Begin typing your search above and press return to search.

ఎప్పటిలానే ఈసారి మోడీ -జగన్ మధ్య భేటీ '45' నిమిషాలేనట

By:  Tupaki Desk   |   3 Jun 2022 3:29 AM GMT
ఎప్పటిలానే ఈసారి మోడీ -జగన్ మధ్య భేటీ 45 నిమిషాలేనట
X
సొంత పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల్ని సైతం తరచూ కలిసే ఛాన్సు ఇవ్వని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఇటీవల కాలంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాత్రం అదే పనిగా కలుస్తూ ఉండే తీరు రాజకీయ వర్గాల్లో తరచూ చర్చనీయాంశంగా మారుతూ ఉంటుంది. అసలెందుకు భేటీ అవుతారో? ఏం మాట్లాడుకుంటారో? అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పే వారే కనిపించరు. నిత్యం బిజీబిజీగా ఉండే ప్రధాని మోడీ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మాత్రం ఠంచన్ గా టైమిస్తుంటారు. ఆయన్ను కలిసిన ప్రతిసారి భారీ వినతిపత్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి అందిస్తుంటారు.

ఆ వినతుల్లో ఎన్ని పూర్తి అయ్యాయి? మరెన్ని పూర్తి కానున్నాయి? అన్న విషయం మీద మాత్రం అవగాహన లేని పరిస్థితి. తరచూ కలిసే ఈ ఇద్దరు ప్రముఖుల మధ్య జరిగే సంభాషణ సారాంశం ఏమిటన్న దానిపై ఏ ఒక్కరూ మాట్లాడరు. తాజాగా ప్రధాని మోడీతో భేటీ అయిన జగన్మోహన్ రెడ్డి.. ఎప్పటిలానే 45 నిమిషాల పాటు ఆయనతో ఉన్నారు.

ఈ సందర్భంగా ఆయనతో పలు అంశాల మీద మాట్లాడినట్లుగా అధికారికంగా విడుదల చేసిన ప్రెస్ మీట్ లో చెప్పినప్పటికీ.. నిజానికి అంత సీన్ ఉంటుందా? అన్నది ప్రశ్న. 45 నిమిషాల పాటు మాట్లాడే సందర్భంలో ఏపీకి ప్రయోజనం కలిగించే అంశాల మీద ఆయన ఏం మాట్లాడారు?

ప్రత్యేక హోదా మీద చర్చ అసలు వచ్చిందా? లేదంటే.. దాన్ని శాశ్వితంగా తమ మధ్య చర్చల మధ్య తేకూడదన్న నిర్ణయానికి వచ్చారా? అన్న దానిపై క్లారిటీ లేదనే చెప్పాలి. పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయిన ఏపీకి సాయం అందించే దిశగా అడుగులు వేసేందుకు మోడీ సాయం కావాల్సి వచ్చినట్లుగా చెబుతున్నారు.

అయితే.. తాజాగా భేటీ మొత్తం కూడా పెండింగ్ పనుల మీదనో.. మరో అంశం మీదనో కాకుండా కీలకమైన సాయం కోసం జగన్ ను మోడీ పిలిపించారన్న మాట బలంగా వినిపిస్తోంది. తాజాగా రాష్ట్రపతి ఎన్నికలకు వేళైంది. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాము బరిలోకి దించే రాష్ట్రపతి అభ్యర్థి విజయం సాధించేందుకు అవసరమైన ఓట్ల గురించి జగన్మోహన్ రెడ్డిని అడిగి ఉండొచ్చన్న మాట వినిపిస్తోంది.

ఎన్డీయేకు సొంత బలం లేని నేపథ్యంలో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీల అండతోనే విజయం సాధించాల్సి ఉంది. అదే.. ఏపీ ముఖ్యమంత్రి ప్రధాని పిలిపించుకొని మాట్లాడి ఉంటారని అంచనా వేస్తున్నారు. తాజాగా భేటీలో తెలంగాణ ముఖ్యమంత్రి జట్టు కట్టే టీంలో ఉండే అవకాశం లేదన్న విషయంపైనా క్లారిటీ తీసుకున్నారన్న మాట వినిపిస్తోంది.