Begin typing your search above and press return to search.

ఏపీలో మూతబడ్డ 'మీసేవ'..కారణం ఏమిటంటే ?

By:  Tupaki Desk   |   20 Dec 2019 9:06 AM GMT
ఏపీలో మూతబడ్డ  మీసేవ..కారణం ఏమిటంటే ?
X
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మీ సేవలు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ కు పిలుపునిచ్చారు మీ సేవ ఉద్యోగులు. ఏపీలో గ్రామ సచివాలయాల రాకతో తమ జీవనోపాధి దెబ్బతినే పరిస్థితి తలెత్తిందని ఆరోపిస్తూ మీసేవ ఆపరేటర్లు సమ్మె బాట పట్టారు. గ్రామ - వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులు - వాలంటీర్లకు మీ సేవల బాధ్యతలను కూడా అప్పజెప్పటంతో.. మీసేవ కేంద్రాలపైనే ఆధారపడిన నిర్వాహకులకు నష్టం కలుగుతుందని.. తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకూ సమ్మె కొనసాగుతుందని ఆపరేటర్లు స్పష్టం చేస్తున్నారు. 11 వేల మంది ఆపరేటర్లు - 35 వేలకు పైగా ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. గతంలో ఇదే అంశం పైన ప్రభుత్వంలోని ముఖ్యుల వద్ద తమ ఆవేదన వ్యక్తం చేయగా..ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని..అయితే, ఇప్పుడు అది అమలు దిశగా కనిపించక పోవటంతో..ఈ నిర్ణయం తీసుకున్నామని ఆపరేటర్లు చెబుతున్నారు. ఈ సమ్మె కారణంగా సాధారణ ప్రజలు ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తోంది.

కాగా.. గతంలోనే ఆంధ్రప్రదేశ్‌ లో త్వరలోనే మీ సేవా కేంద్రాలను మూసివేయనున్నట్లు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం గ్రామ - వార్డు సచివాలయాలని ఏర్పాటు చేసింది. అయితే.. మీసేవలో అందించే.. వివిధ ధృవపత్రాలు - బిల్లు చెల్లింపులు అన్నింటినీ.. వీటి ద్వారా పొందాలని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. దీనితో ప్రతి దానికోసం గ్రామ - వార్డు సచివాలయాలనే ప్రజలు ఆశ్రయిస్తుండటం తో మీసేవ ఆపరేటర్ల ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయింది. దీనితో వారు సమ్మెకు దిగారు.