Begin typing your search above and press return to search.

రాహుల్ న‌మ్మ‌కాన్ని ఆమె వ‌మ్ము చేయ‌లేదు

By:  Tupaki Desk   |   8 Oct 2017 10:25 AM GMT
రాహుల్ న‌మ్మ‌కాన్ని ఆమె వ‌మ్ము చేయ‌లేదు
X
ఇటీవ‌ల కాలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సోష‌ల్ మీడియా ఖాతాలు మ‌హా దూకుడుగా ఉండ‌టాన్ని గ‌మ‌నించారా? గ‌తానికి భిన్నంగా సోష‌ల్ మీడియాలో కాంగ్రెస్‌కు ఆద‌ర‌ణ పెర‌గ‌ట‌మే కాదు.. అధికార బీజేపీపై దాడి కూడా పెరిగింది. దీని వెనుక ఒక ప్ర‌ముఖ వ్య‌క్తి ఉన్నారు. కాంగ్రెస్ యువ‌రాజు రాహుల్ గాంధీ ఏరికోరి మ‌రీ.. ఎంతో న‌మ్మ‌కంతో అప్ప‌గించిన ప‌నిని ఆమె స‌క్సెస్ ఫుల్ గా నిర్వ‌హించ‌ట‌మే కాదు.. పార్టీకి కొత్త గుర్తింపు తేవ‌టంలోనూ విజ‌య‌వంత‌మైంది.

ఇంత‌కీ ఆమె ఎవ‌రంటే.. క‌న్న‌డ‌.. మ‌ల‌యాళ చిత్రాల్లో దుమ్ము రేపిన సినీ న‌టి ర‌మ్య‌. హీరోయిన్ గా మంచి పొజిష‌న్లో ఉన్న ఆమె ఉప ఎన్నిక‌ల్లో త‌ళుక్కున కర్ణాట‌క రాజ‌కీయాల్లో ఒక మెరుపులా మెరిసింది. మాజీ ఎంపీగా త‌న మార్క్‌ను వేసిన ఆమె.. కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.

ఆమె ప్ర‌తిభ‌ను గుర్తించిన రాహుల్‌.. ఆమెకు కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియాకు సంబంధించిన డిజిట‌ల్ వార్ రూమ్ బాధ్య‌త‌ల్ని అప్ప‌గించారు. ఎప్పుడైతే పార్టీ డిజిట‌ల్..ఐటీ విభాగాల బాధ్య‌త‌ను చేప‌ట్టిన ర‌మ్య‌.. అక్క‌డి ఉద్యోగుల్లో దాదాపు 85 శాతం మ‌హిళ‌ల‌తో నింపేసింది.

అక్క‌డ నుంచి బీజేపీ ప‌రివారానికి మోత‌పుట్టించే పోస్టులు పెట్టిస్తూ ప్ర‌చారాన్ని కొత్త పుంత‌లు తొక్కేలా చేస్తున్నారు. గుజ‌రాత్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మోడీ కోట‌కు బీట‌లు వారేలా ఆమె పెట్టిస్తున్న పోస్టింగులు ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఆమె లక్ష్యం 2019 ఎన్నిక‌లే అయిన‌ప్పటికీ.. సెమీఫైన‌ల్ గా గుజ‌రాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల మీద ఆమె దృష్టి సారించిన‌ట్లుగా చెబుతున్నారు. స‌మాచార‌మే ఏ పార్టీకి అయినా బ‌ల‌మ‌ని న‌మ్మే ర‌మ్య‌.. కంటెంట్ మీద పూర్తిగా ఫోక‌స్ చేయ‌టంతో పాటు.. గ‌తంలో డిజిట‌ల్ వార్ రూమ్ లో ఉండే ముగ్గురు అమ్మాయిల స్థానే 85 శాతం మంది అమ్మాయిల‌కు అవ‌కాశం క‌ల్పించ‌ట‌మే ఆమె విజ‌య ర‌హ‌స్యంగా చెబుతున్నారు.