Begin typing your search above and press return to search.

న‌ల్ల‌గొండ రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చెప్పేసింది

By:  Tupaki Desk   |   7 Oct 2017 7:23 AM GMT
న‌ల్ల‌గొండ రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చెప్పేసింది
X
అలూ లేదు చూలు లేదు మొగుడు పేరు సోమ‌లింగం అన్న త‌ర‌హాలో ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ జ‌రిపిన స‌ర్వే ఫ‌లితం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇటీవ‌ల ఒక ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక ఒక రాజ‌కీయ జోస్యాన్ని చెప్పింది. కాంగ్రెస్ గుర్తు మీద సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన న‌ల్గొండ సిటింగ్ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ఆ మ‌ధ్య‌న అధికార టీఆర్ ఎస్ పార్టీలోకి చేర‌టం తెలిసిందే. తాజాగా ఆయ‌న‌కో ప‌ద‌వి ఇచ్చేందుకు గ్రౌండ్ సెట్ చేసిన సీఎం కేసీఆర్‌.. ఆయ‌న్ను ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని కోర‌నున్న‌ట్లుగా పేర్కొంది.

కేసీఆర్ ఇచ్చే ప‌ద‌విని చేప‌ట్టేందుకు గుత్తా రెఢీ కావ‌టంతో పాటు.. కాంగ్రెస్ బొమ్మ మీద గెలిచిన ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని కోర‌టం.. అందుకు కేసీఆర్ ఓకే అనేయ‌టం జ‌రిగింద‌ని చెబుతూ.. త్వ‌ర‌లోనే గుత్తా రాజీనామా ఖాయ‌మ‌ని పేర్కొంది. ఎంపీ ప‌ద‌వికి గుత్తా చేత‌ రాజీనామా చేయించ‌టం ద్వారా.. త‌న‌పై విమ‌ర్శ‌లు రాకుండా ఉండేలా చూసుకోవ‌టంతో పాటు.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే త‌న‌కున్న బ‌లం ఎంతో తెలుసుకోవాల‌న్న విష‌యంపైనా అవ‌గాహ‌న వ‌స్తుంద‌ని భావిస్తున్న‌ట్లుగా పేర్కొన్నారు.

అయితే.. ఈ క‌థ‌నంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది. గుత్తాతో స‌హా కేసీఆర్ సైతం రాజీనామా విష‌యం మీద సానుకూలంగా స్పందించింది. లేదు. ఇలాంటి వేళ‌.. స‌ద‌రు మీడియా సంస్థ విచిత్రంగా ఒక స‌ర్వే నిర్వ‌హించింది. ఇప్ప‌టికిప్పుడు న‌ల్గొండ ఉప ఎన్నిక జ‌రిగితే ఎలాంటి ఫ‌లితం వెల్ల‌డ‌వుతుంద‌న్న అంశంపై ప్ర‌త్యేక క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. గుత్తా రాజీనామా మీద ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించ‌కున్నా.. ఉప ఎన్నిక జ‌రిగితే ఫ‌లితం ఎలా ఉంటుంద‌న్న అంశంపై క‌థ‌నం అంటే కాస్త చిత్ర‌మ‌నే చెప్పాలి.

గుత్తా రాజీనామా ఉంటుందా? ఉండ‌దా? ఉంటే.. ఎప్పుడు ఉంటుంద‌న్న విష‌యాల మీద స‌మాచారం ఇవ్వ‌ని స‌ద‌రు మీడియా క‌థ‌నం.. ఉప ఎన్నిక ఫ‌లితం మీద మాత్రం అంకెల‌తో స‌హా వివ‌రాలు చెప్పుకొచ్చింది. తుది ఫ‌లితం అధికార టీఆర్ ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

భారీగా అచ్చేసిన క‌థ‌నాన్ని సింఫుల్ గా చెప్పేయాలంటే.. న‌ల్గొండ ఉప ఎన్నిక కానీ జ‌రిగితే టీఆర్ ఎస్ అభ్య‌ర్థి ఎవ‌రైనా స‌రే.. ల‌క్ష ఓట్ల మెజార్టీ ప‌క్కా అని లెక్కేసింది. రెండు పార్టీ ల‌మ‌ధ్య దాదాపు ఏడు శాతం ఓట్ల వ్య‌త్యాసం క‌నిపిస్తోంద‌ని.. అద‌నంగా మ‌రో ఐదు శాతం ఓట్లు వ‌చ్చే వీలుంద‌ని చెబుతూ.. శాతాన్ని ఓట్ల రూపంలో లెక్కిస్తే అది కాస్తా ల‌క్ష ఓట్ల‌కు స‌మానంగా పేర్కొంది.

న‌ల్గొండ ఎంపీస్థానం ప‌రిధిలో ఉండే అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హుజూరా బాద్‌.. మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నల్గొండ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం అధికార టీఆర్ ఎస్‌ కు కాస్త ఎదురు గాలి వీస్తుందని.. అది మిన‌హా మిగిలిన అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో గులాబీ గాలి బ‌లంగా వీస్తుంద‌న్న అంచ‌నాను వెల్ల‌డించింది.

తెలంగాణ రాష్ట్ర అధికార ప‌క్షానికి 46.3 శాతం ఓటు వేస్తామ‌ని చెబితే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌కు 39.8 శాతం మంది స‌మ‌ర్థించారు. టీడీపీ.. బీజేపీ కూట‌మి వెంట కేవ‌లం 7.24 శాతం మంది మాత్ర‌మే ఓటు వేస్తామ‌ని చెప్పార‌ని.. ఎవ‌రికి ఓటు వేయాల‌న్న విష‌యాన్ని ఇంకా నిర్ణ‌యించుకోలేద‌ని 3.6 శాతం మంది చెప్పార‌ని స‌ద‌రు క‌థ‌నంలో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. అధికార‌ప‌క్షం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్ర‌చారం చేసుకుంటున్న ద‌ళితుల‌కు మూడు ఎక‌రాల భూమి.. డ‌బుల్ బెడ్రూం ఇళ్ల ప‌థ‌కాలు స‌రిగా అమ‌లు కావ‌టం లేద‌న్న అసంతృప్తి వ్య‌క్త‌మైంది. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు.. నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు.. ఉపాధి.. శాంతిభ‌ద్ర‌త‌ల‌ను కాపాడే విష‌యంలో కేసీఆర్ పాల‌న‌కు ప్ర‌జ‌ల నుంచి సానుకూల స్పంద‌న వ్య‌క్త‌మైంది.

ఈ స‌ర్వేలో టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా తేరా చిన్న‌ప‌రెడ్డిని.. కాంగ్రెస్ అభ్య‌ర్థిగా కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిగా పేర్కొంటూ స‌ర్వే నిర్వ‌హించిన‌ట్లుగా స‌ద‌రు మీడియా సంస్థ వెల్ల‌డించింది. చిన్న‌ప‌రెడ్డికి 47.21 శాతం మంది ఓటు వేస్తామ‌ని చెబితే.. రాజ‌గోపాల్ రెడ్డికి 40.89శాతం మంది ఓటు వేయ‌నున్న‌ట్లుగా పేర్కొన్న‌ట్లు వెల్ల‌డించారు. ఇదిలా ఉంటే.. న‌ల్గొండ ఎంపీ స్థానంలో దాదాపు 2.5ల‌క్ష‌ల మంది ఎస్టీలు ఉండ‌టంతో వారి దృష్టిని ఆక‌ర్షించేలా.. ఆ వ‌ర్గానికి చెందిన బాలూ నాయ‌క్‌ను రంగంలోకి దించాల‌ని గులాబీ అధినాయ‌క‌త్వం ఆలోచిస్తున్న‌ట్లు చెబుతున్నారు. అదే జ‌రిగితే.. తుది ఫ‌లితంలో మ‌రింత మార్పులు చోటు చేసుకునే వీలుంద‌ని చెబుతున్నారు. ఏమైనా.. రాజీనామా చేయ‌క ముందే.. ఉప ఎన్నిక తుది ఫ‌లితం ఎలా ఉంటుందంటూ చేసిన స‌ర్వే ముచ్చ‌ట ఆస‌క్తిక‌ర‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.