Begin typing your search above and press return to search.

వైద్య విద్యార్థినులపై పోలీసుల ప్రతాపం

By:  Tupaki Desk   |   30 Aug 2017 7:03 AM GMT
వైద్య విద్యార్థినులపై పోలీసుల ప్రతాపం
X
పాకిస్థాన్‌ ఆధీనంలో ఉన్న పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతంలో అభివృద్ధి భూతద్దంలో వెతికినా కనిపించదు. యువత నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ జీవితాలు దుర్భరంగా మారడంతో, తమకు స్వాతంత్ర్యం కావాలని అక్కడి ప్రజలు పోరాడతున్నారు. స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు తహతహలాడుతున్నారు. పాకిస్థాన్‌ ప్రభుత్వ నియంతృత్వ విధానాల నుంచి విముక్తి కోసం ఆందోళనలూ ఆ ప్రాంతంలో నిత్యకృత్యంగా మారాయి. వారి ఆకాంక్షలకు వెన్నుదన్నుగా పీవోకేలో స్వాతంత్ర్య ఉద్యమాలకు భారత్‌ సైతం మద్దతునిస్తోంది.

ఈ నేపథ్యంలో.. పీవోకే ప్రాంతంలోని రావలకోట్‌లోని పూంచ్‌ మెడికల్‌ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. పరీక్షలు రాసి చాలా రోజులు గడుస్తున్నా ఫలితాలు విడుదల చేయకపోవడంతో వైద్య విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఫలితాలు ఇంకెప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన పోలీసులు విద్యార్థినులపై తమ క్రౌర్యాన్ని ప్రదర్శించారు. మహిళలు అనే విచక్షణ కూడా లేకుండా వారిని చితకబాదారు. ఈ ఘటనలో 15మంది అమ్మాయిలకు గాయాలయ్యాయి. రిజల్ట్స్‌ అడిగితే పోలీసులతో కొట్టించడంపై విద్యార్థినులు - వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.