Begin typing your search above and press return to search.

నోట్ల రద్దు నిర్ణయం వెనక కీలకవ్యక్తి ఇతనే!

By:  Tupaki Desk   |   10 Nov 2016 4:43 AM GMT
నోట్ల రద్దు నిర్ణయం వెనక కీలకవ్యక్తి ఇతనే!
X
దేశంలోని నల్లధనం, నకిలీ నోట్లను పూర్తిగా అరికట్టేందుకని ప్రధాని నరేంద్ర మోడీ రూ. 500 - రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో దేశం మొత్తం ఒక్కసారిగా కరెన్సీ కల్లోలమే ఏర్పడిందని చెప్పవచ్చు. నేటినుంచే పాతనోట్లను మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ 4 - 5 రోజులు సామాన్య ప్రజలు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయినప్పటికీ దేశంలోని నల్లధనం బయటికి వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే దెబ్బతో నకిలీ నోట్లకు ఈ నిర్ణయం గట్టిషాకే ఇచ్చిందని చెప్పవచ్చు. ఉగ్రవాదుల వద్ద ఉన్న ఇండియన్ కరెన్సీ కి కూడా ఈ నిర్ణయం విరుగుడే!!

కాగా, ప్రధాని మోడీ ప్రకటించిన ఈ సంచలన నిర్ణయం వెనక ఓ వ్యక్తి సూచన ఉందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కేవలం 9 నిమిషాలు మాట్లాడిన ఆవ్యక్తి మొత్తం నల్లధనంపై తీవ్ర ప్రభావం చూపించారు. అతనే పుణెకు చెందిన ఆర్థిక నిపుణుడు అనిల్ బోకిల్! దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకు పెద్ద నోట్లు రద్దు చేయాలని సూచించింది ఇతనేనట! ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం ప్రధాని మోడీని అనిల్ కలిశారట. ఈ సందర్భంగా నల్లధనాన్ని అరికట్టేందుకు పలు ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన సూచనలు చేశారట. ఆ తర్వాత అతని సూచనలపై ప్రధాని దాదాపు రెండు గంటలపాటు చర్చించారని కథనాలొస్తున్నాయి.

ఈ సందర్భంగా అనిల్ బోకిల్ - ప్రధాని నరేంద్రమోడీకి చేసిన సూచనలు ఇవేనంటూ కథనాలొస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి పెద్ద నోట్లు అయిన రూ. 1000 - 500 లతోపాటు 100 నోట్లను కూడా రద్దు చేయాలి. అన్ని కార్యకలాపాలు చెక్కు - డిమాండ్ డ్రాఫ్ట్ - ఆన్‌ లైన్ ద్వారానే జరగాలి. అలాగే రెవెన్యూ కలెక్షన్ కోసం సింగిల్ బ్యాంకింగ్ సిస్టమ్ అని అమలులోకి తీసుకురావాలి. దీనికి కారణాలు కూడా చెపిన అనిల్ బోకిల్... భారతదేశంలో రోజులో సగటుగా రూ. 2.7కోట్ల ఆర్ధికపరమైన కార్యకలాపాలు జరుగుతుండగా, 20శాతం కార్యకలాపాలు మాత్రమే బ్యాంకుల ద్వారా జరుగుతున్నాయని, మిగితా కార్యకలాపాన్నీ నగదు ద్వారానే సాగుతుండటంతో సరైన లెక్క తేలడం తెలిపారట. అలాగే దేశంలో సుమారు 78శాతం మంది ప్రజలు రోజుకు రూ.20 మాత్రమే ఖర్చు చేస్తున్నారని, అందువల్ల వారికి పెద్ద నోట్లతో పెద్దగా అవసరం ఉండదని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో 500, 1000 నోట్ల రద్దు నిర్ణయం ప్రధాని తీసుకోవడానికి ప్రధాన కారణం అనీల్ సూచనలే అని తెలుస్తోంది!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/