Begin typing your search above and press return to search.

కరోనా వేళ మెడికల్ మాఫియా.. ఒక్కో మందు రూ.75 వేల నుంచి 2 లక్షలు

By:  Tupaki Desk   |   22 April 2021 10:21 AM IST
కరోనా వేళ మెడికల్ మాఫియా.. ఒక్కో మందు రూ.75 వేల నుంచి 2 లక్షలు
X
కరోనా పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్ మాఫియా దండుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా యాంటీ వైరల్ డ్రగ్ అయిన రెమిడెసివిర్ ఇంజక్షన్ తోపాటు కరోనా నివారణ మందులకు రూ.75 వేల నుంచి రూ.2 లక్షల వరకు డిమాండ్ ను బట్టి పలుకుతున్నాయి. దీంతో అప్పులు చేసి ఆ ఖరీదైన మందులు కొంటున్న పరిస్థితి నెలకొంది.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఔషధాల పేరిట జోరుగా దందా సాగుతోంది. రెమిడెసివిర్ ఇంజక్షన్ ధరలు కంపెనీని బట్టి రూ.899 నుంచి రూ.3490 వరకు ఉన్నాయి. తుసిలిజుమాబ్ ఇంజక్షన్ ధర అయితే ఏకంగా రూ.30వేల వరకు ఉంది. ఈ తరహా మందులకు కొరత ఏర్పడడంతో విచ్చలవిడిగా బ్లాక్ మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు, మాఫియా ముఠాతోపాటు కొందరు వైద్యఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందికి ఈ దందాలో భాగస్వామ్యం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం మార్కెట్ లో డిమాండ్ ను బట్టి రెమిడిసివిర్ ను రూ.25 వేల నుంచి రూ.75వేల వరకు విక్రయిస్తున్నారు. తుసిలిజుమాబ్ ను రూ.70వేల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధమనే వారి నుంచి లక్షలు వసూలు చేస్తున్నారు.

డిమాండ్ ఉన్న రెమెడిసివిర్, తుసిలిజుమాబ్ వంటి యాంటీ వైరల్ మందులు అసలు సాధారణ మార్కెట్లోనే దొరకడం లేదు. రాష్ట్ర ఔధన నియంత్రణ శాఖ ఈ యాంటీ వైరల్ ఔషధాలను ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయిస్తుంది. టీఎస్ఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరాచేస్తారు. ఈ రెండు ప్రభుత్వ సంస్థల ద్వారానే డ్రగ్స్ బయటకు వెళుతాయి. అంటే ఈ మెడికల్ మాఫియా చెలరేగిపోవడానికి పరోక్షంగా ప్రభుత్వ సంస్థల ప్రమేయం ఉందని.. ప్రభుత్వ ఉద్యోగుల హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నాయి