Begin typing your search above and press return to search.

ప్యాచ‌ప్ వేళ భ‌లే ప‌ని చేశారే ఎడిట‌ర్ గారూ!

By:  Tupaki Desk   |   24 Jun 2019 5:03 AM GMT
ప్యాచ‌ప్ వేళ భ‌లే ప‌ని చేశారే ఎడిట‌ర్ గారూ!
X
అనుకోకుండా జ‌రిగే సంఘ‌ట‌న‌ల‌తో ఊహించ‌ని ప‌రిణామాలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా అలాంటిదే ఒక‌టి జ‌రిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో ఒక మీడియా అధినేత‌కు పంచాయితీ ఉంది. ఎన్నిక‌ల వేళ కేసీఆర్ కు వ్య‌తిరేకంగా ఆయ‌న ప‌ని చేశార‌ని.. ఆయ‌న ఓట‌మికి ప్ర‌య‌త్నించార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఒక‌ప్పుడు కేసీఆర్ తో చెట్టాపట్టాలు వేసుకున్న స‌ద‌రు మీడియా అధినేత‌.. త‌ర్వాతి రోజుల్లో బాబు పుణ్య‌మా అని కేసీఆర్ తో సున్నం పెట్టుకున్నారు.

స‌ద‌రు మీడియా అధినేత‌ అంచ‌నాల‌కు భిన్నంగా తెలంగాణ‌లో తిరుగులేని విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు కేసీఆర్. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ త‌న‌ను ఇబ్బంది పెట్టిన స‌ద‌రు మీడియా అధినేత మీద గొంతుల వ‌ర‌కు కోపాన్ని కేసీఆర్ పెట్టుకున్న‌ట్లుగా చెబుతారు. దీనికి త‌గ్గ‌ట్లే మొన్న‌టివ‌ర‌కూ ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల్లోనూ కోత పెట్టిన‌ట్లుగా క‌నిపించింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో త‌న‌కు వ్య‌తిరేక ప్ర‌భుత్వాలు నెల‌కొని ఉండ‌టంతో స‌ద‌రు మీడియా అధినేత భ‌లే చిక్కుల్లో ప‌డిన‌ట్లుగా మీడియా స‌ర్కిల్స్ లో త‌ర‌చూ హాట్ హాట్ గా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. అధికార బ‌దిలీ జ‌రిగిన నేప‌థ్యంలో రానున్న ఐదేళ్ల వ‌ర‌కూ ప్ర‌భుత్వాలు మారే ప‌రిస్థితులు లేక‌పోవ‌టం.. త‌ర్వాత కూడా భ‌విష్య‌త్ ఆశాజ‌న‌కంగా లేని నేప‌థ్యంలో దెబ్బ తిన్న రిలేష‌న్స్ ను ప్యాచ‌ప్ చేసే ప‌నిలో ప‌డ్డారు స‌ద‌రు మీడియా అధినేత‌.

ఇందులో భాగంగా ఇటీవ‌ల కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా గులాబీ బాస్ మ‌న‌సు ఉప్పొంగేలా.. గుండెల నిండా ఆనందం నిండేలా అక్షారాభిషేకం చేయ‌టంతో.. బిగ్ బాస్ మ‌న‌సులో కాస్త పాజిటివ్ వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. దీనికి ప్ర‌తిగా యాడ్స్ వ‌స్తున్న ప‌రిస్థితి. హ‌మ్మ‌య్య‌.. ఏదోలా బాస్ మ‌నుసు దోచుకున్నామ‌ని ఊపిరిపీల్చుకుంటున్న వేళ‌.. స‌ద‌రు మీడియా సంస్థ‌కు చెందిన ఎడిట‌ర్ ఒక ప్రైవేటు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఆయ‌న చాలా విష‌యాలు చెప్పారు.

మాట‌ల మ‌ధ్య‌లో జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తే అవి 2022లో జ‌రుగుతాయ‌ని.. అదే జ‌రిగితే తెలంగాణ‌లో టీఆర్ ఎస్ కు ఓట‌మి త‌ప్ప‌ద‌ని చెప్పేశారు. దీనికి కార‌ణాల్ని కూడా ఆయ‌న వివ‌రించారు. అయితే.. ఎప్ప‌టిలానే మీడియాలో సంచ‌ల‌న అంశానికి ఇచ్చే ప్ర‌యారిటీ.. మొత్తం విష‌యానికి ఇవ్వ‌ర‌న్న చందంగా స‌ద‌రు ఎడిట‌ర్ మాట‌ల్ని కూడా అలానే అచ్చేశారు. దీంతో స‌ద‌రు మీడియా అధినేత త‌ల‌ప‌ట్టుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ఏదో జాగ్ర‌త్త‌గా ప్యాచ‌ప్ చేసుకుంటుంటే.. ఎడిట‌ర్ మాట‌ల‌తో కొత్త చిక్కు వ‌చ్చిన‌ట్లుగా భావిస్తున్నారు. స‌ద‌రు ఎడిట‌ర్ మాట‌ల్ని గులాబీ బాస్ ఎలా తీసుకుంటార‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.