Begin typing your search above and press return to search.

పడవ ప్రమాదం.. మీడియా ముందే చెప్పింది..

By:  Tupaki Desk   |   16 Sep 2019 6:17 AM GMT
పడవ ప్రమాదం.. మీడియా ముందే చెప్పింది..
X
చేజేతులరా చేసిన నిర్లక్ష్యమిదీ.. ఇది వానాకాలం.. భద్రాచలం దిగువన భారీ వరద వస్తుందని అందరికీ తెలుసు. మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ - ఒడిషా అడవుల్లో కురిసిన వర్షాలతో 5 లక్షల క్యూసెక్కుల వరద గోదావరిలో ప్రవహిస్తోంది. పైగా కచ్చలూరు వద్ద ఏర్పడే సుడిగుండాలు బోట్లను ముంచేస్తాయి. ఇంతటి ప్రమాదకర పరిస్థితుల్లో బోటు ప్రయాణం వద్దని.. అధికారులు బోట్లను నియంత్రించాలని మీడియా ముందే హెచ్చరించినా అధికారులు పట్టించుకోలేదని తెలిసింది. అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పుడు పదుల సంఖ్యలో నిండు ప్రాణాలు బలయ్యాయి.

వర్షాకాలం మొదలు కావడం.. గోదావరి వరద ఉదృతి పెరగడంతో మీడియాలో కొద్దిరోజులుగా పాపికొండల పర్యాటకం చాలా డేంజర్ అంటూ కథనం వేశారు. సుడిగుండాలు, భారీగా వరద ఉధృతితో బోట్లు తిరగవద్దని.. అధికారులు నియంత్రించాలని హెచ్చరించారు. అయితే అధికారులు కనుక సకాలంలో స్పందించి ఉంటే ఇప్పుడు 40 మందికి పైగా గల్లంతయ్యేవారు కాదు. పదుల సంఖ్యలో మరణాలు సంభవించి ఉండేవి కావు..

పడవ మునిగిన దేవీపట్నం మండలంలో ఇంకా 36 గ్రామాలు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. ఇంతటి ఉధృత గోదావరిలో బోటును నది విహారానికి అధికారులు ఎలా అనుమతించారనే ప్రశ్న తలెత్తుతోంది. మీడియా హెచ్చరికలతోనైనా అనుమతించకుండా ఉంటే ఇప్పుడు ఇంత మంది ప్రాణాలు దక్కేవి.

పడవ ప్రమాదం.. పదుల సంఖ్యలో మరణాలతో సీఎం జగన్ వెంటనే యాక్షన్ తీసుకున్నారు. పాపికొండలు టూర్ కు వెళ్లే అన్ని పడవలను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. నదులపై పడవలను అనుమతించడానికి మార్గదర్శకాలు సూచించాలని ఒక నిపుణుల కమిటీని నియమించారు. ఇక ఈ సంఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ప్రమాదం అనేది ఎప్పుడైనా రావచ్చు. ముందు జాగ్రత్తలే అన్నింటికి మంచింది. ప్రభుత్వం ఇప్పుడు చర్యలు తీసుకుంటోంది. కానీ మీడియా ముందే హెచ్చరించినా ప్రభుత్వం, అధికారులు స్పందించి ఉంటే ఇప్పుడు భారీ ప్రమాదం తప్పేది.